ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుక్కు ఈ చిత్రాన్ని యాక్షన్ అడ్వెంచర్ గా తీర్చిదిద్దుతున్నారు. ఆల్రెడీ పుష్ప మొదటి భాగం అల్లు అర్జున్ కి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టింది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ కి ఉండే క్రేజ్ వేరు. బన్నీకి ఫస్ట్ బిగ్ హిట్ ఇచ్చింది సుకుమారే. గంగోత్రి చిత్రంతో బన్నీ హిట్ అందుకున్నప్పటికీ స్టార్ స్టేటస్ రాలేదు. అది మాస్ మూవీ కూడా కాదు. గంగోత్రి ఫ్యామిలీ ఓరియెంటెడ్ డ్రామా. దీనితో యువతలో, మాస్ లో ఎలాంటి క్రేజ్ రాలేదు.
గంగోత్రి తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య చిత్రం అప్పట్లో యువతని ఒక ఊపు ఊపింది. వైవిధ్యమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఆ చిత్రంతో బన్నీకి యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. కానీ ఆర్య చిత్రం వెనుక సుకుమార్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
అప్పటికే రచయితగా కష్టాలు పడుతున్న సుకుమార్ ని వివి వినాయక్ గుర్తించారు. దిల్ చిత్రం కోసం సుకుమార్ ని వినాయక్ తన దగ్గర పెట్టుకున్నారట. ఆ టైంలో సుకుమార్ ఆర్య కథని రెడీ చేశారు. దిల్ రాజు కూడా పరిచయం కావడంతో ఆయనకి ఆ కథ వినిపించినట్లు సుకుమార్ బెస్ట్ ఫ్రెండ్ నటుడు కిట్టయ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆర్య చిత్రం వెనుక జరిగిన సంగతులన్నీ కిట్టయ్య పంచుకున్నారు.
ఆర్య వైవిధ్యమైన పాయింట్ తో ఉండే కథ. కాబట్టి దిల్ రాజుకి నచ్చలేదు. కానీ నన్ను నమ్మి ఈ చిత్రం చేస్తే మంచి హిట్ సినిమా చేసి మీ చేతుల్లో పెడతాను అని సుక్కు హామీ ఇచ్చినట్లు కిట్టయ్య పేర్కొన్నారు. వివి వినాయక్ కి కూడా కథ నచ్చింది. కానీ చాలా మందికి నచ్చడం లేదు.
ఈ చిత్రం కోసం చాలా మంది హీరోలని అనుకున్నప్పటికీ ఒక పార్టీలో సుకుమార్ బన్నీని చూశారు. వెంటనే దిల్ రాజుకి చెప్పారు. ఆ అబ్బాయిని ఈ చిత్రానికి ఒప్పించండి. సూపర్ హిట్ సినిమా చేసి పెడతా అని చెప్పారట. బన్నీ ఎందుకు ఈ కథని అని అంతా అనుకున్నారట. కానీ సుకుమార్ పట్టుబట్టేసరికి దిల్ రాజు అల్లు అరవింద్ ని అడిగారు. బన్నీకి మాత్రం కథ పిచ్చ పిచ్చగా నచ్చేసింది.
కానీ అల్లు అరవింద్ కి ఈ కథ ఏ కోశానా నచ్చలేదు. ఈ కథ ఏంటి ఇలా ఉంది. ఇది మా అబ్బాయి రెండో సినిమానే. ఇలాంటి సమయంలో ప్రయోగాలు చేస్తే వాడి కెరీరే ముగిసిపోతుందేమో అని అల్లు అరవింద్ భయపడ్డారట. అప్పుడు కథ చిరంజీవి దగ్గరకి వెళ్ళింది.చిరు కథ వినగానే ఎలాంటి డౌట్ వద్దు.. ఈ మూవీ బన్నీకి పర్ఫెక్ట్.. సూపర్ హిట్ అవుతుందని మెగాస్టార్ తేల్చేశారు. కట్ చేస్తే ఆర్య రిజల్ట్ ఏంటో అందరికి తెలుసు. అదన్నమాట ఆర్య వెనుక జరిగిన కథ.