ఎపిసోడ్ ప్రారంభంలో బయటికి వచ్చిన అప్పు కార్ డోర్ తీస్తుంది. అక్కడ అనామిక ని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. చిన్న షాపింగ్ చేద్దామని వచ్చాము, నువ్వొస్తే మా షాపింగ్ ఫాస్ట్ గా అయిపోతుంది అంటుంది అనామిక. కోపంగా కళ్యాణ్ వైపు చూస్తుంది అప్పు. అంటే నిజం చెప్తే రావని.. అంటూ సంజాయిషీ ఇచ్చుకుంటాడు కళ్యాణ్. అప్పు కోపంగా వెళ్లి వెనక సీట్లో కూర్చుంటుంది.
మరోవైపు ఇంట్లో వాళ్ళందరికీ టీ ఇస్తుంది కావ్య. లేట్ అయినందుకు అత్తగారికి సారీ చెప్తుంది. తప్పు చేయటం ఎందుకు సారీ చెప్పడం ఎందుకు అంటుంది అపర్ణ. తప్పు చేసింది నీ కొడుకు వెళ్లి వాడిని అడుగు అంటాడు సుభాష్. కోడల్ని ఒక మాట అననివ్వడు అంటుంది రుద్రాణి. ఆ తర్వాత చక చకా ఇంటి పని చేస్తున్న కావ్య ని చూసి ఆనందపడతారు సీతారామయ్య దంపతులు.
తను పని చేసుకునే విధానం నువ్వు కాపురానికి వచ్చిన కొత్తలో చేసుకునే పనిలాగే కనిపిస్తుంది అంటాడు సీతారామయ్య. అవును బావ ఈ కాలం పిల్లలాగా కాదు అన్ని చక్కగా సర్దుకుని పోతుంది అంటుంది చిట్టి. అప్పుడే కిందికి వస్తున్న కనుక ఈ మాటలు విని ఆనందపడుతుంది. వెళ్లి కూతురికి సాయం చేయాలనుకుంటుంది. కానీ అపర్ణ ఒప్పుకోదు కోడలు తన ఇంటి పని చేసుకుంటే తప్పేముంది అంటుంది.
కావ్య కూడా వద్దులేమ్మా కొంచెం పనే కదా నేను చేసుకుంటాను వెళ్లి అక్కకి ఏం కావాలో చూడు అని చెప్పి పంపించేస్తుంది. మరోవైపు లాయర్ తో మాట్లాడుతాడు రాహుల్. ఈరోజు డబ్బులు ఎలాగైనా ఇస్తాను మీరు బెయిల్ అరేంజ్ చేయండి అని చెప్తాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత స్వప్న దగ్గరికి వెళ్లి 10 లక్షలు కావాలి అని అడుగుతాడు.
షాక్ అయిపోతుంది స్వప్న. అంత డబ్బు ఎందుకు, అయినా అంత సింపుల్ గా అడిగేసావ్ ఏంటి మళ్లీ ఏం తప్పు చేసావ్ అని అడుగుతుంది. నువ్వేమి చెయ్యొద్దు, నీ నగలు ఇవ్వు చాలు తాకట్టు పెట్టుకొని మళ్ళీ డబ్బు రాగానే ఈ నగలు ఇచ్చేస్తాను అంటాడు. ఇవి తాతయ్య నాకు కోడలుగా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఇచ్చారు. రేపో మాపో సీమంతం అనుకుంటున్నారు ఆరోజు వేసుకోకపోతే నన్ను తిడతారు.
అప్పటికల్లా నా నగలు నాకు తెచ్చి ఇవ్వగలవా.. సారీ రాహుల్, నీ మీద నాకు నమ్మకం లేదు, నగలు ఇవ్వలేను అని చెప్పి తన నగల్ని లోపల దాచేసి కిందికి వెళ్ళిపోతుంది స్వప్న. దీని పర్మిషన్ ఏంటి, ఇప్పటికే దాన్ని అడిగి టైం వేస్ట్ చేశాను అనుకొని కబోర్డ్ లో ఉన్న నగలు తీసి బ్యాగ్ లో పెట్టుకుని కిందికి వెళ్తాడు.ఇంట్లో వాళ్లు అందరూ హల్లో ఉండడం చూసి కంగారు పడతాడు కానీ కామ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు.
ఇంతలో అటుగా వెళుతున్న రాజ్ చేతిలో ఏంటది అని అడుగుతాడు. ప్రకాష్ ఏవో కొత్త నగల డిజైన్స్ లాగా ఉన్నాయి ఏది చూపించు అని రాహుల్ చేతిలో బ్యాగ్ తీసుకోబోతాడు. ఆ బ్యాగ్ కింద పడిపోయి నగలన్నీ పైన పడిపోతాయి. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అన్ని నగలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు రాజ్. ఇంకెక్కడికి తాకట్టు పెట్టడానికి అయి ఉంటుంది కావ్య.
ఏంటి రాహుల్ ఇలా చేసావు, ఇప్పుడిప్పుడే బాధ్యతగా నడుచుకుంటున్నావు అనుకుంటున్నాము, నీకు ఒక బ్రాంచ్ అప్పచెప్పాలని నేను డాడీ మొన్నే అనుకున్నాము. మళ్ళీ నువ్వు పాత రాహుల్ లాగే ఉన్నావు అని రాహుల్ మీద విరుచుకుపడతాడు రాజ్. ఇంట్లో అందరూ తలొక మాట అంటారు. అప్పుడు స్వప్న వచ్చి నా భర్త గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి అని అందరి మీద కోప్పడుతుంది.
నువ్వైనా ఎందుకు నోరు ఇవ్వడం లేదు రాహుల్, ఆ నగలు నేనే కదా మెరుగు పట్టించుకోని రమ్మన్నాను అంటుంది స్వప్న. స్వప్న కూడా తనని తిడుతుందేమో అనుకున్న రాహుల్ తనని వెనకేసుకొచ్చేసరికి షాక్ అవుతాడు. నగలు చూసేసరికి అందరూ నన్ను దోషిని చేసేసారు, అసలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. రాజ్ కూడా నన్ను నమ్మలేదు అంటూ దొంగ కన్నీరు కారుస్తాడు రాహుల్.
నీ జీవితాన్ని జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో అనే బాధతో అలా అన్నాను అని సారీ చెప్తాడు రాజ్. మెరుగు పెట్టించే వాడిని రేపు ఇంటికి రమ్మని చెప్తాను తీసుకువెళ్లి ఆ నగలు లోపల పెట్టు అని స్వప్నకి చెప్తుంది చిట్టి. మరోవైపు కారులో కూర్చున్న అనామిక చూసావా నువ్వు రాబట్టే షాపింగ్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది అని అప్పుతో అంటుంది. తరువాయి భాగంలో నడుము నొప్పితో బాధపడుతున్న భార్యకి సేవ చేస్తూ ఉంటాడు రాజ్.