‘మా పిల్లలు ఉగ్రవాదులు అవుతారని అన్నారు’, ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ప్రియమణి ఫైర్‌

First Published | Oct 8, 2024, 7:48 AM IST

వివాహ ప్రకటన తర్వాత తాను ఎదుర్కొన్న తీవ్రమైన సైబర్ వేధింపుల గురించి ప్రియమణి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె షాకింగ్‌ కామెంట్‌ చేశారు. 

 2017 లో నటి ప్రియమణి, ముస్తఫా రాజ్ వివాహం చేసుకున్నారు. వీరి లవ్‌ మ్యారేజ్‌. మొదట ఈ ఇద్దరు బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో  కలుసుకున్నారు, ఆ టైమ్ లో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. చివరికి పెళ్లి చేసుకున్నారు. అయితే తన వివాహం తర్వాత తాను ఎదుర్కొన్న తీవ్రమైన సైబర్ వేధింపుల గురించి ప్రియమణి వెల్లడించారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
 

తనకూ, ముస్తఫా రాజ్‌కీ పుట్టబోయే పిల్లలు "ఉగ్రవాదులు" అవుతారని కొందరు తనను దూషించారని ప్రియమణి చెప్పారు. తన వివాహ ప్రకటన తర్వాత ప్రారంభమైన ఈ ద్వేష ప్రచారం వివాహం తర్వాత కూడా కొనసాగిందని ఆమె అన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మత విశ్వాసాలను ప్రశ్నించే స్థాయికి ఈ సైబర్ వేధింపులు చేరుకున్నాయని ప్రియమణి చెప్పారు. 


ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వివాహ ప్రకటన తర్వాత తాను ఫేస్‌ చేసిన సంఘటనలను ఆమె వెల్లడించారు. తమ  ఎంగేజ్‌మెంట్‌ని ప్రకటిస్తూ ఫేస్‌బుక్‌లో కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక ప్రకటనను పోస్ట్ చేశామని, చాలా సంతోషంగా ఆ ప్రకటన చేశామని, కానీ దాని తర్వాత ద్వేషపూరిత వ్యాఖ్యలు వెల్లువెత్తాయని  అన్నారు. "జిహాదీ, ముస్లిం, మీ పిల్లలు ఉగ్రవాదులు అవుతారు" అని ప్రజలు నాకు మెసేజ్‌లు  పెట్టారని ఆమె తెలిపారు. 

ఇది తనను నిజంగా బాధ పెట్టిందన్నారు. “ఇది చాలా నిరాశ కలిగించింది. మేము ఎందుకు లక్ష్యంగా ఉన్నాము? కులమతాలకు అతీతంగా వివాహం చేసుకున్న ప్రముఖులు చాలా మంది ఉన్నారు. వారు ఒక మతాన్ని మాత్రమే అనుసరించాలని లేదా స్వీకరించాలని ఎక్కడా లేదు. వారు మతంతో సంబంధం లేకుండా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇలాంటి వాటిలో ఎందుకు ఇంత ద్వేషం ఎందుకో నాకర్థం కాలేదు” అని ప్రియమణి అన్నారు.
 

ఇటీవల జరిగిన ఓ సంఘటనను ప్రియమణి పంచుకుంటూ, ఈద్ రోజున శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటో పోస్ట్ చేశానని, అప్పటి నుంచి తాను ఇస్లాం మతం స్వీకరించానని ప్రచారం మొదలైందని చెప్పారు. "నేను మతం మారానని వారికెలా తెలుస్తుంది? నేను హిందువుగా జన్మించాను, ఎల్లప్పుడూ అలాగే ఉంటాను, మేము (ప్రియమణి, ఆమె భర్త) ఒకరి విశ్వాసాలను ఒకరు గౌరవించుకుంటాము, ఎలాంటి ఒత్తిడి లేదు" అని ప్రియమణి స్పష్టం చేశారు.
 

“నేను ఈద్‌కు పోస్ట్ చేసినప్పుడు, నేను నవరాత్రికి ఎందుకు పోస్ట్ చేయలేదని కొందరు అడిగారు. దానికి ఎలా స్పందించాలో నాకు తెలియదు, కానీ ఇకపై అది నన్ను బాధించదు. అలాంటి ప్రతికూలతపై దృష్టి పెట్టకూడదని నేను నిర్ణయించుకున్నాను” అని ఆమె అన్నారు.

ఇదిలా ఉండగా, ప్రియమణి తదుపరి విజయ్ హీరోగా నటిస్తున్న దళపతి 69 చిత్రంలో నటిస్తున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. చెన్నైలో జరిగిన ఈ చిత్రం పూజా కార్యక్రమంలో ప్రియమణి పాల్గొన్నారు. 

Latest Videos

click me!