
ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `ది రాజా సాబ్` థియేటర్లలో రన్ అవుతుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం ఫర్వాలేదు. ఇప్పటికే ఇది రెండు వందల కోట్లు దాటిందని టీమ్ ప్రకటించింది. ఇది మారుతి దర్శకత్వంలో రూపొందిన విషయం తెలిసిందే. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, జరీనా వాహబ్, సముద్ర ఖని వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫలితంపై ప్రభాస్ స్పందించారు.
`ది రాజా సాబ్` విడుదలయ్యాక దర్శకుడు ప్రభాస్ మాట్లాడారట. ఆయనకు ధైర్యం చెప్పారట. అంతేకాదు ఈ మూవీ ఫలితాన్ని తాను ముందే ఊహించినట్టు తెలిపారట. సైకలాజికల్ ఎలిమెంట్స్ తో కొత్త పాయింట్ చూపించాం కాబట్టి ప్రేక్షకులకు రీచ్ కావడానికి కొంత టైమ్ పడుతుందని ముందే అనుకున్నామన్నారు మారుతి. `ప్రభాస్ గారు కూడా ప్రశాంతంగా ఉండు డార్లింగ్, మనం కొత్త ప్రయత్నం చేశాం. ఆడియెన్స్ కి చేరడానికి కొంత టైమ్ పడుతుంద`ని చెప్పారు. రీసెంట్ గా ఓల్డ్ గెటప్ సీన్స్ యాడ్ చేశాక ఆయనకు మెసేజ్ చేశా, ఆ సీన్స్ అన్నీ పర్పెక్ట్ గా సెట్ అయ్యాయని చెప్పారని మారుతి పంచుకున్నారు. తాజాగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నారు.
`ది రాజా సాబ్` కి వస్తోన్న టాక్‌పై రియాక్డ్ అవుతూ, `సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ దక్కుతోంది. సంక్రాంతి హాలీడేస్ బిగిన్ కాకముందే ఈ సినిమా రూ.200 కోట్ల రూపాయల మార్క్ టచ్ చేయడం హ్యాపీగా ఉంది. మా సినిమా ప్రేక్షకులకు నచ్చడం వల్లే బాక్సాఫీస్ వద్ద ఇంత హ్యూజ్ నెంబర్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సంక్రాంతి హాలీడేస్ లో మరింతగా ప్రేక్షకాదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. సంక్రాంతి పండగ సందడిలో ఉంటారు కాబట్టి ప్రేక్షకులు అలాంటి ఒక లైటర్ వేన్ సినిమా ఎక్స్ పెక్ట్ చేసి ఉంటారు. ఈ కథలో బొమన్ ఇరానీ పాత్ర ఎంటరైనప్పటి నుంచి సైకలాజికల్ గా టర్న్ అవుతుంది. ఆ సీన్స్ వెనక మేము అనుకున్న కాన్సెప్ట్ కొందరికి సులువుగా అర్థం కాకపోయి ఉండొచ్చు. హారర్ మూవీస్ లో దెయ్యాన్ని చంపడం ఈజీ. ఎలాగైనా చంపొచ్చు. కానీ ప్రభాస్ గారి లాంటి పాన్ ఇండియా హీరోతో ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి సాదా సీదా హారర్ కామెడీ చేయొద్దనే ఇలా ఫాంటసీ, సైకలాజికల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి బిగ్ స్కేల్ మూవీ చేశాం` అని తెలిపారు.
మారుతి ఇంకా మాట్లాడుతూ, `ఇప్పుడు మూవీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగుందంటూ వాళ్లే మెసేజ్ లు పంపుతున్నారు. మీరు ఫస్ట్ టైమ్ మూవీ చూసినప్పుడు మీకు కావాల్సిన ఎలిమెంట్స్ వెతుక్కుంటారు. కానీ సెకండ్ టైమ్ మూవీ చూస్తే ఎంత డెప్త్ గా ఆలోచించే ఈ సీన్ చేశారు అనేది అర్థమవుతుంది. `రాజా సాబ్` లాంటి సినిమా చేయడం సులువు కాదు. ఒక వ్యక్తి ట్రాన్స్ లోకి వెళ్లాడు అనేది విజువల్ గా చూపించడం కష్టం. అతని సబ్ కాన్షియస్ మైండ్ ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయాలి. ఈ మూవీలోని ఓల్డ్ గెటప్ లో రివర్స్ సీన్స్ కోసం చాలా కష్టపడ్డాం. కొన్ని సీన్స్ కోసం ప్రభాస్ గారు 15 డేస్ ఎలా చేద్దామని ఆలోచించారు. నువ్వు ఇంత గ్రేట్ సీన్ రాశావు డార్లింగ్, నేనూ నా వందశాతం ఎఫర్ట్స్ పెట్టాలి కదా అని ఆయన అనేవారు. జోకర్ సీన్ లో ఆయన చిన్న స్మైల్ ఇస్తారు. ఆ స్మైల్ తో గ్రేట్ పర్ ఫార్మ్ చేశారు అనిపించింది` అని తెలిపారు మారుతి.
ఇక ప్రస్తుతం ఆయన `ది రాజా సాబ్` రిజల్ట్ పైనే ఫోకస్ చేసినట్టు తెలిపారు. పార్ట్ 2 గురించి ఇంకా ఏం ఆలోచించలేదని వెల్లడించారు. ఈ మూవీ నుంచి బయటకు వచ్చాక నెక్ట్స్ ఏం చేయాలనేది ఆలోచిస్తానని తెలిపారు. మారుతి చెప్పిన దాని ప్రకారం `ది రాజా సాబ్` పార్ట్ 2 ఉండబోదని అర్థమవుతుంది. ఈ మూవీ రిజల్ట్ ని బట్టి కూడా ఆ ప్రయత్నాన్ని విరమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ప్రభాస్‌కి ఇప్పట్లో మరో కొత్త సినిమా చేసే అవకాశం లేదు. ఆయన కమిట్ అయిన సినిమాలు పూర్తి కావడానికే ఇంకా నాలుగైదేళ్లు పడుతుంది. అప్పటి వరకు అంతా మర్చిపోతారని చెప్పొచ్చు.