
రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన ప్రభాస్ ఇమేజ్ పరంగా పెదనాన్నని మించిపోయాడు. పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తోన్న ప్రభాస్ త్వరలో తన 46వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. డార్లింగ్ బర్త్ డే హడావుడి ఈ నెల ప్రారంభం నుంచి షురూ అయ్యింది. ఫ్యాన్స్ ఏకంగా ఇది ప్రభాస్ బర్త్ డే మంత్‌గా ప్రకటించారు. అప్పట్నుంచి డార్లింగ్‌కి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని పంచుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. అయితే చర్చ వరకే కాదు అభిమానులను అలరించేందుకు సినిమాలు కూడా రాబోతున్నాయి. డార్లింగ్ నటించిన సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సారి మూడు చిత్రాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. ఆయన హీరోగా మారి నటించిన తొలి చిత్రం `ఈశ్వర్`ని రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తుండటం విశేషం. `ఈశ్వర్ 4కే` లో సినిమాని విడుదల చేస్తున్నారు. దీనికోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ విషయాన్ని టీమ్ ప్రకటించింది. జయంత్ సీ పరాంజీ దర్శకత్వంలో `ఈశ్వర్` మూవీ రూపొందిన విషయం తెలిసిందే. 2002 నవంబర్ 11న విడుదలై ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం సక్సెస్ కాలేకపోయింది. మరి ఇప్పుడు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
దీంతోపాటు మరో మూవీ కూడా అదే రోజు రాబోతుంది. `పౌర్ణమి` చిత్రాన్ని కూడా రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. గతంలోనూ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నెల 23నే ఈ సినిమాని కూడా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో త్రిష, ఛార్మీ, సింధు తులానీ హీరోయిన్లుగా నటించారు. 2006లో విడుదలైన ఈ మూవీ సైతం డిజప్పాయింట్ చేసింది. ఇప్పుడు కొందరు మరోసారి థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. డార్లింగ్ బర్త్ డే క్రేజ్‌ని క్యాష్ చేసుకోబోతున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు మరో భారీ సినిమా కూడా రాబోతుంది. ప్రభాస్ నటించిన పూర్తి యాక్షన్ మూవీ `సలార్`ని మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రెండేళ్ల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది భారీ సక్సెస్ సాధించింది. సుమారు ఏడువందల కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. థియేటర్ ఎక్స్ పీరియెన్స్ ని అందించే ఈ చిత్రం మరోసారి ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది. `సలార్`ని ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ దుమ్ములేపుతుంది.
ఇవి కాకుండా ప్రభాస్ నటించిన మరో మూవీ కూడా రాబోతుంది. అదే `బాహుబలిః ది ఎపిక్`. రెండు పార్ట్ లను కలిపి `బాహుబలిః ది ఎపిక్`గా మార్చేశారు దర్శకుడు రాజమౌళి. ఒకే మూవీగా దీన్ని రిలీజ్ చేయబోతున్నారు.అయితే ప్రభాస్ బర్త్ డే రోజున కాకుండా అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. స్ట్రెయిట్ మూవీ తరహాలోనే రిలీజ్ చేస్తుండటం విశేషం. ప్రభాస్ బర్త్ డే మంత్ కావడంతో ఆ వైబ్ ఆడియెన్స్ లో ఉంటుంది. అన్నింటికి మించి ఇండియన్ సినిమాని షేక్ చేసిన `బాహుబలి`ని ఒకే పార్ట్ లో చూపించబోతున్నారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి మూవీ ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్‌తోపాటు రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, అడవి శేషు, సత్య రాజ్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. 2015లో మొదటి పార్ట్ విడుదలైతే, 2017లో రెండో పార్ట్ విడుదల చేసింది.