అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు, విచారణకు హాజరు కావాలని ఆదేశం

First Published | Dec 24, 2024, 6:17 AM IST

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. చిక్కడపల్లి పోలీసులు మంగళవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.


ఏ11 నిందితుడిగా ఉన్నఅల్లు అర్జున్‌కు (Allu Arjun) హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రశ్నించనున్నారు. ‘

పుష్ప 2’ ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.


దీనికి సంబంధించి 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో అల్లు అర్జున్‌ 11వ నిందితుడిగా ఉన్నారు. డిసెంబరు 13న ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.

అనంతరం రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. తొక్కిసలాట ఘటనపై మరింత లోతుగా విచారించే అవకాశముంది.
 



పోలీసులు అనుమతి నిరాకరించినా ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయటంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయనను విచారించేందుకు సిద్ధమయ్యారు. 
 


మరో ప్రక్క పోలీసులు చెప్పిన ఆధారాలతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో మాట్లాడారని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి మాటలను ఎదిరిస్తూ.. ప్రభుత్వంపై నిందలేస్తూ సినీ నటుడు అల్లు అర్జున్‌ మాట్లాడిన తీరు సరైంది కాదని, ఆయన వెంటనే సీఎంకు, ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.
 


 యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రద్దీ ప్రాంతంలో రోడ్‌ షో వద్దని పోలీసులు హెచ్చరించినా, అనుమతి ఇవ్వకున్నా.. అల్లు అర్జున్‌  ధిక్కరించారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతికి, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లడానికి కారణమయ్యారు.

ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించే మానవత్వం కూడా లేకుండా పోయింది. ఒక్క రోజు జైలుకు వెళ్లొచ్చినందుకు ఆయనకు మాత్రం పరామర్శల వెల్లువ రావడం విడ్డూరంగా ఉంది. ఐకాన్‌ స్టార్‌ను అరెస్టు చేస్తావా అని కేటీఆర్‌ ప్రశ్నించడం ఇంకా హేయంగా ఉంది. చట్టం దృష్టిలో అందరూ సమానమే’’ అని పేర్కొన్నారు. ‘ప్రభుత్వం కక్షకట్టదు. చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తుంది’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
 

Latest Videos

click me!