
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టించాలని దర్శక ధీరుడు రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం రూపొందుతోంది. సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహేష్ బాబుకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కేలా ఒక పాత్ర ఉందని.. అందులో ఎప్పటికైనా మహేష్ బాబు నటించాలని పరుచూరి కోరారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటించారు. ఆ పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ అంత గొప్పగా ఇంకెవరూ నటించలేరు. అల్లూరి పాత్రలో నటించాలనే కోరిక కృష్ణ గారికి ఆ చిత్రంతో నెరవేరింది. సూపర్ స్టార్ కృష్ణ కోరుకుని నటించలేకపోయిన ఒక పాత్ర ఉంది. అది ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్ర. ఛత్రపతి శివాజీ పాత్రతో సినిమా చేయాలని కృష్ణ గారు భావించారు. కానీ ఆ కోరిక నెరవేరలేదు.
సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా మహేష్ బాబుకి ఆ అవకాశం ఉంది. తండ్రి కోరికను మహేష్ బాబు నెరవేర్చాలి. శివాజీ పాత్రలో ఎప్పటికైనా మహేష్ బాబు నటించాలి. ఛత్రపతి శివాజీ గెటప్ కృష్ణ గారికి ఆ తర్వాత మహేష్ బాబుకి బాగా సరిపోతుంది. మహేష్ బాబు శివాజీ పాత్రలో నటిస్తే ప్రపంచం మొత్తం దాసోహం అయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకునే అంశాలు శివాజీ పాత్రలో ఉంటాయి.
అభిమానులు కూడా మహేష్ బాబు శివాజీ పాత్రలో నటించాలని కోరుకోవాలి అని పరుచూరి తెలిపారు. పరుచూరి బ్రదర్స్ రచయితలుగా మహేష్ బాబు రాజకుమారుడు, ఒక్కడు లాంటి చిత్రాల్లో నటించారు. మహేష్ బాబు బాల్యంలో నటించిన కొడుకు దిద్దిన కాపురం చిత్రం కూడా వీరి కాంబినేషన్ లో వచ్చిందే.
మహేష్ బాబు 8 ఏళ్ల వయసు నుంచి నటించడం ప్రారంభించారు అని పరుచూరి అన్నారు. కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో సమానమైన పాత్రలో నటించి మెప్పించాడు అని పరుచూరి తెలిపారు.
మహేష్ బాబు చిన్నతనంలో స్కూల్లో చదువుకునే సమయంలో వేసవి సెలవులు వచ్చినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అతడిని ఊటీ తీసుకుని వెళ్లేవారట. అక్కడ తాను నటించే చిత్రాల్లో మహేష్ బాబును కూడా నటింప చేసేవారు. ఒక ఫైట్ సన్నివేశంలో మహేష్ బాబు బాగా ఎత్తైన ప్రదేశం నుంచి జంప్ చేయాలి. దీంతో సూపర్ స్టార్ కృష్ణ డూప్ ని పెట్టమని అడిగారట. మహేష్ షూటింగ్ కి వచ్చే సమయానికి డూప్.. మహేష్ గెటప్ లో జంప్ చేసేందుకు రెడీగా ఉన్నాడు.
కానీ మహేష్ బాబు డూప్ ని పెట్టడానికి ఒప్పుకోలేదట. అక్కడి నుంచి దూకడం నాకేం పెద్ద సమస్య కాదు నేనే చేస్తాను అని వెళ్లి ధైర్యంగా జంప్ చేశాడట. నటన విషయంలో ఎంత కష్టమైనా భరించేందుకు మహేష్ ముందుకు వస్తాడని సూపర్ స్టార్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ తర్వాత చదువుకు ఆటంకం అవుతుందని మహేష్ బాబుతో కృష్ణ సినిమాలు ప్లాన్ చేయడం ఆపేశారు. తిరిగి 9 ఏళ్ల తర్వాత మహేష్ రాజకుమారుడు చిత్రంతో ఫుల్ లెన్త్ హీరోగా పరిచయమయ్యారు.
మహేష్ బాబు చివరగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 2024 సంక్రాంతికి విడుదలైన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళీ క్రేజీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
ఈ చిత్రం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందుతోంది. ఈ మూవీలో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహస వీరుడు పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు రాజమౌళి ఈ చిత్రం గురించి ఇతర విషయాలేవీ అధికారికంగా ప్రకటించలేదు. మహేష్ బాబు ఈ చిత్రంలో పొడవైన జుట్టు, గడ్డంతో కనిపించబోతున్నారు. త్వరలో ఎస్ఎస్ఎంబి 29 చిత్ర యూనిట్ లాంగ్ షెడ్యూల్ కోసం కెన్యాకు పయనం కాబోతోంది.