
పవన్ కళ్యాణ్ నటించిన `ఓజీ` మూవీ బాక్సాఫీసు వద్ద ఇంకా సందడి చేస్తోంది. థియేటర్లలో ఇంకా దండయాత్ర సాగిస్తూనే ఉంది. ఓ వైపు `కాంతారః చాప్టర్ 1` ప్రభావం చూపిస్తున్నా ఈ మూవీకి మంచి వసూళ్లు వస్తున్నాయి. సినిమా విడుదలై 17 రోజులవుతున్నా పవన్ తన సత్తాని చాటుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఓజీకి సర్‌ప్రైజింగ్ కలెక్షన్లు వస్తుండటం విశేషం. అయితే ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్‌తో రన్ అవుతున్న ఈ మూవీకి సంబంధించి ఒక విషయం మాత్రం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్‌గా, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఒక్క చోట మాత్రం నష్టాలను మిగిల్చబోతుందట.
పవన్ కళ్యాణ్ హీరో సుజీత్ దర్శకత్వంలో రూపొందిన `ఓజీ` చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటించారు. ఈ మూవీతోనే ఆయన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. వీరితోపాటు ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, తేజ్ సప్రూ, శ్రియా రెడ్డి, శుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ముంబయి బేస్డ్ గ్యాంగ్ స్టర్ కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సుజీత్. గ్యాంగ్ స్టర్ ఓజాస్ గాంభీరగా దుమ్ములేపారు పవన్. ఆయన స్టయిల్‌కి సుజీత్ టేకింగ్‌కి, తమన్ మ్యూజిక్ తోడవ్వడంతో ఈ మూవీ థియేటర్లలో రచ్చ చేస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించిన విషయం తెలిసిందే. సుమారు రూ. 250కోట్ల బడ్జెట్ అయినట్టు సమాచారం.
అయితే ఈ మూవీకి దాదాపు రూ.175కోట్ల వ్యాపారం జరిగిందని సమాచారం. అందులో నైజాంలో రూ.54కోట్లకు అమ్ముడు పోయింది. రాయలసీమలో రూ.22 కోట్లకు, ఉత్తరాంధ్ర రూ.20కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.12.30కోట్లు, వెస్ట్ గోదావరి రూ.9కోట్లు, కృష్ణ రూ.9.50కోట్లు, గుంటూరు రూ.13.70కోట్లు, నెల్లూర్ రూ.6కోట్లు, కర్నాటక రూ.8 కోట్లు, తమిళం, మలయాళం, నార్త్ కలుపుకుని రూ.3కోట్లకు అమ్మారు. ఇక ఓవర్సీస్‌లో రూ.17.50కోట్లకు అమ్ముడు పోయిందట. ఇలా థియేట్రికల్‌గా ఈ మూవీ రూ.175కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. దీనికితోడు డిజిటల్ రైట్స్ (నెట్ ఫ్లిక్స్ ) రూ.81 కోట్లు. అన్ని భాషలకు కలిపి. ఆడియో రైట్స్ రూ.18కోట్లు అని సమాచారం. ఇలా విడుదలకు ముందే ఈ చిత్రానికి రూ.272కోట్లు వ్యాపారం అయ్యింది. సినిమాకి పెట్టిన బడ్జెట్ రూ.250కోట్లు. ఈ లెక్కన సినిమా విడుదలకు ముందే నిర్మాత సేఫ్ అని చెప్పొచ్చు.
తాజాగా ఈ మూవీ 17రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. 17వ రోజు ఏకంగా కోటీ 25లక్షల కలెక్షన్లని సాధించడం విశేషం. దీంతో ఈ మూవీ ఇప్పటి వరకు రూ.315కోట్ల వరకు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే వాస్తవంగా ఇది రూ.300కోట్లు దాటిందని ట్రేడ్ వర్గాల టాక్. ఈ లెక్కన సుమారు రూ.180కోట్లకుపైగా షేర్ వచ్చిందట. కలెక్షన్ రిపోర్ట్ ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ మూవీ అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యింది. నైజాంలో లాభాల్లో ఉంది. ఓవర్సీస్‌లోనూ లాభాల్లోకి వెళ్లింది. హిందీతోపాటు ఇతర స్టేట్స్ లోనూ బ్రేక్ ఈవెన్ కి చేరుకుందట. అయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ఫ్లాప్ కావడం షాకిస్తుంది. ఉత్తరాంధ్రలో సేఫ్‌లోకి వెళ్లిన ఈ మూవీ సీడెడ్‌లో మాత్రం నష్టాలను మిగిల్చబోతుందట. అక్కడ రూ.22కోట్లకు వ్యాపారం జరిగింది. కానీ బ్రేక్ ఈవెన్‌కి రెండుమూడు కోట్ల దూరంలో ఉందట. దాదాపు 15-20శాతం వరకు నష్టాలను తెచ్చే అవకాశం ఉందని సమాచారం. కాకపోతే ఈ మూవీకి చాలా వరకు అడ్వాన్స్ ల రూపంలోనే వ్యాపారం జరిగింది. దీంతో నిర్మాత ఆ నష్టాలను భర్తీ చేయడం పెద్ద సమస్య కాదు. ఆయన ఇప్పటికే ఫుల్ ఖుషీగా ఉన్నారు. దీంతో బయ్యర్లని ఆదుకుంటాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ప్రపంచమంతా ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచి, అన్ని చోట్ల సేఫ్ అయి, తెలుగు స్టేట్స్ లోనే నష్టాలను తేవడం అభిమానులను బాధపెట్టే అంశంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ ఏడాది తెలుగులో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా `ఓజీ` నిలిచింది. `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ వసూళ్లని ఇది క్రాస్ చేసి ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం విశేషం.