
శోభన్ బాబు.. సోగ్గాడిగా తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తనని తాను నిరూపించుకుంటూ వచ్చాడు. సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపుని, ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. శోభన్ బాబు పౌరాణికాలతో కెరీర్‌ని ప్రారంభించారు. కొన్ని యాక్షన్ సినిమాలు చేశారు. కానీ ఆయన్ని తిరుగులేని స్టార్‌ని చేసింది మాత్రం కుటుంబ కథా చిత్రాలే అని చెప్పొచ్చు. ఫ్యామిలీ సినిమాలకు సోగ్గాడు కేరాఫ్‌గా మారిపోయారు. ఆ సినిమాలే ఆయనకు మహిళల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ని తీసుకొచ్చాయి. మహిళలు ఆరాధించే నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్, కృష్ణ వంటి వారు యాక్షన్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొడితే, సోగ్గాడు మాత్రం సింపుల్‌గా కుటుంబ కథా చిత్రాలతో వారికి చెమటలు పట్టించారని చెబితే అతిశయోక్తి కాదు.
శోభన్ బాబు, మహానటి సావిత్రి కలిసి చాలా సినిమాలు చేశారు. పదికిపైగానే సినిమాలున్నాయి. అయితే వీరిద్దరు కలిసి జంటగా నటించింది మాత్రం `చదువుకున్న అమ్మాయిలు`, `కన్న తల్లి` అనే చెప్పాలి. ఇతర చిత్రాల్లో డిఫరెంట్ రోల్స్ చేశారు. `గోరింటాకు` మూవీలో సోగ్గాడికి తల్లిగా నటించింది సావిత్రి. `నర్తనశాల`లో కూడా నటించారు. కానీ జంటగా కాదు. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు నటించిన చాలా చిత్రాల్లో శోభన్ బాబు కీలక పాత్రలు చేశారు, సెకండ్ లీడ్‌గా నటించారు. అలా తెరని పంచుకున్నారు. కానీ జంటగా నటించలేదు. అయితే సావిత్రి డైరెక్షన్‌లో సోగ్గాడు సినిమా చేయడం విశేషం. ఆమె రూపొందించిన ఒకే ఒక్క మూవీలో శోభన్ బాబు నటించాడు.
మహానటి సావిత్రి దర్శకురాలిగా మారి `నవరాత్రి`, `చిన్నారి పాపలు`, `ఖుజంతై ఉల్లుమ్`, `చిరంజీవి`, `మాతృ దేవత`, `ప్రాప్తం`, `వింత సంసారం` వంటి చిత్రాలను రూపొందించారు. అయితే వీటిలో హిట్ల కంటే పరాజయాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో `మాతృదేవత` మూవీలో శోభన్ బాబు నటించడం విశేషం. సావిత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో ఎన్టీఆర్ మెయిన్ హీరో. ఆయనకు జోడీగా సావిత్రి నటించింది. ఇందులో సోగ్గాడు సెకండ్ లీడ్‌గా చేశారు. ఆయన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. 1969 నవంబర్ 7న విడుదలైన ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించింది. ఓ రకంగా సోగ్గాడిని ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర చేసిన చిత్రాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఇలా సోగ్గాడు.. సావిత్రి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెరవడం విశేషం.
మహానటి సావిత్రి దర్శకురాలిగా మారి, నిర్మాతగా మారి చాలా ఇబ్బంది పడింది. పెద్ద పెద్ద స్టార్స్ తోనూ మూవీస్ చేసింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, జెమినీ గణేషన్, శివాజీ గణేషన్ వంటి వారు కూడా సావిత్రి డైరెక్షన్‌లో నటించారు. వాటిలో కొన్ని మూవీస్ ఆడితే మరికొన్ని పరాజయం చెందాయి. అయితే ఈ చిత్రాలను చాలా వరకు తన ప్రొడక్షన్‌లోనే నిర్మించింది సావిత్రి. దీంతో అవి భారీ నష్టాలను మిగిల్చాయి. ఆమె కెరీర్ డౌన్ కావడంలో ఈ చిత్రాల పాత్ర చాలానే ఉందని అంటుంటారు. ఓ వైపు భర్త జెమినీ గణేషన్‌తో గొడవలు, మరోవైపు ఈ నష్టాలు, నమ్మిన వాళ్లు మోసం చేయడం, ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్స్ వంటి అనేక కారణాలతో సావిత్రి కుంగిపోయారు. తాగుడుకి బానిసై అనారోగ్యంతో కోమాలోకి వెళ్లారు. దాదాపు ఏడాదికిపైగానే పోరాడి మృతి చెందారు.
ఇక శోభన్ బాబు `భక్త శబరి` మూవీతో నటుడిగా పరిచయం అయ్యారు. కానీ `దైవ బలం` మొదటగా రిలీజ్ అయ్యింది. `బంగారు పంజరం`, `సీతా రామ కళ్యాణం`, `మహామంత్రి తిమ్మరుసు`, `లవకుశ`, `నర్తనశాల`, `దేశమంటే మనుషులోయ్`, `వీరాభిమాన్యు`, `మనుషులు మారాలి`. `మాతృదేవత`, `కళ్యాణ మండపం`, `చెల్లెలి కాపురం`, `సంపూర్ణ రామాయణం`, `శారద`, `మంచి మనుషులు`, `జీవనజ్యోతి`, `సోగ్గాడు`, `కురుక్షేత్రం`, `మల్లెపువ్వు`, `ఖైదీ బాబాయ్`, `గోరింటాకు`, `కార్తీక దీపం`, `మోసగాడు`, `దేవత`, `ముందడుగు` వంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. నటభూషణ్ శోభన్ బాబుగా కీర్తి పొందారు. సోగ్గాడు 1959లో కెరీర్ ప్రారంభించి, 1996లో రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ఆడియెన్స్, అభిమానుల దృష్టిలో తాను సోగ్గాడిగానే ఉండిపోవాలని చెప్పి ఆయన స్వతహాగా రిటైర్‌మెంట్ ప్రకటించుకోవడం విశేషం. ఆ తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా ఆయన రిజెక్ట్ చేశారు.