
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `ఓజీ` మూవీతో హిట్ అందుకున్నారు. ఇంకా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ కొట్టారు. అంతటితో ఆగలేదు. ఈ ఏడాది ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడని చెప్పొచ్చు. చాలా ఏళ్ల తర్వాత పవన్ తన సత్తాని చాటారు. `గబ్బర్ సింగ్`, `అత్తారింటికి దారేది` తర్వాత ఆ స్థాయిలో పవన్ సినిమాలు రాలేదు. దీంతో అభిమానులు ఒక సాలిడ్ మూవీ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేశారు. వారికి `ఓజీ` రూపంలో ఫుల్ మీల్స్ దొరికింది. అదే సమయంలో పవన్‌ని ఎలా చూడాలనుకున్నారో ఇందులో అలా చూపించారు దర్శకుడు సుజీత్. దీంతో ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది.
గత నెల 25న విడుదలైన `ఓజీ` సినిమాకి ప్రీమియర్స్ షోస్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మొదటి రోజున నుంచి అదే టాక్‌తో దూసుకుపోయింది. కలెక్షన్లలోనూ జోరు చూపించింది. `ఓజీ` సినిమా ఏకంగా రూ.300కోట్ల క్లబ్‌లో చేరింది. 9వ రోజే ఈ మూవీ మూడు వందల కోట్లు టచ్ అయ్యింది. పది, పదకొండో రోజు సైతం మంచి వసూళ్లని రాబట్టింది. ఇక 11 రోజుల్లో ఈ చిత్రం రూ.308కోట్లు రాబట్టడం విశేషం. 12వ రోజు(సోమవారం) కలెక్షన్లు చాలా తగ్గిపోయాయి. మండే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు కోట్లు వరకు మాత్రమే రాబట్టింది. దీంతో 12 రోజుల్లో `ఓజీ` మూవీ రూ.310కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. దీంతో ఈ చిత్రం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 2025లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా `ఓజీ` నిలవడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో వెంకటేష్ నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ సుమారు మూడు వందల కోట్లు రాబట్టిందన్నారు. నిజానికి రూ.255కోట్లే అని టాక్. కానీ చిత్ర బృందం లెక్కల ప్రకారం చూసినా `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రాన్ని దాటేసింది ఓజీ. దీంతో ఈ ఏడాది సినిమాల జాబితాలో ఇదొక ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని చెప్పొచ్చు.
`ఓజీ` సినిమాకి థియేట్రికల్ పరంగా రూ.175కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తాజాగా `ఓజీ` బ్రేక్ ఇవెన్ అయినట్టు సమాచారం. ఈ చిత్రం నైజాంలో రూ.55కోట్లు, ఆంధ్రాలో రూ.62కోట్లు, సీడెడ్‌లో రూ.17కోట్లు, కర్నాటకతోపాటు ఇతర ఇండియా మొత్తంలో రూ.16కోట్లు, ఓవర్సీస్‌లో రూ.32కోట్ల నెట్ కలెక్షన్లని రాబట్టిందట. మొత్తంగా రూ.184కోట్ల షేర్ సాధించి ఇప్పటికే బ్రేక్ ఇవెన్ అయ్యిందని చెప్పొచ్చు. దీంతో ఓజీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఇదిలా ఉంటే `ఓజీ` విషయంలోనే కాదు పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇలా ఐదు సార్లు ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేశారు. ఆయా ఇయర్స్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలను అందించారు. అవేంటో చూస్తే. `ఓజీ`తో 2025లో ఈ రికార్డుని క్రియేట్ చేశారు. మరి ఈ ఏడాది మున్ముందు వచ్చే చిత్రాలు `ఓజీ` వసూళ్లని దాటితే ఆ రికార్డు బ్రేక్ అవుతుంది. కానీ అప్పటి వరకు పవన్ సినిమానే ఈ ఏడాది కింగ్ అని చెప్పొచ్చు.
అంతకు ముందు `అత్తారింటికి దారేది` మూవీ ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ విడుదలకు ముందే పైరసీకి గురయ్యింది. హెచ్‌డీ ప్రింట్ బయటకు వచ్చింది. దీంతో టీమ్ మొత్తం తలలు పట్టుకుంది. కానీ థియేటర్లో విడుదలైన ఈ సినిమా మాత్రం సంచలన విజయం సాధించింది. 2013లో విడుదలైన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతకు ముందు `గబ్బర్ సింగ్` విషయంలో కూడా అదే జరిగింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా ఉండటంతో వారంతా బ్రహ్మరథం పట్టారు. 2012లో `గబ్బర్ సింగ్` అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది.
వీటితోపాటు `జల్సా` 2008లో విడుదలైంది ఈ రికార్డుని క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ సాధించి ఆ ఏడాది వచ్చిన వాటిలో అత్యధిక కలెక్షన్లని రాబట్టిన మూవీగా నిలిచింది. ఇందులో ఇలియానా హీరోయిన్‌గా నటించడం విశేషం. మరోవైపు `ఖుషి`తోనూ ఆ రికార్డు ఉంది. అయితే `ఖుషి` ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఎస్ జే సూర్య దర్శకత్వంలో 2001లో విడుదలైన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించింది. యూత్‌ని బాగా ప్రభావితం చేసింది. దీంతో ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇలా ఐదు సార్లు ఆయా ఏడాదిలో పవన్ కళ్యాణ్ సినిమాలు అత్యధిక వసూళ్లని రాబట్టి రికార్డు సృష్టించాయి. తన సమకాలీకులైన హీరోల విషయంలో ఇది చాలా అరుదైన విషయంగా చెప్పొచ్చు.