Obsession: భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే విజయాలు సాధిస్తాయనే అభిప్రాయాన్ని పూర్తిగా తలకిందులు చేసిన చిత్రం ‘అబ్సెషన్’. కేవలం రూ. 7 కోట్లతో తెరకెక్కిన ఈ సైకాలజికల్ హారర్-రొమాన్స్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
సాధారణంగా హాలీవుడ్‌లో హిట్ సినిమాలు వందల మిలియన్ల డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కుతాయి. కానీ ‘అబ్సెషన్’ మాత్రం ఆ ట్రెండ్‌కు పూర్తి భిన్నం. సుమారు లక్ష డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదలైన కొద్ది వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 234 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. భారత కరెన్సీలో ఇది రూ.2,000 కోట్లకు పైగానే ఉంటుంది. ఇంత తక్కువ పెట్టుబడితో రూపొందిన సినిమా ఇంతటి స్థాయిలో లాభాలు ఆర్జించడం హాలీవుడ్ చరిత్రలోనే అరుదైన విషయంగా ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫోకస్ ఫీచర్స్ విడుదల చేసిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
25
ఇంతకీ సినిమా కథ ఏంటి.?
ఈ చిత్ర కథ మొత్తం ఒక సాధారణ ప్రేమకథతో మొదలవుతుంది. మ్యూజిక్ షాప్‌లో పనిచేసే యువకుడు బేర్ తన స్నేహితురాలు నిక్కీని ప్రేమిస్తుంటాడు. అయితే తన ప్రేమను వ్యక్తపరచడానికి ధైర్యం చేయలేడు. ఈ సమయంలో అతడి చేతికి ఒక విచిత్రమైన అతీంద్రియ వస్తువు దొరుకుతుంది. దాని ద్వారా తాను ప్రేమించే అమ్మాయి తనను ప్రేమించాలని కోరుకుంటాడు. ఆశ్చర్యకరంగా ఆ కోరిక నిజమవుతుంది. కానీ ఆ ప్రేమ సాధారణ ప్రేమగా కాకుండా, మితిమీరిన ఆకర్షణగా, నియంత్రణ కోరికగా, చివరకు ప్రమాదకరమైన మోజుగా మారుతుంది. అక్కడి నుంచే కథ భయానక మలుపులు తిరుగుతుంది. ప్రేమ, ఆకర్షణ, మానసిక అస్థిరత, అతీంద్రియ శక్తులు కలిసిన కథనంతో దర్శకుడు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచాడు.
35
అనునిత్యం ఉత్కంఠభరితం
‘అబ్సెషన్’ను సాధారణ హారర్ సినిమాగా చూడలేం. ఇందులో జంప్ స్కేర్స్, రక్తపాత సన్నివేశాలు ఎక్కువగా ఉండవు. అయినప్పటికీ సినిమా మొత్తం ఒక అసహజమైన భయం ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటుంది. ప్రారంభంలో కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయం, వారి సంబంధాలపై దర్శకుడు ఎక్కువ సమయం కేటాయించాడు. అయితే ఒకసారి అతీంద్రియ కోరిక నెరవేరిన తర్వాత కథ వేగం పూర్తిగా మారిపోతుంది.
ప్రత్యేకంగా సెకాండాఫ్ లో వచ్చే సంఘటనలు ప్రేక్షకులను సీట్లోంచి కదలనివ్వవు. తర్వాత ఏమి జరుగుతుందో అంచనా వేయడం కష్టమవుతుంది. క్లైమాక్స్ వరకు అదే ఉత్కంఠ కొనసాగుతుంది. మైఖేల్ జాన్స్టన్, ఇండే నవరెట్ తమ పాత్రల్లో సహజంగా నటించారు. ముఖ్యంగా హీరోయిన్ పాత్రలో కనిపించే భావోద్వేగ మార్పులు కథకు ప్రధాన బలంగా నిలిచాయి.
‘అబ్సెషన్’ విజయానికి ప్రధాన కారణం దాని కథనం. ఇటీవల విడుదలవుతున్న అనేక హారర్ చిత్రాలు ఒకే తరహా ఫార్ములాను అనుసరిస్తుంటే, ఈ చిత్రం మాత్రం కొత్త అనుభూతిని అందించింది. అలాగే దర్శకుడు కర్రీ బార్కర్ విజువల్ ఎఫెక్ట్స్‌పై కాకుండా వాతావరణ సృష్టిపై దృష్టి పెట్టాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ డిజైన్, కెమెరా వర్క్ కలిసి ప్రేక్షకుల్లో అసౌకర్య భావనను కలిగిస్తాయి. అదే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టింది. సోషల్ మీడియాలో వచ్చిన సానుకూల స్పందన కూడా భారీ పాత్ర పోషించింది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అనుభవాలను పంచుకోవడంతో మౌత్ టాక్‌తో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించింది. దీంతో ప్రతి వారం వసూళ్లు పెరుగుతూ వచ్చాయి.
55
ఓటీటీ విడుదలపై పెరిగిన ఆసక్తి
ప్రారంభంలో ఈ సినిమా త్వరగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలోకి వస్తుందని భావించారు. కానీ థియేటర్లలో కొనసాగుతున్న విజయాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు ఓటీటీ విడుదలను కొంతకాలం వాయిదా వేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం త్వరలోనే రెంటల్ విధానంలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాది భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. భారతదేశంలో ఇప్పటికే రూ.60 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందింది. దీంతో ఓటీటీలో ఈ సినిమా ఇంకా ఎన్నో రికార్డులు సృష్టించడం ఖాయమని అంతా భావిస్తున్నారు.