స్వర్గీయ నందమూరి తారక రామారావు పురాణాల్లో ఆయన పోషించని పాత్ర అంటూ లేదు. తెలుగు ప్రేక్షకుల్లో కృష్ణుడిగా, రాముడిగా గుర్తుండిపోయారు. అంతే కాదు వెంకటేశ్వర స్వామిగా, శివుడిగా, రావణుడిగా, భీష్ముడిగా ఇలా ఎన్టీఆర్ అనేక పాత్రల్లో నటించారు. పౌరాణిక చిత్రాలు అంటే ఎన్టీఆర్ మాత్రమే చేయాలి అన్నట్లుగా పరిస్థితి ఉండేది.
పౌరాణిక చిత్రాలు చేసే సమయంలో ఎన్టీఆర్ భక్తి శ్రద్దలతో నిష్ఠగా ఉండేవారట. ఆహార నియమాలు కట్టుబాట్లు పాటించేవారట. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి తగ్గట్లుగా తమ చిత్రాలతో ఇమేజ్ పెంచిన దర్శకుల్లో దాసరి ఒకరు. దాసరి నారాయణ రావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో అనేక సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు లాంటి చిత్రాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు.
ఎన్టీఆర్ తో జరాసంధుడు పాత్ర ఆధారంగా ఒక చిత్రం చేయాలనీ దాసరి భావించారు. ఎన్టీఆర్ జరాసంధుడి పాత్రలో కథ సిద్ధం చేసుకున్నారు. ఈ విషయం ఎన్టీఆర్ కి దాసరి చెప్పారు. ఆ పాత్రలో నటించాలని ఎన్టీఆర్ కి కూడా ఆసక్తి ఉండేదట. కానీ అప్పటికే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. దీనితో ఇకపై పౌరాణిక చిత్రాల్లో నటించనని ప్రకటించారు.
దాసరి ఎంత రిక్వస్ట్ చేసినా ఆ చిత్రానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. ఆ విధంగా దాసరి కల కలగానే మిగిలిపోయింది. ఎన్టీఆర్, దాసరి కాంబినేషన్ లో వచ్చిన బొబ్బిలి పులి చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి ముందు కూడా దాసరి సెన్సార్ సమస్యలతో సతమతమయ్యారు. చివరికి ఈ చిత్రం విడుదలై అఖండ విజయం సాధించింది.