పేరుకి వందకోట్ల హీరోలు.. వారి సినిమాలకు జీరో బజ్‌.. రవితేజ, రామ్ లకు ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటంటే?

First Published | Aug 4, 2024, 12:42 PM IST

రవితేజ నటించిన `మిస్టర బచ్చన్‌`, రామ్‌ హీరోగా తెరకెక్కిన `డబుల్‌ ఇస్మార్ట్` చిత్రాలు ఒకేసారి రిలీజ్‌ కానున్నాయి. కానీ వీటికి ఆడియెన్స్ లో బజ్‌ క్రియేట్‌ కాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. 
 

మాస్‌ మహారాజా రవితేజ, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని స్టార్‌ ఇమేజ్‌తో రాణిస్తున్నా సక్సెస్‌ల కోసం ఇంకా స్ర్టగుల్‌ అవుతూనే ఉన్నారు. హిట్ల కోసం శ్రమిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు `మిస్టర్ బచ్చన్‌`తో రవితేజ, `డబుల్‌ ఇస్మార్ట్` చిత్రంతో రామ్‌ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రాలు రిలీజ్‌ కానున్నాయి. బాక్సాఫీసు వద్ద ఈ రెండు చిత్రాలకు పోటీ నెలకొందని చెప్పాలి. అయితే లాంగ్‌ వీకెండ్‌ ఉండటంతో పోటీ ఉన్నా, సినిమాలు బాగుంటే బయటపడతాయని చెప్పొచ్చు.  
 

ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కాయి. 70-80 కోట్ల వరకు బడ్జెట్‌ అయ్యాయి. సినిమాలకు బిజినెస్‌ కూడా ఫర్వాలేదు. రవితేజ నటించిన `మిస్టర్‌బచ్చన్‌` సినిమా 40కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగిందని టాక్ నడుస్తుంది. కానీ ఇంకా బిజినెస్‌ కాలేదట. ఓటీటీ ఇంకా అమ్ముడు పోలేదు. ఇటీవల రవితేజ సినిమాలకు ఓటీటీలో ఆదరణ దక్కడం లేదు. దీంతో ఓటీటీ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయని టాక్. ఈ సినిమాకి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. 
 

Latest Videos


పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ మోస్తారు నుంచి పెద్ద సినిమాలను నిర్మిస్తుంది. ఏడాదికి నాలుగైదు సినిమాలు ఈ బ్యానర్‌ నుంచే వస్తాయి. దీంతో ఓటీటీలు సంస్థలు గుంపగుత్తగా ఆయా సినిమాలు తీసుకోవడానికి రెడీగా ఉంటాయి. వాటిలో భాగంగా `మిస్టర్‌ బచ్చన్‌`ని కూడా తోసేయాలనుకుంటున్నారట. చివరకు ఎంతకో అంతకు తోసేస్తారని చెప్పొచ్చు. కానీ థియేట్రికల్‌గానే ఈ సినిమా తన సత్తా చాటాల్సి ఉంది. థియేటర్‌ కలెక్షన్ల విషయంలోనే ఏం చేస్తుందనేది చూడాలి.
 

మరోవైపు రామ్‌ పోతినేని హీరోగా నటించిన `డబుల్‌ ఇస్మార్ట్‌` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ భారీగానే అయ్యింది. 60కోట్లకు థియేట్రికల్‌ రైట్స్ అమ్ముడు పోయాయట. ఓటీటీ, ఆడియో రైట్స్ కలుపుకుని ఈ చిత్రం సుమారు 90-100 కోట్ల బిజినెస్ ముందే అయ్యిందనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాని పూరీ జగన్నాథ్‌ రూపొందించారు. ఛార్మీ నిర్మాత. `డబుల్‌ ఇస్మార్ట్`కి ఫైనాన్స్ కష్టాలున్నాయి. పూరీ గత చిత్రాల అప్పులు చెల్లించాల్సి ఉంది. పైగా `లైగర్‌` డిస్ట్రిబ్యూటర్స్ కి కాకుండా మరో డిస్ట్రిబ్యూటర్‌కి ఈ చిత్రం హక్కులు అమ్మడంతో `లైగర్‌` డిస్ట్రిబ్యూటర్‌ గొడవ చేస్తున్నారని, ఇది సినిమా రిలీజ్‌పైనే ప్రభావం పడుతుందని అంటున్నారు. 
 

ఈ సినిమాలకు బిజినెస్‌ బాగానే జరిగినా, థియేట్రికల్‌గా ఇవి ఏమేరకు సత్తా చాటుతాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వీటిని చూసేందుకు జనం ఆసక్తికరంగా లేకపోవడమే దీనికి కారణమని చెప్పొచ్చు. `మిస్టర్‌ బచ్చన్‌`, `డబుల్ ఇస్మార్ట్` చిత్రాలకు ఆడియెన్స్ లో పెద్దగా బజ్‌ లేదు. సినిమా చూసేదుకు ఆసక్తి కనబర్చడం లేదు ఆడియెన్స్. ఏం చేసినా హైప్‌ రావడం లేదు. కారణం `మిస్టర్‌ బచ్చన్‌` రీమేక్‌ సినిమా. చాలా మంది హిందీలో వచ్చిన `రైడ్‌`ని చూశారు. ఇంకా కొత్తగా ఏం చూపిస్తారనేది ప్రశ్న. పైగా ఇప్పుడు రీమేక్‌లు వర్కౌట్‌ కావడం లేదు. పైగా విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ఏమాత్రం హైప్‌ తెచ్చేలా లేవు. దీంతో ఆ ప్రభావం ఇప్పుడు రవితేజ సినిమాపై పడే అవకాశం ఉంది. పైగా మాస్‌ మహారాజాకి వరుసగా పరాజయాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమాకి బజ్‌ రాకపోవడానికి అది కూడా ఓ కారణమని చెప్పొచ్చు.
 

 మరోవైపు `డబుల్‌ ఇస్మార్ట్`ది కూడా అదే పరిస్థితి. దీనికి కూడా బజ్‌ క్రియేట్‌ కావడం లేదు. ఈ సినిమా టీజర్‌ కూడా కిక్‌ ఇచ్చేలా లేదు. పాటలు వర్కౌట్ కాలేదు. ఆడియెన్స్ పెద్దగా మాట్లాడుకోవడం లేదు. వీటి గురించి సోషల్‌ మీడియాలో చర్చ లేదు. వీటిని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు ట్రేడ్‌ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తుంది. రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమాలను కూడా జనం చూడటం లేదు. ఈ రెండు సినిమాలు అలాంటివే కావడం కూడా పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే కొన్న బయ్యర్లు కూడా ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తుంది.

రామ్‌ గత సినిమాలు కూడా ఆదరణ పొందలేదు. అది కూడా ఓ కారణమని అభిప్రాయపడుతున్నారు క్రిటిక్స్. అయితే `ధమాఖా` చిత్రంతో రవితేజ, `ఇస్మార్ట్ శంకర్`తో రామ్‌ సుమారు వంద కోట్ల క్లబ్‌ల చేశారు. అలాంటి వంద కోట్ల హీరోల సినిమాలకు ఏమాత్రం బజ్‌ లేకపోవడమే ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సినిమాల రిలీజ్‌కి మరో పది రోజులుంది. ఈ లోపు అయినా హైప్‌ క్రియేట్ అవుతుందా? ఈ సారైనా వీళ్లు హిట్‌ కొడతారా? అనేది చూడాలి. 

click me!