
చరిత్రని గొప్పగా వర్ణించడం వేరు, వక్రీకరించడం వేరు. లేని విషయాన్ని ఉన్నట్లుగా, జరగని విషయాన్ని జరిగినట్లుగా చూపించడం వక్రీకరించడమే అవుతుంది. మహా భారతం ఇతిహాసానికి సంబంధించిన చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదంగా మారింది. నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కి ఘనవిజయం సాధించిన కల్కి 2898 ఎడి చిత్రం విడుదలైనప్పుడే ఈ వివాదం మొదలైంది. ఇటీవల నాగ్ అశ్విన్ చేసిన పోస్ట్ తో మరింత ఎక్కువైంది.
అర్జునుడికంటే కర్ణుడు గొప్పవాడిగా, గొప్ప వీరుడిగా కల్కి చిత్రంలో చూపించారు. ఇతిహాసాలపై అవగాహనా ఉన్న పండితులు, మహాభారతం చదివిన వాళ్ళు నాగ్ అశ్విన్ కర్ణుడి పాత్రని ప్రొజెక్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప వీరుడు కానే కాదు. అలా అని వ్యాస భారతంలో ఎక్కడా లేదు. క్యారెక్టర్ పరంగా, యుద్ధ విద్యల పరంగా రకంగానూ కర్ణుడు.. అర్జునుడికి పోటీ కానే కాదు అని అంటున్నారు. అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప వీరుడు అని శ్రీకృష్ణుడే చెప్పినట్లు ఉన్న బిబేక్ డెబ్రాయ్ అనువాదాన్ని చూడాలని, తాను ఏం చేస్తున్నానో తనకు తెలుసు అని నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీనితో నెటిజన్లు నాగ్ అశ్విన్ కి కౌంటర్ ఇస్తూ అనేక పోస్ట్ లు చేస్తున్నారు. గరికపాటి లాంటి అవధానులు చెప్పిన విషయాలని వైరల్ చేస్తున్నారు. అభిమన్యుడిని దొంగ దెబ్బ తీసి చంపడంలో కర్ణుడి పాత్ర కూడా ఉంది. దీనిపై అనేక చిత్రాలు కూడా వచ్చాయి. శోభన్ బాబు నటించిన వీరాభిమన్యు చిత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. పద్మవ్యూహంలో అభిమన్యుడిని కర్ణుడు వెన్నుపోటు పొడిచిన సన్నివేశాలు ఆ చిత్రంలో చక్కగా చూపించారు. గరికపాటి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అభిమన్యుడు 16 ఏళ్ళ పసిబాలుడు. అభిమన్యుడు పద్మ వ్యూహంలోకి ప్రవేశించగానే కౌరవ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించాడు. కౌరవుల పక్షాన ఉన్న ఉద్దండులని అభిమన్యుడు తన పరాక్రమంతో పరుగులు పెట్టించాడు. అభిమన్యుడు పద్మ వ్యూహంలో చేసిన యుద్ధం మొత్తం చెబితే నెత్తురు ఉడిగిపోతుంది. అంతటి భయంకర యుద్ధం చేశాడు. అభిమన్యుడితో పోరాడలేక దుర్యోధనుడు, కర్ణుడు, శకుని లాంటి వాళ్ళు పరుగులు పెట్టారు. యుద్దరంగంలోనే శకుని పంచె కూడా ఊడిపోయింది.
అలాంటి టైంలో దుర్యోధనుడు తీవ్ర అసహనానికి గురయ్యాడు. దీనితో దుర్యోధనుడు.. అందరినీ పిలిచి ద్రోణాచార్యుడు వద్దకు వెళ్లారు. అభిమన్యుడినే గెలవలేకున్నాం ఇక అర్జునుడిని ఏం గెలుస్తాం అని రెచ్చగొట్టాడు. దీనితో ద్రోణాచార్యుడు ఇక కుట్ర చేయాల్సిందే. లేకుంటే అభిమన్యుడిని గెలవలేం అని చెప్పారు. కురుక్షేత్ర యుద్ధం గాడి తప్పింది ఇక్కడే. అప్పటి వరకు అంతా ధర్మం గానే జరిగింది. పసి పిల్లాడు ఇంత సేపు యుద్ధం చేస్తున్నాడు అంటే అది మనకు అవమానం అని దుర్యోధనుడు అన్నాడు. దీనితో దుర్యోధనుడు వెంటనే అశ్వథామ, కృపాచార్యుడు లాంటి వారిని పిలిపించి కుట్ర ప్లాన్ చేశారు. అభిమన్యుడు దుర్యోధనుడుతో యుద్ధం చేస్తున్న సమయంలో కర్ణుడు వెనుక నుంచి బాణం వేయాలి. అభిమన్యుడు విల్లుని చెల్లాచెదురు చేయాలి అని చెప్పారు. అప్పుడు ఈ కర్ణుడు. వీరాధి వీరుడు శూరధి శూరుడు అని ప్రశంసలు కురిపించుకునే ఈ కర్ణుడు వెనుక నుంచి బాణం వేసి అభిమన్యుడి ధనుస్సు చెదరగొడతాడు. 16 ఏళ్ళ పసి పిల్లాడిని ఎదుర్కొనలేక వెనుక నుంచి బాణం వేసిన కర్ణుడు వీరుడా ? కర్ణుడిని అనవసరంగా పొగడొద్దు.
అభిమన్యుడిపై కుట్రని మొట్ట మొదట అమలు చేసిన వ్యక్తి కర్ణుడే. ధనుస్సు విరిగిపోవడంతో అభిమన్యుడు మరో ఆయుధం తీసుకునే లోపే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వథామ లాంటి వాళ్ళు అభిమన్యుడిని చుట్టుముట్టారు. అభిమన్యుడి వద్ద ఆయుధాలు లేకుండా చేశారు. చివరికి అభిమన్యుడు రథచక్రం తీసుకుని పోరాడాలి అనుకున్నాడు. చుట్టూ ఉన్న కౌరవులు వేగంగా బాణాలు సాధించారు. క్షణాల వ్యవధిలో అభిమన్యుడి ఒళ్ళంతా బాణాలతో రక్తమయం అయింది. అయినప్పటికీ అభిమన్యుడు పోరాడుతూనే మరణించాడు అని గరికపాటి తన ప్రవచనంలో తెలిపారు. గరికపాటి మాటలని నెటిజన్లు వైరల్ చేస్తూ.. కర్ణుడి నిజస్వరూపం ఇది. అలాంటి కర్ణుడిని వీరుడు శూరుడు అని పొగడవద్దు. ఇతిహాసాలని వక్రీకరించి సినిమాలు తీయొద్దు అంటూ నాగ్ అశ్విన్ కి నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు.