కామెడీ హీరోల్లో సరికొత్త సంచలనంగా మారారు నవీన్ పొలిశెట్టి. `జాతిరత్నం`తో టాలీవుడ్‌లోనే పాపులర్ అయ్యారు. నిజంగానే తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక జాతిరత్నం దొరికిందని అంతా ఫీలయ్యారు. గతేడాది `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`తో అలరించారు. లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టికి జోడీగా నటించి మెప్పించాడు. తనదైన కామెడీతో నవ్వించడంతోపాటు, ఎమోషనల్ గా కట్టిపడేశాడు.
అయితే ఆ మధ్య అనుకోకుండా ప్రమాదానికి గురయ్యారు. తన చేయికి గాయమైనట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. కొంత కాలం బ్రేక్ తీసుకున్నట్టు తెలిపారు. రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రాబోతున్నట్టు వెల్లడించారు. ఇటీవల మళ్లీ కమ్ బ్యాక్ అయ్యారు. పలు ఈవెంట్లలోనూ మెరిశాడు నవీన్ పొలిశెట్టి. ఇక ఇప్పుడు హీరోగానూ కమ్ బ్యాక్ అవుతున్నారు. తాజాగా తన ఆగిపోయిన సినిమాని మళ్లీ పట్టాలెక్కించాడు. ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. తన నూతన చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. నవీన్ పొలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్‌ను నిర్మాతలు ఆవిష్కరించారు. నవీన్ పొలిశెట్టి మాదిరిగానే ఈ వీడియో ఎంతో ప్రత్యేకంగా, పూర్తి వినోదాత్మకంగా ఉంది.
ప్రీ వెడ్డింగ్ వీడియోలో నవీన్ పొలిశెట్టి పోషించిన రాజు పాత్ర తన వివాహానికి సిద్ధమవుతున్నట్లు చూపించారు. రాజు గారి పెళ్ళి అంటే ఎలా ఉండాలి? అంటూ భోజనాల దగ్గర చమ్మక్ చంద్ర చేసిన హడావుడి నవ్వులు పూయించింది.
ఇక అనంత్ అంబానీ వివాహానికి హాజరైన హాలీవుడ్ ప్రముఖుల ఫోన్ నెంబర్ల కోసం, నవీన్ ఏకంగా ముఖేష్ అంబానీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు చూపించడం కడుపుబ్బా నవ్వించింది. అలాగే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ సమయంలో వధువుగా మోస్ట్ హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కనిపించారు. ఈ ఫోటోషూట్ సమయంలో కూడా నవీన్ పోషించిన రాజు పాత్ర నవ్వులు పంచింది.