క్రేజీ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి టాలీవుడ్ లో కొత్త వాళ్ళని పరిచయం చేయడంలో ముందుంటారు. రామ్ పోతినేని, సాయిధరమ్ తేజ్ లని ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈ దర్శకుడే. అయితే కొంతకాలంగా వైవిఎస్ చౌదరికి సరైన హిట్స్ లేవు. దీనితో ఆయన చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎట్టకేలకు వైవిఎస్ చౌదరి కొత్త చిత్రాన్ని ప్రారంభించారు.
నాలుగో తరం నందమూరి వారసుడిని హీరోగా చేసే బాధ్యతలని వైవిఎస్ చౌదరి తీసుకున్నారు. నందమూరి జానకిరామ్ తనయుడు పేరు కూడా నందమూరి తారకరామారావే. నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకు నందమూరి జానకి రామ్. జానకి రామ్ తనయుడు రామారావు నే వైవిఎస్ చౌదరి హీరోగా పరిచయం చేస్తున్నారు.
జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. హరికృష్ణ మనవడు రామారావు హీరోగా ఎంట్రీ ఇస్తుండడంతో బాబాయ్ లుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ సహకారం, ప్రోత్సాహం అందించేందుకు ముందుకు వచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్.. హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పై ఆసక్తికర వ్యాఖ్యలకి చేస్తూ పోస్ట్ చేశారు. సుదీర్ఘ ప్రయాణం చేసేందుకు తొలి అడుగు వేస్తున్న రామ్ కి ఆల్ ది బెస్ట్. ప్రపంచ సినిమాలో ఎన్నో అనుభూతులు ఎదురుచూస్తున్నాయి. ఈ ప్రయాణంలో నీవు విజయం సాధించాలని కోరుకుంటున్నా. ముత్తాత ఎన్టీఆర్, తాత హరికృష్ణ, తండ్రి జానకిరామ్ ల ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీవు తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటావు అనే విశ్వాసం ఉంది. నీ ఫ్యూచర్ దేదీప్యమానంగా వెలగాలి అంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు.
డియర్ రామ్ నీకు శుభాకాంక్షలు. తొలి చిత్రంతోనే మేమంతా గర్వపడేలా చేస్తావు అనే నమ్మకం ఉంది అంటూ కళ్యాణ్ రామ్ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తన ఫస్ట్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. బైక్ పై అతడి లుక్ ట్రెండీగా ఉంది. యువతని టార్గెట్ చేసేలా వైవిఎస్ చౌదరి ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు అర్థం అవుతోంది.