నందమూరి బాలకృష్ణ మాస్ విశ్వరూపాన్ని మరోసారి బయట పెట్టిన చిత్రం లెజెండ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బాలయ్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచింది. ఈ చిత్రం విడుదలై గురువారం రోజుకి సరిగ్గా పదేళ్లు పూర్తవుతోంది.
దీనితో లెజెండ్ 10 ఇయర్స్ సెలెబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి బాలకృష్ణ, బోయపాటి, నిర్మాతలు, హీరోయిన్ సోనాల్ చౌహన్, ఇతర చిత్ర యూనిట్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో బాలయ్య ప్రసంగం హైలైట్ గా నిలిచింది. లెజెండ్ చిత్రంతో పాటు బాలయ్య రాజకీయ అంశాలని కూడా టచ్ చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ తన కెరీర్ లో స్పెషల్ గా నిలిచిన చిత్రాలన్నింటిని ప్రస్తావించారు. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు చిత్రాలు సృష్టించిన రికార్డులని బాలయ్య గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రాలు 100 రోజులని అత్యధిక సెంటర్స్ లో పూర్తి చేసుకున్నాయని బాలయ్య అన్నారు. రికార్డులు నాకేమీ కొత్త కాదు. చరిత్ర సృష్టించాలన్నా నేనే.. వాటిని తిరగరాయాలన్నా నేనే అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి అదరగొట్టారు.
లెజెండ్ చిత్రం సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి చిత్రాల జాబితాలో ఉంటుందని బాలయ్య అన్నారు. ఈ క్రమంలో వేదికపై తన పక్కనే ఉన్న హీరోయిన్ సోనాల్ చౌహన్ గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. సోనాల్ చౌహన్ డ్రెస్ ని బాలయ్య ఏకంగా రాజకీయాలతో ముడిపెట్టేశారు.
ఇవాళ అనుకోకుండా మా హీరోయిన్ సోనాల్ చౌహన్ పసుపు చీరలో వచ్చింది. పసుపు శుభానికి సూచకం. పసుపు శుభ కార్యాలకు ఆహ్వాన జీతం.. పసుపంటే సంక్షేమం.. పసుపంటే అభివృద్ధి .. అంటూ బాలయ్య సోనాల్ చౌహాన్ ని బాగానే వర్ణించారు. 2014 ఎన్నికల ముందు లెజెండ్ చిత్రం విడుదలయింది. ఆ చిత్ర ప్రభావం ఎంత ఉండిందో ఆ ఎన్నికల రిజల్ట్స్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఈ చిత్రాన్ని ఎన్నికల ముందు రీ రిలీజ్ చేస్తున్నట్లు బాలయ్య ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడిని, చిత్ర యూనిట్ ని బాలయ్య అభినందించారు. త్వరలో ఎన్నికల ప్రచారం మొదలు కాబోతోంది అని.. రాజకీయాల గురించి పూర్తిగా అక్కడ మాట్లాడతా అని బాలయ్య అన్నారు.