చిన్న సినిమా అయినా భారీగా ప్రమోట్ చేశారు. స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగ వంశీ ఈ మూవీ ప్రమోషన్స్ కోసం స్టార్స్ ని రంగంలోకి దించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరుకావడం సినిమాకు విపరీతమైన ప్రచారం దక్కింది. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే సైతం Varudu kaavalenu ప్రమోషన్స్ లో భాగమయ్యారు. దీనితో వరుడు కావలెను చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి.
ఇక వరుడు కావలెను మూవీ కథ విషయానికి వస్తే.... దుబాయ్ లో ఆర్కిటెక్ గా పనిచేసే ఎన్నారై ఆకాష్(Naga shaurya) ఓ ప్రాజెక్ట్ పనిపై ఇండియా వస్తాడు. ఆ క్రమంలో మేనేజర్ గా పనిచేస్తున్న భూమి(రీతూ వర్మ)ని కలుస్తాడు. మొదటి చూపులోనే భూమి ప్రేమలో పడిపోయిన ఆకాష్ ఆమెను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పెళ్లి, ప్రేమ వ్యవహారాలు నచ్చని మొండిపిల్ల అయిన భూమి, ఆకాష్ ని దూరం పెడుతూ ఉంటుంది. అయితే ఆకాష్ పట్ల ఆమెకు ప్రేమ మొదలయ్యాక ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకుని, దూరం పెరుగుతుంది... చివరికి భూమి, ఆకాష్ ప్రేమ సక్సెస్ అయ్యిందా? ఈ యువ జంట కహానీ ఎలా ముగిసింది అనేది మిగతా కథ.
డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్న నాగ శౌర్య ఈ సారి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఎంచుకున్నారు. ఆ టైటిల్ చూస్తేనే అర్థం అవుతుంది.. ఇది రొమాన్స్ తో కూడిన ఫ్యామిలీ డ్రామా అని. చాలా వరకు ప్రేక్షకులు ఆశించిన అంశాలు వరుడు కావలెను మూవీలో ఉన్నాయి. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, డ్రామా కలగలిపి ఓ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా మలచాలని డైరెక్టర్ ప్రయత్నం చేశారు.
అయితే బలహీనమైన కథ, నెరేషన్ సినిమాను ప్రేక్షకుల అంచనాలకు చేరుకోలేకపోయింది. కథ రొటీన్ అయినా మంచి స్క్రీన్ ప్లే తో భక్తి కట్టించవచ్చు. ఆ విషయంలో నెటిజెన్స్ వరుడు కావలెను సినిమాపై పెదవి విరుస్తున్నారు. మెల్లగా సాగే కథనం సినిమాకు మైనస్ గా మారిందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు.
అయితే వరుడు కావలెను సినిమాలో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా డైలాగ్స్, కామెడీ వన్ లైనర్స్ మెప్పించాయన్న మాట వినిపిస్తుంది. ఆఫీస్ సన్నివేశాలలో వెన్నెల కిషోర్, ప్రవీణ్ కామెడీ, ఫ్లాష్ బ్యాక్ లో సత్య, వెడ్డింగ్ సన్నివేశాలలో సప్తగిరి కామెడీ పంచడంలో కొంత వరకు సక్సెస్ అయ్యారు.
సాంకేతిక అంశాలు పర్వాలేదు. సాంగ్స్ తో పాటు కొన్ని సన్నివేశాలలో సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. విశాల్ చంద్ర శేఖర్, థమన్ సంగీతం పర్వాలేదు. దిగు దిగు నాగ సాంగ్ బాగుందని నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.