
ఎపిసోడ్ ప్రారంభంలో సిద్దు చాలా మంచివాడు అంటుంది కృష్ణ. నీకు తెలుసా నువ్వు మాట్లాడావా నీకేం తెలీదు పో అంటుంది నందిని. నువ్వు నా మాట వింటావు కదా నేను అబద్ధం చెప్పను నిజంగానే సిద్దు చాలా మంచివాడు అంటుంది కృష్ణ. నీకు సిద్దు ని చూడాలని ఉందా అని అడుగుతుంది. వద్దు బాబాయిలు చంపేస్తారు అంటుంది నందిని. వాళ్ళు ఎవరికీ తెలియకుండా నేను సిద్దు ని చూపిస్తాను అంటుంది కృష్ణ. కానీ నా ముందు తప్ప సిద్దు దగ్గరికి వెళ్దామని ఎవరి ముందు అడగకూడదు సరేనా అంటుంది కృష్ణ. సరే అంటూ ఆనందంగా తల ఊపుతుంది నందిని. మరోవైపు నా వ్యక్తిత్వాన్ని చంపుకొని కృష్ణని అవమానించాను. కృష్ణ బాధ్యత నాది అని మీకు ఇచ్చిన మాటని మొదటిసారిగా తప్పాను దయచేసి నన్ను క్షమించండి అంటూ కృష్ణ తండ్రి ఫోటో ముందు చేతులు జోడించి ప్రార్థిస్తాడు మురారి.
అంతలోనే అక్కడికి వచ్చిన కృష్ణని చూసి నువ్వు ఇంత సీరియస్ గా ఉంటే చూడలేకపోతున్నాను అంటాడు మురారి. నేను కూడా మిమ్మల్ని అంత సీరియస్ గా చూడలేకపోయాను గౌతమ్ సార్ ని చూడటానికి వెళ్తున్నాను అనేసరికి మీలో అనుమానం మొదలైంది. తరతరాలుగా పురుషుడు స్త్రీని ఇలాంటి పరిస్థితుల్లో అనుమానిస్తూనే ఉన్నాడు. మీలో విచక్షణ ఎందుకు మాయమైంది అంటూ మురారిని నిలదీస్తుంది కృష్ణ. నా గురించి అన్ని తెలిసి కూడా బలహీన క్షణానికి బానిస అయ్యారు నా దృష్టిలో పూర్తిగా దిగజారి పోయారు అంటుంది కృష్ణ. అది అనుమానం కాదు బాధ్యత నువ్వు అమాయకురాలివి నిన్ను ఆ శివన్న లాంటి వాళ్ళ దగ్గర నుంచి రక్షించవలసిన బాధ్యత నాకు ఉంది. నువ్వు ఎందుకు వెళ్తున్నావో కారణం చెప్పకపోయేసరికి నిజమైన భర్త లాగే స్పందించాను అంటాడు మురారి.
మిమ్మల్ని మీరు ఎంత అందంగా సమర్ధించుకుంటున్నారు అంటుంది కృష్ణ. ఈ సమర్ధింపులో పడి మీరు రాయి లాగా మారిన విషయం కూడా హుందాగా ఆవిష్కరించుకున్నారు. నేను ఆ క్షణంలో మీ కళ్ళల్లోకి చూశాను ఆ కళ్ళల్లో నామీద ప్రేమ లేదు సరి కదా కరుడుగట్టిన కసాయితనం కనిపించింది. మీరు నా చేతిని ఒక నేరస్తురాలిని పట్టుకున్నంత బలంగా పట్టుకున్నారు అంటుంది కృష్ణ. మరోవైపు కృష్ణ మాటలు తలుచుకొని ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది అయినా తన దగ్గర ఏం రుజువులు ఉన్నాయి అంటూ టెన్షన్ పడుతుంది భవాని. అంతలో అక్కడికి వచ్చిన ముకుంద, బయలుదేరి వెళ్ళిపోతాను అన్న కృష్ణ సడన్గా నిర్ణయాన్ని ఎందుకు మార్చుకుంది అత్తయ్య మీరు మాత్రం ఎందుకు లోపలికి రానిచ్చారు అని నిలదీస్తుంది.
ఒక్కసారి ఎదురు తిరిగి నా భార్య నాకు కావాలి అని మురారి అంటే అప్పుడు నా పెద్దరికం ఏమైపోతుంది భవాని. నేను సంసారాలు విడదీసే అంతా కఠినాత్మురాలిని కాదు. కృష్ణుని శాశ్వతంగా వెళ్లిపోమనలేదు క్రమశిక్షణ తప్పినందుకు మాత్రమే వెళ్ళమన్నాను. నా కొడుకుని కోడల్ని నేను ఎందుకు వెళ్ళిపోమంటాను నాలుగు రోజులు కృష్ణ కూడా తన తప్పు తెలుసుకుని తిరిగి వస్తుందని తెలుసు అంటుంది భవాని. నా గురించి తక్కువగా ఆలోచించొద్దు నా కోడలు నా ఇంట్లోనే ఉండాలని పట్టు పట్టి మరీ నిన్ను ఇక్కడికి రప్పించాను మర్చిపోయావా అంటూ ముకుందని అక్కడ నుంచి పంపించేస్తుంది భవాని. మరోవైపు సారీ అని రాసి కృష్ణ కి కనిపించేలాగా పెడతాడు మురారి. గమనించిన ఏమీ మాట్లాడదు కృష్ణ. పశ్చాతాపంతో కుమిలిపోతున్నాను ఈ ఒక్కసారికి క్షమించలేవా అంటాడు మురారి.
నాకు మీ మీద కోపం ద్వేషం లాంటివి ఏ ఫీలింగ్స్ లేవు నా గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అంటుంది కృష్ణ. మన జీవితంలో చాలా విషయాలు మన ప్రమేయం లేకుండానే అయిపోతాయి. నిజం వేరే అయినా నిందలు మోయాల్సి వస్తుంది అంటూ కృష్ణ తండ్రి మరణాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు మురారి. జరిగిన తప్పుకి ఇప్పటికే చాలాసార్లు క్షమాపణ అడిగాను ఇకపై నీ ఇష్టం అంటాడు మురారి. అంతంత పెద్ద మాటలు ఎందుకు సార్. జోక్ పదేపదే మనల్ని నవ్వించలేదు కానీ ఒక గాయం మనల్ని పదేపదే ఏడిపించగలదు అంటుంది కృష్ణ. అందుకే గాయాన్ని చెరుపేయటం కోసం నాకు ఒక అవకాశాన్ని ఇవ్వు అంటూ రిక్వెస్ట్ చేస్తాడు మురారి. అయినా కోపంతో దిండు దుప్పటి తీసుకొని నందిని దగ్గరికి బయలుదేరుతుంది కృష్ణ. ఈ టైంలో అక్కడికెందుకు అంటాడు మురారి.
తను నా పేషెంట్ తన బాధ్యత నాది అంటుంది కృష్ణ. ఈ విషయం అమ్మకు తెలిస్తే చాలా బాధపడుతుంది అంటాడు మురారి. విషయం రేవతి అత్తయ్య వరకు వెళ్తే అత్తయ్యకి నిజం చెప్పేస్తాను. నిజం తెలిసిన కూడా ఆవిడ నన్ను నిందించాలని అనుకోదు అమ్మలాగా అర్థం చేసుకుంటుంది అంటుంది కృష్ణ. అంత పని చెయ్యొద్దు అంటూ బ్రతిమలాడుతాడు మురారి. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, పాపం మనం ఇద్దరమే నిజమైన భార్య భర్తలు అని ఆవిడ నా మీద చాలా ప్రేమని పెంచుకుంది అలాంటిది మన పెళ్లి అబద్ధమని తెలిస్తే తట్టుకోగలదా.
చివరిదాకా నిజం దాచి ఆవిడ మనసుని ముక్కలు చేయటం కన్నా ఇప్పుడే నిజం చెప్పడం మంచిది అంటుంది కృష్ణ. మన బంధానికి మీ దృష్టిలో ఎలాంటి విలువ లేదా అని అడుగుతాడు మురారి. ఇదివరకు ఉండేది ఇప్పుడు లేదు అంటుంది కృష్ణ. ఇంత కఠినంగా ఎలాగా మారిపోయావు నీకు సంబంధించిన అంతవరకు నేను ఏమీ కానా, అని నిలదీస్తాడు మురారి. నా తప్పేమీ లేదు అని నిరూపించుకోవడానికి మా సీనియర్ డాక్టర్ని రమ్మన్నాను అంటుంది కృష్ణ. అంతలోనే అక్కడికి వచ్చిన గౌతమ్ ని చూసి అందరూ షాక్ అవుతారు.