నటి మోనాల్ గజ్జర్‌కు పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా క్యాన్సర్ సోకగా, శస్త్రచికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు. అల్లరి నరేష్ సుడిగాడు చిత్రంతో మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా పరిచయమైంది.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మోనాల్ గజ్జర్ తన ఆరోగ్యానికి సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించారు. తాను థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడినట్లు, చికిత్సతో పాటు శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. తనకు పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma) ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని వివరించారు. ఈ వ్యాధి నిర్ధారణ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వెల్లడించారు.
24
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచన
క్యాన్సర్ నిర్ధారణ, శస్త్రచికిత్స తర్వాత ఎదురైన అనుభవం తనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసిందని మోనాల్ పేర్కొన్నారు. చాలాసార్లు విజయాలు, లక్ష్యాలు, ఇతర భౌతిక విషయాలకు ప్రాధాన్యం ఇస్తూ మన ఆరోగ్యాన్ని వెనక్కి నెట్టేస్తుంటామని అభిప్రాయపడ్డారు. అవసరమైన వైద్య పరీక్షలను వాయిదా వేయకుండా సమయానికి చేయించుకోవాలని సూచించారు. శరీరంలో కనిపించే మార్పులను గమనిస్తూ, ఏదైనా సమస్య అనిపిస్తే వైద్యులను సంప్రదించాలని పరోక్షంగా గుర్తుచేశారు.
34
మన ఆరోగ్యానికి మనమే ప్రాధాన్యం ఇవ్వాలి
తన సోషల్ మీడియా పోస్టులో మోనాల్ గజ్జర్.. “విజయాలు, సాధించిన ఘనతలు, భౌతిక వస్తువుల కంటే మీకు మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనసు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకునే శక్తి ఉండాలని కోరుకుంటున్నాను. పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా నిర్ధారణ, శస్త్రచికిత్స ద్వారా ఎదురైన ఇటీవలి అనుభవం.. మన ఆరోగ్యాన్ని ఎంత సులభంగా నిర్లక్ష్యం చేస్తామో నాకు గుర్తు చేసింది” అని రాశారు. అలాగే, “మనకు మనమే ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభిద్దాం. ముఖ్యంగా మహిళలు కొన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కొన్ని వాక్సిన్లు వేయించుకోవాలి అని పేర్కొన్నారు.
మోనాల్ గజ్జర్ గుజరాతీ సినీ పరిశ్రమకు చెందిన నటి. తెలుగులో అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అదే విధంగా ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. 98 రోజులు హౌస్ లో ఉన్నారు. తాజాగా క్యాన్సర్ చికిత్స అనంతరం కోలుకున్నట్లు వెల్లడించిన ఆమె, తన శారీరక రూపంలోనూ స్పష్టమైన మార్పుతో కనిపిస్తున్నారు. గతంతో పోలిస్తే బరువు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, తన ఆరోగ్య ప్రయాణం గురించి ఆమె చేసిన ప్రకటనలో ప్రధానంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, అవసరమైన పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలకు సందేశం ఇచ్చారు.