
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి ఎంతో కష్టపడి నటుడిగా నిరూపించుకున్నారు. స్టార్‌గా ఎదిగారు. మెగాస్టార్ గా కీర్తిని పొందున్నారు. తన నటన, డాన్సులు, మ్యానరిజం, యాక్షన్‌తో కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అదే సమయంలో వేల కోట్ల ఆస్తులు కూడా సంపాదించుకున్నారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన ఆస్తులు, సంపాదనకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ వివరాలు చూస్తే
చిరంజీవి నాన్న కానిస్టేబుల్. అప్పట్లో పెద్దగా జీతాలు ఉండేవి కావు, కానీ ఎలాగోలా కుటుంబాన్ని లాక్కొచ్చారు. చిరంజీవి స్టడీస్ పూర్తవగానే నటనపై దృష్టి పెట్టారు. మద్రాస్ వెళ్లి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి నటుడిగా నిరూపించుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అయితే స్వతహాగా చిరుకి డాన్సుల్లో మంచి నైపుణ్యం ఉంది. అదే ఆయన్ని ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిపింది. సూపర్ స్టార్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించింది. అప్పటి వరకు ఇండస్ట్రీలో డాన్సులంటే ఏఎన్నార్, కృష్ణ వంటివారే చేసేవారు. కానీ డాన్సుల లెక్కలు మార్చేశారు చిరు. అలాగే తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. కమర్షియల్ చిత్రాలతో విజయాలు అందుకుని అత్యంత సక్సెస్ ఫుల్ హీరోగా నిలిచారు.
`ఖైదీ` మూవీ హిట్ తర్వాత చిరంజీవి లెక్క మారిపోయింది. ఆ తర్వాత నిర్మాతలు, దర్శకులు క్యూ కట్టారు. చిరుకి ఎంత పారితోషికం ఇచ్చేందుకైనా వెనకాడలేదు. ఎందుకంటే చిరంజీవి నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో కాసుల వర్షం కురిసేది. ఆడియెన్స్ క్యూ కట్టేవారు. ఫ్లాప్ సినిమా అయినా మినిమమ్ గ్యారంటీగా ఆడేది. అందుకే చిరుకి అంత క్రేజ్. ఆయన పాటలు, డాన్సుల కోసమైనా ఆడియెన్స్ థియేటర్ కి వచ్చేవారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇండియన్ సినిమాలో తొలిసారి కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరో చిరంజీవి అని అప్పట్లో మేగజీన్లు కూడా ప్రచురించాయి.
తన క్రేజ్‌ని క్యాష్ చేసుకున్నారు చిరు. వచ్చిన పారితోషికాన్ని సరిగ్గా వాడుకున్నారు. ఆస్తులు కూడబెట్టుకున్నారు. బాగా సెటిల్డ్ అయ్యారు. కుటుంబాన్ని సెటిల్ చేశారు. ఇద్దరు చెళ్లెళ్ల పెళ్లిళ్లు చేశారు. వారి కుటుంబాలను సెట్ చేశారు. అలాగే ఇద్దరు తమ్ముళ్లని సెట్ చేశారు. అయినా వేల కోట్లు సంపాదించారు. ప్రస్తుతం చిరంజీవి వద్ద సుమారు రూ.2000-2500 కోట్ల వరకు ఆస్తులున్నాయని సమాచారం. చిరంజీవికి జూబ్లీహిల్స్ లో లగ్జరీ హౌజ్ ఉంది. అలాగే బెంగుళూరులో ఫామ్ హౌజ్ ఉంది. వీటితోపాటు చెన్నైలోనూ ఇళ్లు ఉన్నట్టు సమాచారం. ప్రారంభం నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో వాటి విలువ భారీగా పెరిగింది. అదే చిరంజీవిని వేల కోట్లకు అధిపతిని చేసింది.
చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన కార్ కలెక్షన్ ఉంది. రోల్స్ రాయిస్ వాటిలో ప్రత్యేకం. దానితో పాటు బెంజ్, రేంజ్ రోవర్, ఆడి, టయోటా హై ఎండ్ కార్స్ ఆయన కొనుగోలు చేశారు. వీటితోపాటు సెపరేట్‌గా ఒక విమానం ఉందని సమాచారం. చిరు ఫ్యామిలీ ఇండియాలో ఎక్కడికి వెళ్లినా ఈ విమానాన్నే వాడుతుంటారు. చాలా సార్లు అందులో ప్రయాణించి కనిపించారు. చిరంజీవి ఆదాయ మార్గం ప్రధానంగా సినిమాలే అని చెప్పొచ్చు. ఆయన ఒక్కో మూవీకి రూ.30 కోట్ల నుంచి రూ.50కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తున్నారు. అడపాదడపా యాడ్స్ కూడా చేస్తున్నారు. ఇలా ఏడాదికి ఓ వంద కోట్లు యాడ్ అవుతాయని చెప్పొచ్చు. చిరుకి ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లోనూ భాగం ఉందని సమాచారం.
ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలు చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో `విశ్వంభర` మూవీ రూపొందుతుంది. ఈ మూవీ టీజర్‌ని చిరు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది వచ్చే ఏడాది సమ్మర్‌లో రాబోతుంది. ఇంకోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో `మన శంకరవరప్రసాద్ గారు` మూవీ చేస్తున్నారు.ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ ని ఈ రోజు ఉదయం విడుదల చేశారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి వస్తున్నారు.