Matti Kusthi Review: `మట్టి కుస్తీ` సినిమా రివ్యూ

First Published Dec 2, 2022, 6:25 AM IST

రవితేజ నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం `మట్టికుస్తీ`. విష్ణు విశాల్‌, ఐశ్వర్యా లక్ష్మీ జంటగా తమిళంలో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ డబ్ చేశాడు. శుక్రవారం(డిసెంబర్‌ 2న) విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

మాస్‌ యాక్షన్ మూవీస్‌తో తనకంటూ మాస్‌ మహారాజా అనే ఇమేజ్‌ తెచ్చుకున్న రవితేజ నిర్మాతగా మారిన నిర్మించిన చిత్రం `మట్టికుస్తీ`(తమిళంలో-గట్టకుస్తీ). విష్ణు విశాల్‌ ఇందులో హీరో. ఆయనకు జోడీగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించింది. స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు తమిళ నటుడు విష్ణు విశాల్‌. `రాక్షసన్‌` చిత్రంతో అక్కడ పెద్ద హిట్‌ని అందుకుని పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. దీనికితోడు మాజీ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాలని వివాహం చేసుకుని మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఐశ్వర్య లక్ష్మీ సైతం సౌత్‌లో మంచి పేరు తెచ్చుకుంది. చెల్లా అయ్యావు అనే అప్‌కమింగ్‌ డైరెక్టర్‌ తో రవితేజ, విష్ణు విశాల్‌ `మట్టికుస్తీ` చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా శుక్రవారం(డిసెంబర్‌2)న తెలుగు, తమిళంలో విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా? రవితేజ నిర్మాతగా మారేంత స్టఫ్‌ ఈ చిత్రంలో ఏముందనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః
స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ చిత్రమిది. మలయాళ ఫ్యామిలీకి చెందిన కీర్తి(ఐశ్వర్య లక్ష్మీ)కి చిన్నప్పట్నుంచి రెజ్లింగ్‌ అంటే ఇష్టం. తన బాబాయ్‌ తనని కుస్తీ పోటీలకు తీసుకెళ్తుంటాడు. అలా ఆమెకి ఆసక్తి పెరిగి రెజ్లర్‌గా రాష్ట్రస్థాయిలో ఛాంపియన్‌గా నిలుస్తుంది. అదే టైమ్‌లో ఇంట్లో పెళ్లి ఒత్తిడి పెరిగిపోతుంది. చెల్లి ఎదిగిన వస్తోన్న నేపథ్యంలో తన మ్యారేజ్‌ చేసుకోవాలని ఫోర్స్ చేస్తుంటారు పేరెంట్స్. వారికోసం పెళ్లికి ఒప్పుకుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వీర(విష్ణు విశాల్‌) ఊర్లో పెద్ద ఆసామీ. అప్పుడప్పుడు కబడ్డీ ఆడుతుంటాడు. ఎలాంటి లక్ష్యం లేకుండా ఊర్లో పంచాయితీలని చెప్పి తన మామయ్యతో కలిసి ఎంజాయ్‌ చేస్తుంటాడు. అమ్మానాన్న లేరు. వయసు పెరిగిపోతుండటంతో పెళ్లిచేయాలనుకుంటాడు. కానీ జడ పెద్దగా లేదని, తనకంటే ఎక్కువగా చదువుకుందని చాలా సంబంధాలను రిజెక్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తనకంటే తక్కువ చదువుకుందని, పెద్ద జడ ఉందని, తను రెజ్లర్‌ కాదని అబద్దం చెప్పి ఐశ్వర్యలక్ష్మితో పెళ్లి చేస్తారు. ఓ ఫ్యాక్టరీ మూయించే విషయంలో ప్రత్యర్థి(అజయ్‌) ఊరుజాతరలో వీరపై రౌడీలతో దాడి చేయిస్తాడు. ఆ గొడవలో భర్తపై రౌడీలు దాడి చేయడాన్ని తట్టుకోలేక తన ఒరిజినాలిటీని బయటపెట్టి విలన్లని చితకబాదుతుంది కీర్తి. భార్య గురించి అసలు నిజాలు తెలవడంతో ఖంగుతింటాడు వీర ఏం చేశాడు? విడాకుల వరకు వెళ్లిన వీరు మళ్లీ కలుసుకున్నారా? కుస్తీ పోటీల్లో భార్యతోనే వీర ఎందుకు పోటీ పడాలనుకుంటాడు?, చివరికి వీరిద్దరి లైఫ్‌లో ఎలాంటి ముగింపు లభించిందనేది మిగిలిన కథ. 

విశ్లేషణః
స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే రొటీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. సినిమా కథ అసాంతం ఊహించినట్టే సాగుతుంది. `ఎఫ్‌2`, `పెళ్లైన కొత్తలో` వంటి చాలా సినిమాలను తలపిస్తుంటుంది. సినిమాకి అసలు హీరో ఐశ్వర్య లక్ష్మీ. కథగా రెగ్యూలర్‌ మూవీ. కానీ ఫ్యామిలీ డ్రామాకి, స్పోర్ట్స్ యాంగిల్‌ని మేళవించి కాస్త కొత్తదనం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సినిమా చివరి వరకు ఫన్‌, కామెడీతో నడిపించాడు దర్శకుడు. మధ్య మధ్యలో రెండు ఫైట్లతో కాస్త హీటు పెంచాడు. పెళ్లి చూపులకు సంబంధించిన సన్నివేశాలు, జడ పెద్దగా లేదని సంబంధాలు రిజెక్ట్ చేయడం కాస్త ఫన్నీగా అనిపిస్తుంటుంది. అలాగే వీర కంటే కీర్తి తక్కువ చదువుకుందని, తనకు ఏం తెలియదని, కుస్తీ పోటీలు తెలియవని, అలాగే తనకు పెద్ద జుట్టు లేదని అబద్దం చెప్పి పెళ్లిచేసుకున్న నేపథ్యంలో వాటిని భర్త ముందు మ్యానేజ్‌ చేసే క్రమంలో ఆమె పడే ఇబ్బందులు నవ్వులు తెప్పిస్తుంటాయి.

అయితే హీరోయిన్‌ గురించి అసలు విషయాలు తెలియడంతో హీరో షాక్లోకి వెళ్లడం, ఆ తర్వాత పూర్తిగా సీన్‌ రివర్స్ కావడం, ఊరి అందరి ముందు తన పరువు తీసిందని భార్యపై లోలోపల కోపంతో ఫ్రస్టేట్‌ అవడం నవ్వులు పూయించాయి. ఫస్టాఫ్‌ మొత్తం జస్ట్ సీన్లకే పరిమితం. కథ ఏమాత్రం ముందుకు సాగదు. రొటీన్‌ కామెడీ సీన్లు బోర్‌ తెప్పిస్తుంటాయి. అక్కడక్కడ కామెడీ పండింది. సెకండాఫ్‌లో హీరో పరిస్థితి రివర్స్ కావడంతో ఏం జరుగుతుందనేది ముందే ఊహించవచ్చు. అయితే ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కొంత కొత్తదనం యాడ్‌ చేశాడు దర్శకుడు. భార్యతో కుస్తీ పోటీపడాలనుకోవడం, అందుకోసం ప్రీపేర్‌ కావడం వంటి సన్నివేశాలు కథ కాస్త సీరియస్‌ మూడ్‌లోకి వెళ్తుంది. 
 

చివరికి స్పోర్ట్స్ మూవీస్‌లో ఎలాంటి ముగింపు ఉంటుందో ఇందులోనూ సేమ్‌. కొంత ఎమోషన్స్ తో, ఓ కుస్తీ ఫైట్‌తో ముగించారు. ఆయా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో చాలా వరకు అక్కడక్కడ కామెడీ సన్నివేశాలు పేలాయి. కానీ మిగిలినదంతా రొటీన్‌గానే సాగుతుంది. సన్నివేశాల పరంగా చాలా సినిమాలు గుర్తుకొస్తుంటాయి. దీనికితోడు తమిళ ప్లేవర్‌ తెలుగు ఆడియెన్స్ కి పెద్దగా కనెక్ట్ కాదు. పాటలు మైనస్‌. బీజీఎం కూడా తేలిపోయింది. సాగేసన్నివేశాలకు, బీజీఎంకి పొంతనలేనట్టుగా ఉంటుంది. చివరికి ఎమోషనల్‌ టచ్‌ కొంత రిలీఫ్‌నిచ్చే అంశం. 
 

ప్లస్‌లుః

కామెడీ సన్నివేశాలు
క్లైమాక్స్

మైనస్‌లుః

రొటీన్‌ కథ
ముందుగా ఊహించే సన్నివేశాలు
మ్యూజిక్‌

నటీనటులుః 
వీర పాత్రలో విష్ణు విశాల్‌ బాగా చేశాడు. బాగా కామెడీ పండించాడు. వీరగా అదరగొట్టాడు. కీర్తి పాత్రలో ఐశ్వర్యలక్ష్మీ అదరగొట్టింది. ఇంకా చెప్పాలంటే సినిమాకి తనే హీరో అనేలా సాగడం విశేషం. సైలెంట్‌గా సినిమాని తన భుజాలపై మోసింది. వీర మామయ్యగా కరుణాస్‌, కీర్తి బాబాయ్‌గా మునీష్‌ కాంత్‌, కాళీ వెంకట్‌, అజయ్‌, శత్రు తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు. 

టెక్నీషియన్లుః
దర్శకుడు చెల్లా అయ్యావు రొటీన్‌ కథని ఎంచుకోవడం సినిమాకి పెద్ద మైనస్‌. అయితే దాన్ని కామెడీ ఎంటర్‌టైనర్‌గా, స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌లో చెప్పిన తీరు బాగుంది. ఇంకాస్త కామెడీపై వర్క్ చేస్తే బాగుండేది. కానీ చాలా తెలుగుసినిమాలను తలపించేలా సన్నివేశాలుండటం పెద్ద మైనస్‌. సినిమాకి సోల్‌ మెస్‌ అయ్యింది. క్లైమాక్స్ ని నమ్ముకుని సినిమాని నడిపించాడనిపిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్‌ సంగీతం సినిమాకి మైనస్‌. ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఎస్‌ మణికందన్‌ కెమెరా వర్క్ బాగుంది. రవితేజ, విష్ణువిశాల్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి. 

ఫైనల్‌గాః స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే రొటీన్‌ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.

రేటింగ్‌ః 2.5

click me!