Mandaadi Movie Review: మండాడి మూవీ రివ్యూ.. సూరి హీరోగా సుహాస్‌ విలన్‌గా చేసిన మూవీ ఎలా ఉందంటే?

Published : Sep 10, 2026, 12:28 PM IST

తమిళ నటుడు సూరి హీరోగా, తెలుగు నటుడు సుహాస్‌ విలన్‌గా నటించిన మూవీ `మండాడి`. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు గురువారం తెలుగులో కూడా విడుదలైంది. మరి మూవీ ఎలా ఉందంటే?

PREV
17
మండాడి మూవీ రివ్యూ

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’. ఇందులో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి భారీ ఎత్తున విడుదల చేయనుంది. ఇక ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ అన్నీ కూడా సినిమా మీద హైప్‌ను పెంచేశాయి. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ అయితే అందరినీలో సినిమాని చూడాలన్న ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. నేడు గురువారం(సెప్టెంబర్‌ 10)న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

27
మండాడి మూవీ కథ

సాట్టా పులి(సుహాస్‌).. కళింగపట్నం పోర్ట్ కి తిరుగులేని కింగ్‌గా ఉంటాడు. పడవ వ్యాపారంలో తనే ముందు, అదే సమయంలో పడవ పోటీల్లోనూ తన సునామీ రైడర్స్ జట్టు విజయం సాధిస్తూ కళింగపట్నాన్ని శాసిస్తుంటారు. ఓ రోజు జాతరలో మల్లేష్‌ అనే కుర్రాడు సాట్టాపులిపై దాడికి దిగుతాడు. కానీ పులి మిస్‌ అవుతాడు. దీంతో ఆ కుర్రాడు హైదరాబాద్‌ పారిపోయి కాళి(సూరి) వద్దకు చేరతాడు. కాళి అతన్ని కాపాడి రాజీ కోసం మళ్లీ కళింగపట్నం తీసుకొస్తాడు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ కాళి కళింగపట్నం వస్తాడు. పెద్దలు కుదిర్చిన రాజీలో భాగంగా పడవపోటీలకు దిగుతారు. అందులో ఎవరు గెలిస్తే వారే కళింగపట్నానికి అధికారిక జట్టు, ఓడిపోయిన వాళ్లు పోర్ట్ ని వదిలివెళ్లిపోవాల్సి ఉంటుంది. దీనికి సాట్టాపులి మొదట నో చెబుతాడు. తర్వాత తన వ్యాపారాలను దృష్టిలో పెట్టుకొని ఓకే చెబుతాడు. అయితే కాళి కూడా రంగంలోకి దిగుతాడు. మరోవైపు కాళిని చూసి ఏంజెల్‌(మహిమా నంబియార్‌) ఛీ కొడుతుంది. ద్రోహివి అంటూ అసహ్యించుకుంటుంది. ఇంకోవైపు కాళిని చూసి పులి రగిలిపోతుంటాడు. అదే సమయంలో ఏంజెల్‌ కొడుకు కూడా కాళి అంటే కోప్పడతాడు. కాళికి, తన అమ్మకి ఉన్న ప్రేమ వ్యవహారం తెలిసి అసహ్యించుకుంటాడు. ఈ క్రమంలో తాను మళ్లీ ఎందుకు వచ్చాను?, ఎందుకు పోటీలో పాల్గొంటున్నాననేది కాళి.. మల్లేష్‌కి వివరిస్తాడు. ముందు తాను, పులి ఫ్రెండ్స్ అని, కలిసి పడవ పోటీల్లో పాల్గొన్నామని చెబుతాడు. తన స్నేహాన్ని, ఏంజెల్‌తో ప్రేమ కథని వివరిస్తాడు. వీరికి మునయ్య(సత్యరాజ్‌) కోచ్‌. మరి మున్నయ్య ఎలా చనిపోయాడు? ప్రాణ స్నేహితులు కాళి, సాట్టాపులి ఎందుకు విడిపోయారు. ఎందుకు పగతో రగిలిపోతున్నారు? కాళి, ఏంజెల్‌ ఎందుకు విడిపోయారు? అసలు కళింగ పోర్ట్ లో ఏం జరిగిందనేది అసలు కథ.

37
మండాడి మూవీ ఎలా ఉందంటే( విశ్లేషణ)

స్నేహం, ఆట ప్రధానంగా సాగే మూవీ ఇది. సముద్రంలో పడవ పోటీలను బేస్‌ చేసుకొని తెరకెక్కించారు. ఈ బ్యాక్‌ డ్రాప్‌ కొత్తగా ఉంది. ఇలాంటి బ్యాక్‌ డ్రాప్‌లో తెలుగులో సినిమాలు రాలేదు. అది పక్కన పెడితే మిగిలిన అంశాలన్నీ చాలా సినిమాల్లో ఉన్నవే. స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న సినిమాల్లో చివరికి ఆట ఎవరు గెలిచారనేది ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉంటుంది. హీరోవిలన్ల మధ్య ప్రధానమైన కాన్ల్ఫిక్ట్ ఇదే ఉంటుంది. ఒకప్పుడు ఫ్రెండ్స్, కలిసి పనిచేయడం, ఒక విషయంలో అభిప్రాయబేధాలు రావడం విడిపోవడం, అది శత్రుత్వానికి దారి తీయడం చాలా సినిమాల్లో జరుగుతుంటుంది. మొన్న వచ్చిన `దేవర` కూడా అలాంటిదే. ఇది కూడా అలాంటి స్టోరీనే. బ్యాక్‌ డ్రాప్‌ కొత్తగా ఉంటుంది. కానీ మిగిలిన అంశాలన్నీ రొటీన్‌గానే ఉంటాయి. సినిమాగా చూసినప్పుడు ప్రారంభం ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. పులిపై మల్లేష్‌ దాడి చేయడం, అతన్ని చంపే ప్రయత్నం చేయడం, కాళి కాపాడటం సస్పెన్స్ గా స్టార్ట్ అయి ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. కళింగపట్నంకి స్టోరీ వచ్చాక రొటీన్‌ అవుతుంది. సినిమా ఎంతకు ముందుకు సాగడు. కొంత సాగదీతగా ఉంటుంది. కాన్ల్ఫిక్ట్ అర్థం కాక బోరింగ్‌గా అనిపిస్తుంది. కథ, కథనాలు ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించవు. ఇంటర్వెల్‌ వరకు అదే ఫీలింగ్‌ ఉంటుంది. సెకండాఫ్‌ మాత్రం ఎంగేజ్‌ చేస్తుంది. కాళి తన గతాన్ని చెబుతాడు. పులి, కాళి స్నేహం, కోచ్‌ సత్యరాజ్‌ పాత్ర రివీల్‌ అవుతుంది. అక్కడ డ్రామా బాగానే వర్కౌట్‌ అవుతుంది. సత్యరాజ్‌ సారథ్యంలో కాళి, పులి కలిసి పడవ పోటీల్లో పాల్గొనడం, అదే సమయంలో ఆయన కూతురు ఏంజెల్‌తో లవ్‌ ట్రాక్‌ కొంత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత క్లైమాక్స్ పడవ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఈ క్రమంలో డ్రామా, సస్పెన్స్ అంశాలు, ఎమోషన్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. సినిమాకి సెకండాఫ్‌ ఆయువుపట్టుగా నిలుస్తుంది. పడవ పోటీలే మూవీకి హైలైట్‌గా చెప్పొచ్చు.

47
మండాడి మూవీలో ప్లస్‌, మైనస్‌లు

పడవ పోటీల నేపథ్యం, సెకండాఫ్‌, పడవ పోటీలు, అందులోని ఎమోషన్స్ ప్లస్‌ పాయింట్స్. బీజీఎం కూడా బాగుంది. విజువల్‌గా ఆకట్టుకునేలా ఉంది. ఆర్టిస్ట్ లు బాగా చేశారు. సినిమాకోసం టీమ్‌ చాలా కష్టపడ్డారు. ఈ విషయంలో అందరిని అభినందించాల్సిందే. ఆ కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. ఒరిజినల్‌ లొకేషన్లు చిత్రీకరించారు. సముద్రంలో పడవపోటీలను రియల్‌గా చూపించడం విశేషం. అది హైలైట్‌గానూ చెప్పొచ్చు. ఇక పడవ పోటీలు అనేది పక్కన పెడితే మిగిలిన అంశాలన్నీ రొటీన్‌గా ఉంటాయి. ఏమాత్రం కొత్తదనం లేదు. సంఘర్షణకి సంబంధించిన బలమైన పాయింట్‌ చూపించలేదు. హీరోవిలన్‌ మధ్య గొడవలకు దారితీసిన అంశాలు చూపించారు కానీ, అందులో విలన్‌ అంత క్రూరమైనవాడా అనేది ఎస్టాబ్లిష్‌ చేయలేదు. డ్రామా కొంత వరకే పండింది. చాలా చోట్ల సీన్లు తేలిపోయాయి. లవ్‌ స్టోరీ కూడా కొత్తగా ఏం లేదు, గొప్పగా లేదు. అదే సమయంలో పులిని మల్లేష్‌ ఎందుకు చంపాలనుకుంటున్నాడనే విషయంలో క్లారిటీగా చూపించలేదు. సగంలోనే దాన్ని వదిలేశారు. ఇలా ప్లస్‌ ల కంటే మైనస్‌లు చాలానే ఉన్నాయి. ఓవరాల్‌గా ఇదొక యావరేజ్‌ ఫిల్మ్ గా నిలుస్తుంది.

57
మండాడి లో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

కాళి పాత్రలో సూరి కనిపించాడు. పాత్రలో ఒదిగిపోయి నటించాడు. పాత్రకి ప్రాణం పోశాడు. చాలా సెటిల్డ్ గా చేశాడు. ఇమేజ్‌, ఎలివేషన్లు అంటూ హడావుడి చేయకుండా రియాలిటీకి దగ్గరగా తన పాత్రని డిజైన్‌ చేయడం, తన కూడా అంతే బాగా నటించడం విశేషంగా చెప్పొచ్చు. ఇక సాట్టా పులిగా సుహాస్‌ అదరగొట్టాడు. తనలోని మరో కోణం చూడొచ్చు. విలన్‌గా ఇరగదీశాడు. భారీ ఆకారం, హైట్‌ లేకపోయినా తన విలనిజంతో భయపెట్టే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో పాజిటివ్‌గానూ కనిపించి మెప్పించాడు. సుహాస్‌లోని వేరియేషన్‌ సినిమాకి మరో ప్లస్‌గా చెప్పొచ్చు. ఏంజెల్‌గా మహిమా నంబియార్‌ ఫర్వాలేదనిపించింది. ఉన్నంతసేపు మెప్పించింది. ఎమోషన్స్ లోనూ ఆకట్టుకుంది. కోచ్‌ మునిగా సత్యరాజ్‌ పాత్రలో జీవించాడు. అదరగొట్టాడు. ఏంజెల్‌ భర్తగా రవీంద్ర విజయ్‌ పాత్రపరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మల్లేష్‌గా నటించిన అబ్బాయి కూడా మెప్పించాడు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

67
మండాడిలో టెక్నీషియన్ల పనితీరు

జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం బాగానే ఉంది. బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. కొన్ని చోట్ల తేలిపోయినా, పడవపోటీల్లో మాత్రం అదిరిపోయింది. తన మార్క్ ని చూపించారు. ఎస్‌ ఆర్‌ కథిర్‌ కెమెరా వర్క్ బాగుంది. రాఅండ్‌ రస్టిక్‌ లుక్‌ని తీసుకొచ్చారు. ఆర్ట్ వర్క్ మరో హైలైట్‌గా చెప్పొచ్చు. నిర్మాణ విలువలకు కొదవలేదు. బాగా తీశారు. దర్శకుడు మతిమారన్ పుగళేంది ఎంచుకున్న కథ బాగానే ఉంది. దాన్ని ఆకట్టుకునేలా, ఎంగేజ్‌ చేసేలా,నాటకీయంగా, ఎమోషనల్‌గా తెరకెక్కించే విషయంలో కొంత వరకు తడబాటు కనిపిస్తుంది. ఫస్టాఫ్‌ విషయంలో సక్సెస్‌ కాలేకపోయినా, సెకండాఫ్‌ని మాత్రం బాగా డీల్‌ చేశాడు. సినిమాని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ మూవీ కొంత వరకు ఎంగేజ్‌ చేసే మూవీగా నిలుస్తుంది.

77
ఫైనల్‌ రిపోర్ట్

ప్రారంభంలో బోరింగ్‌గా సాగినా, సెకండాఫ్‌లో ఆకట్టుకునే స్పోర్ట్స్ డ్రామాగా చెప్పొచ్చు. ఓవరాల్‌గా యావరేజ్‌ ఫిల్మ్.

రేటింగ్‌: 2.5

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories