సీనియర్ హీరో మమ్ముట్టి నటించిన లేటెస్ట్ మూవీ కలాంకావల్ ఓటీటీలో రిలీజ్ అయింది. సైకో థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించడం మాత్రమే కాదు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మలయాళం నుంచి తరచుగా థ్రిల్లర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. ఓటీటీలో మలయాళీ సినిమాలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న పాయింట్ ని తీసుకోవడం దాని చుట్టూ క్రైమ్ అంశాలు జోడించి కథని ఉత్కంఠ భరితంగా మార్చేస్తారు. మలయాళీ థ్రిల్లర్ సినిమాలు తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. ఓటీటీలో మలయాళీ సినిమాలు రిలీజ్ అయితే తెలుగు ఆడియన్స్ ఎగబడుతున్నారు. ఇప్పుడు మరో మలయాళీ థ్రిల్లర్ మూవీపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
25
అలాంటి పాత్రలో మమ్ముట్టి, అంతా షాక్
రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఓ మలయాళీ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ఏకంగా మలయాళీ స్టార్ హీరో నెగిటివ్ రోల్ లో నటించి ఆశ్చర్యానికి గురి చేశారు. అలాంటి ఇలాంటి నెగిటివ్ రోల్ కాదు ఏకంగా సైకో కిల్లర్ గా నటించారు. అందుకే ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ సినిమా పేరు ఏంటంటే.. కలాంకావల్. ఈ చిత్రంలో నటించింది మలయాళీ అగ్ర నటుడు మమ్ముట్టి. అంత గొప్ప లెజెండ్రీ నటుడు సైకో కిల్లర్ గా నటించడం ఆశ్చర్యమే.. కానీ ఆయన తన నటనతో కట్టిపడేశారు. ఈ చిత్రం తాజాగా సోనీలివ్ ఓటీటీలో విడుదలయింది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. జితిన్ కె జోస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
35
కథ ఏంటంటే
స్టాన్లీ దాస్( మమ్ముట్టి) తన భార్య పిల్లలతో హాయిగా జీవిస్తుంటాడు. అది అతడి జీవితంలో ఒక వైపు మాత్రమే. మరో కోణం కూడా ఉంది. అతడు ఒంటరిగా ఉండే వితంతువులు, డివోర్స్ అయిన మహిళలని లక్ష్యంగా చేసుకుని వారిని ముగ్గులోకి దించుతుంటాడు. వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇస్తానని ఆశ చూపడంతో ఆ మహిళలు మమ్ముట్టి వైపు ఆకర్షితులు అవుతారు. తనతో కనెక్ట్ అయిన వారిని ఎవరికీ అనుమానంరాని విధంగా హోటల్ రూమ్ కి తీసుకువెళ్లి శారీరకంగా దగ్గరవుతారు.
ఆ తర్వాత ఆ మహిళలకు ఏదో విధంగా విషం, సైనైడ్ అందించి చంపేస్తుంటాడు. ఆ మహిళలు ఎవరితోనో లేచిపోయారు అని కుటుంబ సభ్యులు భావిస్తుంటారు. అందుకే పెద్దగా కేసులు నమోదు కావు. ఇదంతా కేరళ, తమిళనాడు బోర్డర్ లో జరుగుతూ ఉంటుంది. ఈ కేసుని ఛేదించడానికి ఎస్సై జయకృష్ణన్ ( వినాయకన్- జైలర్ మూవీ విలన్) రంగంలోకి దిగుతారు. కేసుని ఎంక్వైరీ చేసే క్రమంలో అతడికి ఎలాంటి క్లూస్ లభించవు. కానీ ఆ తర్వాత ఒంటరి మహిళలని లక్ష్యంగా చేసుకుని సైకో కిల్లర్ ఈ హత్యలు చేస్తున్నాడు అని తెలుస్తుంది. తాను కనిపెట్టిన ఆధారాల ద్వారా జయకృష్ణన్.. స్టాన్లీ దాస్ ని ఎలా అడ్డుకున్నాడు ? అసలు స్టాన్లీ దాస్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు అనేది సినిమా చూసే తెలుసుకోవాలి.
55
మమ్ముట్టి నటన, ఆ సన్నివేశాలు హైలైట్
స్టాన్లీ దాస్ వితంతు మహిళలని, మిడిల్ ఏజ్డ్ విమెన్, డివోర్స్ తీసుకున్న మహిళలు వీరందరినీ ఎందుకు టార్గెట్ చేశాడు. అసలు అతడు సైకోగా మారడానికి కారణమైన అంశాలు ఏంటి అనేది దర్శకుడు చిన్న పాయింట్ తో చూపించారు. అది అంత కన్విన్సింగ్ గా ఉండకపోవచ్చు కానీ.. మమ్ముట్టి వాళ్ళని ట్రాప్ చేసిన విధానం, ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా చంపేసే సన్నివేశాలు ఉత్కంఠని కలిగిస్తాయి. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ తో కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. పోలీసులకు తనపై అనుమానం రాకుండా స్టాన్లీ దాస్ వేసే ఎత్తుగడలు కూడా ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ సీన్స్ మరింత ఆసక్తికరంగా ఉంటాయి. సైకో కిల్లర్ సినిమా అయినప్పటికీ ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు. సో ఫ్యామిలీతో కలిసి ఈ చిత్రాన్ని చూడొచ్చు.