
Nagendran Honeymoons Series: ఇప్పుడు సినిమాల కంటే వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ఫిల్మ్స్ మంచి కంటెంట్‌తో వస్తున్నాయి. ఆకట్టుకుంటున్నాయి. చిన్న పాయింట్ చుట్టూ ఇంట్రెస్టింగ్‌గా కథనాన్ని నడిపిస్తూ ఆద్యంతం ఎంగేజ్ చేస్తున్నారు ఓటీటీ ఫిల్మ్ మేకర్స్.
ఈ విషయంలో తెలుగులో కంటే మలయాళంలోనే మంచి కంటెంట్‌తో కూడిన ఓటీటీ ఫిల్మ్స్, సిరీస్ లు వస్తున్నాయని చెప్పొచ్చు. అందులో భాగంగా ఇప్పుడు `నాగేంద్రన్ హనీమూన్స్` అనే సిరీస్ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. మరి ఇది ఎలా ఉంది? ఇందులో ఆకట్టుకునే అంశం ఏంటనేది చూస్తే.
విదేశాలకు వెళ్లి బాగా కోటీశ్వరుడు కావాలనుకునే ఓ సోమరిపోతు వేసే విచిత్రమైన వేషాల సమాహారమే `నాగేంద్రన్ హనీమూన్స్` సిరీస్. నితిన్ రెంజి పనిక్కర్ దర్శకత్వంలో గతేడాది వచ్చిన సిరీస్ ఇది. సూరజ్ వెంజరమూడు లీడ్‌గా నటించాడు. కని కసృతి, స్వేతా మీనన్, గ్రేస్ ఆంటోనీ, ఆల్ఫీ పంజికరణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
మరి `నాగేంద్రన్ హనీమూన్స్` సిరీస్‌లో అంతగా ఆకట్టుకునేలా ఏముందనేది కథగా చూస్తే, ఇది 1970లో కేరళాలో జరిగే కథ. నాగేంద్రన్ పెద్ద సోమరిపోతు. ఉద్యోగం లేదు. జాబ్ చేయడం చేతకాదు. ఎలాగోలా విదేశాలకు వెళ్లి కోటీశ్వరుడు కావాలని, బాగా లగ్జరీ లైఫ్‌ని అనుభవించాలని ప్లాన్ చేస్తాడు. తల్లి చాలా కష్టపడి ఫ్యామిలీని పోషిస్తుంది.
కానీ నాగేంద్రన్ సొంత తల్లిని కూడా పట్టించుకోడు. విదేశాలకు వెళ్లడానికి డబ్బులు ఎలా అని తర్జన భర్జన పడుతున్న సమయంలోనే సోమన్ అనే స్నేహితుడు ఒక సలహా ఇస్తాడు. పెళ్లి చేసుకుంటే వచ్చే కట్నం డబ్బుతో విదేశాలకు వెళ్లిపోవచ్చు అని చెబుతాడు. దీంతో తమ బంధువుల అమ్మాయి జానకిని పెళ్లి చేసుకుంటాడు నాగేంద్రన్. కానీ అనుకున్నంత కట్నం రాదు. దీంతో డిజప్పాయింట్ అవుతాడు.
అయినా విదేశాలకు వెళ్లాలనే ఆశ మాత్రం చావదు. మళ్లీ ప్రయత్నాలు చేస్తాడు. వరుసగా ఐదు పెళ్లిళ్లు చేసుకుంటాడు. డబ్బుల కోసం ఏకంగా సాని ని కూడా మ్యారేజ్ చేసుకుంటాడు. వీరంతా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ కి చెందిన అమ్మాయిలు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో పెళ్లి అవుతుంది.
సాని ని మ్యారేజ్ చేసుకున్న నేపథ్యంలో ఆమె ఎప్పటిలాగే తన పని కానిస్తుంది. తన ఇంట్లోనే ఆ వృత్తినే కొనసాగిస్తుంది. దీనికి నాగేంద్రన్ కూడా సపోర్ట్ చేస్తాడు. అయితే ఇది కొత్త తలనొప్పులకు దారితీస్తుంది. డబ్బుల కోసం చేసే వింత పనులు ఆయనకు కొత్త సమస్యలను తెచ్చిపెడతాయి.
దీంతో లాక్కోలేక పీక్కోలేక అన్నట్టుగా నాగేంద్రన్ పరిస్థితి మారిపోతుంది. తాను ఒకటి తలిస్తే విధి మరోటి తలచింది అన్నట్టుగా నాగేంద్రన్ ఆశలన్నీ తలక్రిందులవుతాయి. దీంతో రియలైజ్ అవుతాడు. తాను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకుంటాడు.
అన్ని వదులుకుని తన మొదటి భార్యతోనే ఉండాలని నిర్ణయించుకుంటాడు. కానీ తన జీవితంలో మాత్రం ట్విస్ట్ లు చోటు చేసుకుంటూనే ఉంటాయి. చివరికి ఓ క్రేజీ ట్విస్ట్ తో ఈ సిరీస్ ముగుస్తుంది. అదేంటనేది మాత్రం సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
ఆద్యంతం కామెడీ గా ఈ సిరీస్‌ని తెరకెక్కించాడు. సహజమైన కామెడీతో రూపొందించిన తీరు బాగుంది. థ్రిల్లర్ ఎలిమెంట్లు, నాగేంద్రన్ జీవితంలో చోటు చేసుకునే పరిణామాలు, ఆయన వేసే కోతి వేషాలు నవ్వులు పూయిస్తాయి. తన స్నేహితుడు ఇచ్చే పిచ్చి సలహాలతో అతని జీవితం గందరగోళంగా మారుతుంది. దాన్నుంచి బయటపడేందుకు ఆయన చేసే పనులు ఆద్యంతం కామెడీగా ఉంటుంది.
అదే ఈ సిరీస్‌కి హైలైట్‌గా చెప్పొచ్చు. చూసి సరదాగా నవ్వుకోవచ్చు. డైరెక్టర్ బాగా తీశాడు, నటీనటులు చాలా బాగా చేశారు. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో గతేడాది జులై 19న విడుదలైంది. తెలుగు, మలయాళంతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మరాఠి, బెంగాలీ వంటి భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది.
also read: రియాలిటీ షోస్‌లో గొడవలు, అసలు జరిగేది ఇదే.. నిజాలు బయటపెట్టిన యాంకర్ ప్రదీప్