mohan raj death
మలయాళ, తమిళ, తెలుగు చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించిన మోహన్‌రాజ్ (69) కన్నుమూశారు. ఆయన మృతిపట్ల సినీ పరిశ్రమ వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. ‘కిరిక్కాడాన్ జోస్’ పేరుతో మలయాళంలో వందల చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన తిరువనంతపురంలో తుది శ్వాస విడిచారు. నటుడు, దర్శకుడు, పి.దినేశ్ పనికర్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి విచారం వ్యక్తం చేశారు.
malayalam film actor mohan raj keerikkadan jose passed away
మోహన్‌రాజ్‌కు భార్య ఉష, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత నాలుగు రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న మోహన్‌రాజ్‌ను వెంటిలేటర్‌పై ఉంచారు. గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. గత కొంతకాలంగా పార్కిన్సన్స్‌తో బాధపడుతున్న మోహన్‌రాజ్‌కు ఇటీవల గుండె పోటు కూడా వచ్చింది.
చికిత్స నిమిత్తం ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో ఇంటికి తీసుకెళ్లిపోవాల్సిందిగా డాక్టర్లు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను తిరువనంతపురంలోని కంజిరంకులం తీసుకురాగా, అక్కడే కన్నుమూశారు.
mohan raj death
తెలుగు విషయానికి వస్తే..
‘‘అచ్చుతప్పు.. మన పేరు గుడివాడ రాయుడు.. ‘రాయుడు’ అని నోరు తిరగక రౌడీ అంటున్నారు’’ అంటూ ‘లారీ డ్రైవర్’ (Lorry Driver)చెప్పే డైలాగు బాగా ఫేమస్.తెలుగులో వచ్చిన ‘లారీ డ్రైవర్’, ‘స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’, ‘చినరాయుడు’, ‘నిప్పు రవ్వ’, ‘శివయ్య’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘చెన్న కేశవరెడ్డి’, ‘శివమణి’ తదితర చిత్రాల్లో హీరోకి దీటుగా విలన్ గా అలరించారు. తెలుగులో ఆయన నటించిన చివరి చిత్రం ‘శివశంకర్’. మోహన్‌బాబు హీరో గా రూపొందిన చిత్రమిది.
keerikkadan jose
తొలి చిత్రం
1989లో వచ్చిన 'కిరీడమ్' సినిమాతో ఆయన సినీ కెరీర్ మొదలైంది. ఆ సినిమా తరువాత ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళ సినీ చరిత్రలోనే సూపర్ హిట్ గా నిలిచింది.
ఆయన కెరీర్ లో 300కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులోనూ ఆయన అనేక చిత్రాల్లో నటించారు. 90వ దశకంలో వచ్చిన తెలుగు చిత్రాల్లో స్టార్ హీరోల సినిమాల్లో మోహన్ రాజ్ విలన్ పాత్రలు చేశారు. బాలకృష్ణ, మోహన్ బాబు, రాజశేఖర్ వంటి హీరోలకు ఎదురుగా నిలబడే విలన్ గా మెప్పించారు.
keerikkadan jose
కెరీర్ ప్రారంభం రోజుల్లో
‘కిరిక్కాడాన్ జోస్’గా మలయాళంలో మోహన్‌రాజ్ చాలా ఫేమస్. 1989లో సిబి మలయిల్ దర్శకత్వంలో వచ్చిన ‘కిరీదామ్’తో మంచి పేరు తెచ్చుకున్నారు. సిబి మలయిల్ తను తీయబోయే చిత్రానికి 6 అడుగులకు పైగా ఎత్తు, 100 కిలోల భారీ శరీరం కలిగిన కొత్త విలన్ కోసం వెతుకుతుండగా మోహన్‌రాజ్ కనిపించారు.
అప్పటికి ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సినిమాలపై ఆసక్తితో ‘మూన్నం మూర’ చిత్రంలో నటించారు. అది చూసిన సిబి తన విలన్ పాత్రకు మోహన్‌రాజ్‌ను ఎంపిక చేశారు. ఆయన అంచనాలను నిజం చేస్తూ తన నటనతో అలరించారు. ఆ తర్వాత తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు.
రెండేళ్ల కిందట మమ్ముట్టి ప్రధాన పాత్రలో వచ్చిన 'రోర్షాచ్' అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో మోహన్ రాజ్ ఆఖరిగా నటించారు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన అంత్యక్రియలు రేపు తిరువనంతపురంలో నిర్వహించనున్నారు.