మహేష్ బాబు నటించిన `గుంటూరు కారం` సంక్రాంతికి విడుదలైంది. ఈ మూవీ చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయ్యిందని నిర్మాతలు, కాలేదని కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయి. ఆ వివాదం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సందర్భంగా మహేష్ బాబు గత రికార్డులను వెలికి తీస్తున్నారు నెటిజన్లు. మహేష్ బాబుకి ఫ్లాప్‌లను లెక్క గడుతున్నారు.
మహేష్ బాబు బిగ్గెస్ట్ హిట్ మూవీ `శ్రీమంతుడు`. అప్పట్లో అది అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. గన్ షాట్ హిట్ అయ్యింది. ఆ మూవీ ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లని రాబట్టింది. సుమారు 20కోట్లకు పైగా వసూలు చేసింది. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎనిమిది కోట్లు. దీంతో మంచి లాభాలనే తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత మహేష్ బాబుకి ఓవర్సీస్‌లో ఒక్క హిట్ లేదట. ఆ తర్వాత ఆయన్నుంచి `బ్రహ్మోత్సవం`, `స్పైడర్`, `భరత్ అనే నేను`, `మహార్షి`, `సరిలేరు నీకెవ్వరు`, `సర్కారు వారి పాట`, `గుంటూరు కారం` చిత్రాలు వచ్చాయి. `బ్రహ్మోత్సవం` ఓవర్సీస్‌లో ఐదున్నర కోట్లు(13కోట్ల బిజినెస్ అయ్యింది) చేసింది. అన్ని చోట్ల ఇది డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన `స్పైడర్` 12కోట్లు వసూలు చేసి బ్రేక్ ఈవెన్‌కి చేరుకోలేదు. ఈ మూవీ 23కోట్ల ఓవర్సీస్ బిజినెస్ అయ్యింది.
`బ్రహ్మోత్సవం` తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించిన `భరత్ అనే నేను` మూవీ ఓవర్సీస్‌లో 18కోట్ల బిజినెస్ చేసింది. ఈ మూవీ 35కోట్ల కలెక్షన్లని సాధించింది. చిన్నపాటి నష్టాలతో ముగిసింది. ఓ కోటీ వరకు నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక వంశీపైడి పల్లి దర్శకత్వంలో వచ్చిన `మహర్షి` మూవీ ఓవర్సీస్ బిజినెస్ 14కోట్లు. ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లు 21కోట్ల గ్రాస్, పది కోట్ల షేర్ వచ్చింది. నాలుగైదు కోట్లు నష్టాలే వచ్చాయి.
మహేష్ బాబు నటించిన `సరిలేరు నీకెవ్వరు` కూడా ఓవర్సీస్‌లో పెద్ద నష్టాలను తెచ్చింది. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ మూవీ ఇక్కడ హిట్ ఖాతాలో పడింది. కానీ ఓవర్సీస్‌లో మాత్రం దెబ్బకొట్టింది. ఇది ఓవర్సీస్‌లో 17కోట్ల బిజినెస్ అయ్యింది. కానీ కలెక్షన్లు మాత్రం 11కోట్ల గ్రాస్ వచ్చింది. మూడొంతులు నష్టాలు తెచ్చింది. ఇక `సర్కారు వారి పాట`తో ఓవర్సీస్‌లో 15కోట్ల బిజినెస్ అయ్యింది. ఈ మూవీ 14కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సగానికిపైగా నష్టాలు వచ్చాయి.
ఇప్పుడు `గుంటూరు కారం` సినిమా ఓవర్సీస్‌లో 20కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం ప్రస్తుతం ఓవర్సీస్‌లో 30కోట్లు వసూలు చేసింది. అంటే 15కోట్ల షేర్ వచ్చింది. ఇంకా ఐదు కోట్ల నష్టాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ ఇంకా థియేటర్లో ఉంది. కానీ ఓవర్సీస్‌లో మాత్రం దీనికి అంతగా ఆదరణ లభించడం లేదని తెలుస్తుంది. అక్కడ ఇది కూడా నష్టాలనే మిగిల్చేలా ఉంది. ఇలా తొమ్మిదేళ్లుగా మహేష్ బాబుకి ఓవర్సీస్‌లో విజయాలు లేవని చెబుతున్నారు ట్రేడ్ వర్గాలు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన `గుంటూరు కారం`లో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. మీనాక్షి చౌదరి కీలకపాత్రలో మెరిసింది. తండ్రీకొడుకు సెంటిమెంట్, ఎమోషన్స్ కి రాజకీయ రంగు, మాస్ ఎలిమెంట్లని జోడించి ఈ మూవీని రూపొందించారు త్రివిక్రమ్. సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో మిశ్రమ స్పందన రాబట్టుకుంది. విపరీతమైన నెగటివ్ టాక్ కలెక్షన్లపై ప్రభావాన్ని చూపించిందని తెలుస్తుంది.