
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన `లెనిన్` మూవీ త్వరలో రాబోతుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ మురళీ కిశోర్ రూపొందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు మార్లు వాయిదా పడింది. `పెద్ది` కోసమే రెండు సార్లు వాయిదా పడటం విశేషం. ఇప్పుడు ఎట్టకేలకు `లెనిన్` మూవీని విడుదల చేయబోతున్నారు. జులై 10న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు.
ఈ క్రమంలో `లెనిన్` సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. మంగళవారం సాయంత్రం ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. అఖిల్ నటించిన గత చిత్రాలను మించిన కంటెంట్‌తో ఈ సారి రాబోతున్నారని ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. చిత్తూరు జిల్లా శ్రీరామాపురంలో ఈ మూవీ కథ నడుస్తుంది. ఆ ఊరికి పెద్ద ఒకరు ఉంటారు. ఆయన్ని ధర్మరాజుగా పిలుస్తుంటారు. ఆ ధర్మరాజు చెప్పిందే అంతా ఫాలో అవుతుంటారు. వసుదేవ్ అని ఊర్లో మరో పలుకుబడి ఉన్న వ్యక్తి ఉంటాడు. అతనికి సపోర్ట్ గా హీరో అఖిల్ ఉంటాడు. ఆయనకోసం తన ప్రాణాలైనా అడ్డు పెడతాడు.
శ్రీరామపురంలో 18రోజులపాటు ద్రౌపదమ్మని ఎంతో భక్తితో, బాధ్యతగా కొలుస్తారు. ఆ సమయంలో ఆ నేలపై రక్తం చిందకూడదనే నిబంధన ఉంది. అలాంటి నేలపై రక్తం చిందే పరిస్థితులు వస్తాయి. ధర్మరాజు చేసిన అఘాయిత్యాలు హద్దులు దాటుతాయి. అప్పటి వరకు పద్ధతిగా ఉన్న మనుషులు క్రమంగా రంగులు మారుస్తుంటారు. ఎవరి రూపం ఏంటో నెమ్మదిగా తెలిసిసొస్తుంది. ఆ పండగ సమయంలోనే అఖిల్‌కి భారతి(భాగ్యశ్రీ) పరిచయం అవుతుంది. అక్కడే ప్రేమ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రేమ చాలా దూరం వెళ్తుంది. అయితే ఊర్లో ఆదిపత్యం చాటున కుట్రలు, కుతంత్రాలు జరుగుతుంటాయి. వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు, తన స్నేహం కోసం ఏం చేశాడు? ప్రేమ కోసం ఎలా పోరాడాడు? ఆ ఊర్లో ఆయన తెచ్చిన మార్పేంటి అనే కథాంశంతో సినిమా సాగుతుందని ట్రైలర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది.
ఆ ఊరుని పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమైంది. ఇదొక మహాభారతంగా ట్రైలర్ వాయిస్‌ఓవర్ లో నాగార్జున తెలిపారు. ఆ ఊర్లో జరిగే పండగ, అక్కడి ఊరు జనాలు, అధికారం కోసం జరుగుతున్న కుట్రలను ఇందులో స్పష్టంగా చూపించారు. అదే సమయంలో పండగ సమయంలోనే హీరోహీరోయిన్ల మధ్య ప్రేమని ఆవిష్కరించారు. మరోవైపు తన స్నేహితుడి కోసం హీరో నిలబడటం, ఆ స్నేహితుడు ధర్మరాజుకి వ్యతిరేకంగా పోరాడటం వంటి సన్నివేశాలను చూపించారు. ఆ ఊర్లో నెత్తురు పారించేందుకు ధర్మరాజు ప్లాన్ వేస్తాడు, దాన్ని హీరో ఎదుర్కోవడం, ఈ క్రమంలో భారతితోపాటు స్నేహితుడి ప్రాణాల మీదకు రావడం, దీంతో వారికోసం హీరో విజృంభించడం వంటి సీన్లని ఆవిష్కరించిన తీరు బాగుంది. కురుక్షేత్రాన్ని తలపించేలా ఆయా సీన్లు ఉన్నాయి.
ట్రైలర్ చివర్లో.. `కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలని, ఏంది అట్నే సేద్దామా?` అని అఖిల్ చెప్పే డైలాగ్‌లు అదిరిపోయాయి. మొత్తంగా ట్రైలర్ మాత్రం సాలిడ్‌గా ఉంది. చివర్లో అఖిల్ చేసే యాక్షన్ అదిరిపోయింది. నటుడిగానూ ఆయనలో చాలా బెటర్‌మెంట్ కనిపిస్తుంది. చివర్లో ఆయన ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. మంచి కంటెంట్‌తో ఈసారి ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడని అర్థమవుతుంది. అదే సమయంలో ఈ సారి హిట్ పక్కా అనే సాంకేతాలను కూడా `లెనిన్` ట్రైలర్ ఇస్తుందని చెప్పొచ్చు. మరి మూవీ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇందులో శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరీ రావు వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు.