
తెలుగు చిత్ర పరిశ్రమకి దక్కిన అద్భుతమైన నటనా ఆణిముత్యం కోట శ్రీనివాసరావు. విలన్‌గా పాపులర్ అయిన ఆయన విలక్షణ నటుడిగానూ ఆకట్టుకున్నారు.
విలన్ పాత్రలే కాదు, పాజిటివ్ రోల్స్ కూడా చేశారు. కామెడీ పాత్రలతోనూ నవ్వించారు. కామెడీ విలన్ గానూ అలరించారు.
అదే సమయంలో తండ్రిగా ఎమోషనల్ రోల్స్ లోనూ నటించి కన్నీళ్లు పెట్టించారు. మరి కోట శ్రీనివాసరావు నట విశ్వరూపం చూపించిన టాప్ 10 సినిమాలేంటో చూద్దాం.
కోట శ్రీనివాసరావుకి నటుడిగా అయినా, విలన్‌గా అయిన బ్రేక్ ఇచ్చిన మూవీ `ప్రతిఘటన`(1985). విజయశాంతి, చంద్రమోహన్ నటించిన ఈ చిత్రంలో చరణ్ రాజ్‌తోపాటు విలన్‌గా నటించారు కోట.
మంత్రి కాశయ్యగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకున్నారు. అవినీతి మంత్రిగా, క్రూరమైన విలన్‌గా మెప్పించారు. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత కోట వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
కోటని నటుడిగా మరో మెట్టు ఎక్కించిన చిత్రం రాజేంద్రప్రసాద్ నటించిన `అహ నా పెళ్లంట`(1987). జంధ్యాల రూపొందించిన ఈ చిత్రంలో పిసినారి లక్ష్మీపతిగా రెచ్చిపోయారు.
ఖర్చు తగ్గుతుందని బట్టలకు బదులు న్యూస్ పేపర్ చూట్టుకోవడం విశేషం. అంతేకాదు కోడిని చూరుకు వేలాడ దీసి దాన్ని చూస్తూ కోడికూర తింటున్నట్టు అనుభూతి పొందే సీన్లలో నవ్వులు ఆగవు.
ఇది ఆయన నటనకు పరాకాష్టగా నిలిచింది. ఇందులో బ్రహ్మనందంతో కలిసి ఆయన రచ్చ చేశాడు. రాజేంద్రప్రసాద్‌కే చుక్కలు చూపించాడు. నటుడుగా వాహ్ అనిపించారు.
విలన్ నుంచి కామెడీ పాత్రలకు టర్న్ తీసుకున్న కోటలోని అసలైన విలనిజం చూపించిన మూవీ `గణేష్`(1998). వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ మూవీకి తిరుపతి సామి దర్శకత్వం వహించారు. సురేష్ బాబు నిర్మించారు.
ఇందులో ఆరోగ్యశాఖ మంత్రి సాంబ శివుడు పాత్రలో కోట కనిపించారు. ప్రజల రక్తం తాగే హెల్త్ మినిస్టర్‌గా క్రూరత్వాన్ని చూపించిన తీరు వాహ్ అనిపిస్తుంది. అసహ్యించుకునేలా చేస్తుంది.
హీరో ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్, కిడ్నీ మాఫియాని నడిపించే సీన్లు, గుండుతో కనిపించి భయపెట్టించే సీన్లు ఆకట్టుకుంటాయి. క్రూరమైన విలన్‌గా అదరగొట్టారు కోట. ఇది ఆయన నటన విశ్వరూపానికి ప్రతిబింబం అని చెప్పొచ్చు.
మరోవైపు జగపతిబాబు హీరోగా వచ్చిన `గాయం` సినిమాలో గురు నారాయణ్ పాత్రలో సందడి చేశారు. ఆర్జీవీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మరోసారి తెలంగాణ యాసలో రెచ్చిపోయారు.
డైలాగ్ డెలివరీ, ఆయన ఎక్స్ ప్రెషన్స్ ఆడియెన్స్ ని కట్టిపడేస్తాయి. ఇందులో జరల్నిస్ట్ గా నటించిన రేవతి అడిగే ప్రశ్నలకు కోట ఇచ్చే సమాధానాలు క్రేజీగా ఉంటాయి.
ఈ మూవీ కూడా తన కెరీర్‌లో బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. నటుడిగా తాను ఎంతటి విలక్షణ నటుడో ఆవిష్కరించే మూవీ అవుతుంది.
ఆర్జీవీ రూపొందించిన మరో మూవీ `మనీ`. ఇందులో భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్, భర్తగా మారకు బ్యాచిలరు` అనే పాటలో పెళ్లి వద్దని చెబుతూ అల్లాదీన్‌గా కోట నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఇందులో వచ్చీ రానీ ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ నవ్వులు పూయించారు. `మనీ మనీ` చిత్రంలోనూ అదే స్థాయిలో మెప్పించారు కోట. పురాణాలపై, నీతి నిజాయితీపై ఆయన చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి.
కోటశ్రీనివాస రావు, బాబూ మోహన్‌ల కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోహీరోయిన్ల మధ్య అంత కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో లేదో, గానీ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ది బెస్ట్ అనిపించుకుంది.
ఈ ఇద్దరు వెండితెరపై కనిపిస్తే నవ్వులే నవ్వులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. `మామగారు` సినిమాలో ఈ జోడీకి మంచి పేరొచ్చింది.
ఈ సినిమా విజయంలో వీరి కాంబినేషనే హైలైట్. బాంబ్ పెట్టే సీన్ కి నవ్వు ఆపుకోవడం ఎవరి తరం కాదు. వీరి కాంబినేషన్‌లో యాభైకి పైగా సినిమాలు వచ్చాయి.
నాగార్జున హీరోగా వచ్చిన `హలో బ్రదర్` చిత్రంలో తాడి మట్టయ్య పాత్రలో ఆద్యంతం అలరించారు. ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు నవ్వులు పూయించాయి.
ప్రారంభంలో నవ్వులు పూయించిన ఆయన చివర్లో మల్లికార్జున రావు పాత్ర మరణించినప్పుడు కన్నీళ్లు పెట్టించారు.
నవ్వించడం, భయపెట్టడమే కాదు, కన్నీళ్లు పెట్టించడం కూడా తనకు తెలుసు అని నిరూపించారు. ఎమోషనల్ సీన్లలోనూ రెచ్చిపోయారు.
కోట కామెడీ పరంగా మరింతగా నవ్వులు పూయించిన మరో సినిమా `ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు`గా చెప్పొచ్చు. వారసుడు కావాలని కోరుకునే తండ్రిగా ఆకట్టుకున్నారు. మనవడు వచ్చాక ఆయన చేసే అల్లరి ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
చాలా సినిమాల్లో ఇలా తండ్రిగా, తాతగా నటించి ఆకట్టుకున్నారు. వాటిలో `పెళ్లైన కొత్తలో`, `రాఖీ`, `బృందావనం` చిత్రాలు ప్రధానంగా చెప్పొచ్చు.
కోట నవ్వించడమే, కాదు ఏడిపించగలను అనిపించిన చిత్రం `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`. ఇందులో వెంకటేష్‌కి తండ్రిగా నటించాడు కోట. ఈ రేంజ్‌లో ఆయన నటన చూడటం కష్టమే.
బాధలు ఉన్న తండ్రిగా, కొడుకు విషయంలో బాధపడే తండ్రిగా ఆద్యంతం మెప్పించారు. సెటిల్డ్ నటనతో కట్టిపడేశాడు. ఇందులోని ఒక డైలాగ్‌తో గుండె బరువెక్కించాడు.
`ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్దు పెట్టేవాడు కొడుకు, చచ్చేదాక ఇలా గుండెల మీద తన్నేవాడు కొడుకు కాదు` అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌కి కన్నీళ్లు ఆగవు.
అంతేకాదు చివర్లో ఆయన మరణించినప్పుడు కూడా కన్నీళ్లు ఆగవు. దీంతోపాటు `బొమ్మరిల్లు`లో హీరోయిన్ జెనీలియాకి తండ్రిగా ఎమోషనల్ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.
పవన్ కళ్యాణ్ `గబ్బర్ సింగ్`లో హీరోయిన్‌కి తండ్రిగా కనిపించారు. ఇందులో మందుబాబులం అంటూ పాటపాడుతూ ఆద్యంతం ఆకట్టుకున్నారు. తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు.
తాగుబోతు తండ్రిగా రెచ్చిపోయాడు. అంతేకాదు ఇందులో తనలోని మరో టాలెంట్‌ని చూపించారు. `మందు బాబులం` పాటని ఆయనే స్వయంగా పాడటం విశేషం.
ఇలా కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడిగా మెప్పించారు. విలక్షణ నటుడే కాదు, ఒక సంపూర్ణమైన యాక్టర్ అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు.