`కాంత` మూవీ రివ్యూ, రేటింగ్‌.. దుల్కర్‌ సల్మాన్‌ హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడా?

Published : Nov 14, 2025, 01:15 AM IST

దుల్కర్‌ సల్మాన్‌, రానా, భాగ్య శ్రీ బోర్సే నటించిన `కాంత` నేడు విడుదలైంది. మరి ఈ చిత్రం మన తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? దుల్కర్‌ హ్యాట్రిక్‌ కొట్టాడా అనేది రివ్యూ(Kaantha Movie Review)లో చూద్దాం. 

PREV
16
`కాంత` మూవీ రివ్యూ

దుల్కర్‌ సల్మాన్‌ ఇప్పటికే `మహానటి`, `సీతా రామం`, `లక్కీ భాస్కర్‌` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాడు. వారికి దగ్గరయ్యాడు. ఇంకా చెప్పాలంటే తెలుగు హీరో అయిపోయాడు. ప్రస్తుతం ఆయన `కాంత` అనే చిత్రంలో నటించాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రానా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(నవంబర్‌ 14న) తమిళంతోపాటు తెలుగులో విడుదలైంది. గురువారం రాత్రి ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది, తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? అనేది రివ్యూ(Kaantha Movie Review)లో తెలుసుకుందాం.

26
`కాంత` మూవీ కథ ఏంటంటే?

టీకే మహదేవన్‌(దుల్కర్‌ సల్మాన్‌) నట చక్రవర్తిగా కీర్తించబడుతుంటాడు. ఆయనంటే దర్శకుడు అయ్యా(సముద్రఖని)కి పడదు. ఎందుకంటే మహదేవన్‌ని చేరదీసి పెద్ద నటుడిగా చేసింది అయ్యానే. కానీ తాను చెప్పిన మాట వినకుండా వెళ్లిపోయాడనే కోపం దర్శకుడిలో ఉంది. ఓవర్ యాక్టింగ్‌ చేస్తుంటాడని, పచ్చి మోసగాడు అని అయ్యా భావిస్తుంటాడు. అయితే స్టూడియో హోనర్‌ మార్టిన్‌(విజయ్‌ రవీంద్రన్‌) ఒత్తిడి మేరకు ఆగిపోయిన `శాంత` సినిమాని మళ్లీ తీసేందుకు ఒప్పుకుంటాడు. ఇందులో హీరోయిన్‌ కుమారి(భాగ్యశ్రీ బోర్సే). ఆమె కూడా అనాథ. అయ్యానే చేరదీసి హీరోయిన్‌ని చేశాడు. ఆమెకిది తొలి చిత్రం. మీరు చెప్పినట్టే చేస్తానని, మాట దాటనని దర్శకుడికి మాట ఇస్తుంది. ఇక సినిమా ప్రారంభమవుతుంది. కానీ మొదటి రోజు నుంచే హీరో, దర్శకుడు మాట్లాడుకోరు. తనకు నచ్చినట్టే సినిమా చేస్తానని హీరో చెబుతాడు. సినిమా పేరుని `శాంత`ని కాస్త `కాంత`గా మారుస్తాడు. అలాగే క్లైమాక్స్ కూడా మార్చేయాలంటాడు. కానీ దర్శకుడు ఒప్పుకోడు. దర్శకుడు హీరోయిన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో కథ చెప్పాలనుకున్నాడు. కానీ హీరో తన పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో చెప్పాలని, తనపై కెమెరా పెట్టాలని, అభిమానులు తనని చూస్తారని, అప్పుడే సినిమా ఆడుతుందని, లేకపోతే ఆడదని చెబుతాడు. అటు హీరోకి, దర్శకుడికి మధ్య సంఘర్షణతోనే సినిమా సాగుతుంది. వీరిద్దరి మధ్య అసిస్టెంట్లు బలవుతుంటారు. 

అదే సమయంలో హీరోయిన్ కుమారి నలిగిపోతుంటుంది. కుమారి నెమ్మదిగా మహదేవన్‌కి పడిపోతుంది. అప్పటికే మహదేవన్‌కి పెళ్లి అవుతుంది. కానీ తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తుంది కుమారి. అప్పటికే ఆమె గర్భం కూడా ధరిస్తుంది. ఆమె ఒత్తిడి మేరకు పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటాడు. కానీ తెల్లారే సరికి కుమారి శవమై ఉంటుంది. మరి ఆమెని చంపింది ఎవరు? దర్శకుడు ఆమె రూమ్‌లోనే ఎందుకు ఉన్నాడు? అర్థరాత్రి ఆమె గదికి వచ్చింది ఎవరు? ఇందులో స్టూడియో అధినేత మార్టిన్‌కి, హీరో మామకి, భార్యకి, దర్శకుడు అయ్యాకి, కారు డ్రైవర్‌కి, హీరోయిన్‌ సహయకురాలికి ఉన్న సంబంధం ఏంటి? ఈ కేసుని ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ ఫోనిక్స్(రానా దగ్గుబాటి) ఎలా డీల్‌ చేశాడు? చివరికి ఏం జరిగిందనేది (Kaantha Movie Review) మిగిలిన కథ.

36
`కాంత` మూవీ విశ్లేషణ

1950 మద్రాస్ లోని సినిమా బ్యాక్ డ్రాప్ లో మూవీ సాగింది. అప్పటి దిగ్గజ దర్శకులు, హీరోలు, హీరోయిన్ల జర్నీని ఆధారంగా చేసుకుని కొంత కల్పిత కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఒకప్పుడు సినిమా అంటే మద్రాస్ అనే చెప్పేవారు. మన సినిమాలు కూడా అక్కడే చిత్రీకరణ జరుపుకునేవి. దీంతో సినిమా కల్చర్ కి చెన్నై కేరాఫ్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో అలాంటి కథతోనే ఈ మూవీని రూపొందించారు దర్శకుడు సెల్వరాజ్ సెల్వమణి. టెక్నీకల్గా సినిమాని అదిరిపోయేలా రూపొందించారు. మ్యూజిక్, కలర్ టోన్, కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్, ఇలా ప్రతిదీ అదిరిపోయేలా ఉంది. సంగీతంతోపాటు బీజీఎం కూడా అప్పటి సినిమాని తలపించేలా ఉంది. ఆడియెన్స్ ని అప్పటి రోజుల్లోకి తీసుకెళ్లడంలో టీమ్ సక్సెస్ అయ్యారు. అయితే సినిమాని ఆడియెన్స్ కి ఆకట్టుకొనేలా రూపొందించడంలో మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఇది సినిమా బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ప్రారంభం నుంచి స్క్రిప్ట్, టేక్ లు, కట్, మేకప్, సీన్ల చుట్టూ తిరుగుతుంది. ఈ సీన్ లో ఎలా నటించాలి, ఎంత వరకు నటించాలి? కెమెరా ఎక్కడ పెట్టాలి? ఎవరిపై షాట్స్ తీయాలనేదాని చుట్టూతే ఫస్టాఫ్ అంతా తిరుగుతుంది. 

అదే సమయంలో హీరో, దర్శకుడు మధ్య ఈగో క్లాష్, దర్శకుడు తగ్గకపోవడం, హీరో తగ్గకపోవడం మధ్యలో అసిస్టెంట్లు, యూనిట్ ఇబ్బంది పడటం కళ్లకి కట్టినట్టు చూపించారు. ఈ ఇద్దరి మధ్య హీరోయిన్ నలిగిపోయిన తీరుని బాగా ఆవిష్కరించారు. హీరోని దర్శకుడు తక్కువ చేసి మాట్లాడగా, అతను యాక్టింగ్ వాహ్ అనిపించడం విశేషం. ఇలా ఫస్టాఫ్ అంతా ఈగో క్లాషెస్, హీరోయిన్ తో హీరో లవ్ ట్రాక్, వారి మధ్య సంధి చేసే ప్రయత్నం ఆమె చేయడంతో సాగుతుంది. కానీ ఇంటర్వెల్ షాకింగ్ ట్విస్ట్ హీరోయిన్ చనిపోవడంతో కథ మరో టర్న్ తీసుకుంటుంది. సెకండాఫ్ మొత్తం మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా సాగుతుంది. రానా ఇన్విస్టిగేట్ చేయడం, ఇందులో పలు ట్విస్ట్ లు, టర్న్ లు, కొత్తకోణాలు బయటపడుతాయి. చివరికి వరకు సస్పెన్స్ తో సాగి, చివర్లో మర్డర్ మిస్టరీని రివీల్ చేసిన తీరు, దాన్ని ఎమోషనల్ గా మలిచిన తీరు బాగుంది.

46
`కాంత` మూవీలో హైలైట్స్, మైనస్‌ లు

సినిమా చాలా వరకు ఆర్ట్ ఫామ్ లో నడుస్తుంది. ఓ కొత్త అనుభవాన్ని ఇస్తుంది. పొయెటిక్ ఫీల్ ని ఇస్తుంది. డ్రామా కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. లవ్‌ ట్రాక్‌, ఈగో క్లాషెస్‌, దర్శకుడిపై కోపంతో హీరో నటించే సీన్లు అబ్బురపరుస్తాయి. సెకండాఫ్‌లో ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో రానా పాత్ర చేసే కామెడీ కూడా నవ్విస్తుంది. ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. థ్రిల్లర్‌ అంశాలు ఎంగేజ్‌ చేస్తాయి. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. అందులో దుల్కర్‌ నటన వాహ్‌ అనేలా ఉంటుంది. 

అయితే సినిమా చాలా వరకు స్లోగా సాగుతుంది. ఎంతసేపు అక్కడక్కడే కథ తిరుగుతుంది. ఎంతకు ముందుగా సాగదు. హీరో గురించి దర్శకుడు పదే పదే మోసం చేశాడని అంటుంటారు. ఆ మోసాన్ని బలంగా చూపించలేదు. లవ్‌ ట్రాక్‌ని కూడా సరిగ్గా ఆవిష్కరించలేదు. ఈ లవ్‌ స్టోరీ చూస్తుంటే, `మహానటి` గుర్తుకొస్తుంది.  ఈ మూవీలో ఎమోషన్స్ చాలా ముఖ్యం. ఆ ఎమోషన్స్ కనెక్టివిటీ మిస్‌ అయ్యింది. ఫస్టాఫ్‌ ఒకలా సాగితే, సెకండాఫ్‌ మరోలా మారిపోయింది. క్లైమాక్స్ మళ్లీ సరైన ట్రాక్‌లోకి వచ్చినట్టు ఉంటుంది. ఎమోషన్స్ అక్కడ మాత్రమే వర్కౌట్‌ అయ్యాయి. మిగిలిన సన్నివేశాల్లో ఆ స్థాయిలో పండలేదు. దీంతో చాలా బలమైన సీన్లు కూడా తేలిపోయాయి. డ్రామా కూడా ఆశించిన స్థాయిలో పండలేదు. సినిమాలో అసలైన కాంన్ఫిక్ట్ ని బలంగా ఎస్లాబ్లిష్‌ చేయాల్సింది. సస్పెన్స్ లోనూ లాజిక్ మిస్‌ అయ్యారు. సినిమా కథ ఎంతసేపు అక్కడే తిరగడంతో బోరింగ్‌ గా, సాగదీసినట్టు అనిపిస్తుంది.  కాకపోతే క్లైమాక్స్ మూవీని నిలబెట్టిందని చెప్పొచ్చు.

56
కాంత మూవీ నటీనటుల ప్రదర్శన

కాంత చిత్రంలో టీకే మహదేవన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ అదరగొట్టాడు. అద్భుతంగా నటించాడు. ది బెస్ట్ పర్‌ఫెర్మెన్స్ అని చెప్పొచ్చు. మహానటి, లక్కీ భాస్కర్‌లోనూ ఇరగదీశాడు. కాకపోతే ఇందులో ఆయన పాత్రలో ఒక ఆర్ట్ ఉంది. అందుకే ఇది హైలైట్‌ అవుతుంది. అవార్డు రేంజ్‌ పర్‌ఫెర్మెన్స్ అని చెప్పొచ్చు. అలాగే రానా దగ్గుబాటి తన పాత్రలో రెచ్చిపోయాడు. సీరియస్‌గా సాగే సినిమా కామెడీగా మార్చాడు. తన స్టయిల్‌లో ఆయన అదరగొట్టాడు. సముద్రఖని ఎక్కడా మనకు కనిపించడు, దర్శకుడిగానే కనిపిస్తాడు. పాత్రలో జీవించాడు. ప్రాణం పోశాడు. ఇక కుమారిగా భాగ్యశ్రీ బోర్సే నటన  సర్‌ప్రైజ్‌ అని చెప్పాలి. ఆమెని గ్లామర్ డాల్ గానే చూశారు. కానీ ఇందులో చించేసింది. మిగిలిన ఆర్టిస్ట్ లు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

66
కాంత మూవీ టెక్నీషియన్ల పనితీరు

సినిమాలో జాను చాంతర్‌ సంగీతం బాగుంది. వినసొంపుగా ఉంది. జేక్స్ బిజోయ్‌ బీజీఎం అదిరిపోయింది. చాలా సన్నివేశాలను ఎలివేట్‌ చేసింది. కానీ ఇటీవల వచ్చిన యాక్షన్‌ చిత్రాలను తలపించింది. డానీ సంచేజ్‌, లోపేజ్‌ కెమెరా వర్క్ చాలా బాగుంది. అప్పటి రోజుల్లోకి తీసుకెళ్లారు. ఆర్ట్ వర్క్ కూడా అదిరిపోయింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. ఇక దర్శకుడు సెల్వరాజ్‌ సెల్వమణి ఎంచుకున్న కథ, డ్రామా చాలా బాగుంది. ఆ డ్రామాని అంతే హృద్యంగా తెరకెక్కించాలని ప్రయత్నించారు. అందులో కొంత వరకు సక్సెస్‌ అయ్యారు.  ఈ మూవీ మన తెలుగు ఆడియెన్స్ కి డ్రైగా అనిపిస్తుంది. మనకు తెలియని సబ్జెక్ట్ కావడమే మైనస్‌గా చెప్పొచ్చు. కాకపోతే కథలో డెప్త్, టేకింగ్‌లో డెప్త్, రూపొందించిన తీరు, ఆర్టిస్ట్ ల నుంచి బెస్ట్ పర్‌ఫెర్మెన్స్ రాబట్టిన తీరు మాత్రం సూపర్‌. సినిమా కోసం పడ్డ కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. ఆ విషయంలో దర్శకుడితోపాటు టీమ్‌ అందరిని అభినందించాల్సిందే. టెక్నీకల్‌గా సాలిడ్‌గా ఉండే మూవీ ఇది. 

ఫైనల్‌గా: `కాంత` కమర్షియల్‌ కోణంలో కాకుండా ఆర్ట్ ఫామ్‌ యాంగిల్‌లో చూస్తే ఆకట్టుకునే మూవీ అవుతుంది. తెరవెనుక విషయాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ సినిమాని ఆర్టిస్ట్ ల పర్‌ఫెర్మెన్స్ కోసం చూడొచ్చు.

రేటింగ్‌ః 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories