
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరి హర వీరమల్లు` మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. క్రిష్ దర్శకత్వంలో స్టార్ట్ అయిన ఈ మూవీ జ్యోతికృష్ణ సారథ్యంలో ముగిసింది. కొంత భాగం తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ అయ్యేలా తన దర్శకత్వ ప్రతిభని చాటడం విశేషం. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు దర్శకుడు. వీరమల్లు జర్నీ రాముడి జర్నీతో ముడిపెట్టడం విశేషం.
ఆ కథేంటో తెలుసుకుందాం. మొఘల్ చక్రవర్తులు హిందూ కల్చర్‌ని నాశనం చేసిన చారిత్రక కథాంశంతో రూపొందిన ఈ సినిమా గురించి జ్యోతికృష్ణ మాట్లాడుతూ,
వేద గ్రంథాలను నాశనం చేసినప్పుడు ‘హరి హర వీరమల్లు(పవన్ కళ్యాణ్) బలంగా నిలబడ్డాడు. మొఘల్ చక్రవర్తుల ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు.
వేదాలలోని జ్ఞానాన్ని అంతా సంపాదించుకుని తనే ఒక వేద పండితుడిగా మారటంతో వాటిని నాశనం చేయటానికి వీలుకాకుండా ఉండిపోయింది.
వీరమల్లు చిన్నప్పటి నుంచి గుడిలో పెరిగాడు. అందువల్ల వేద జ్ఞానాన్ని సంపాదించుకుని శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగాడు` అని అన్నారు.
ఇంకా జ్యోతికృష్ణ మాట్లాడుతూ, వీరమల్లు తన వేద జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని వాస్తుశాస్త్రంతో భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం వంటి పంచభూతాలను అవగతం చేసుకుని ధర్మసంబంధమైన జీవన విధానాన్ని నిర్మించటంలో తన వంతు పాత్రను పోషించాడు.
అతని దూరదృష్టి, నైపుణ్యం మరెవరితోనూ పోల్చలేవివి. అందుకు చాలా ఉదాహరణలు సినిమాలో అంతర్భాగంగా మనకు కనిపిస్తాయి.
గుల్ఫమ్ ఖాన్ (కబీర్ దుహాన్ సింగ్)ను కొండపై జరిగే ప్రమాదం నుంచి కాపాడుతాడు, అలాగే యాగం చేస్తుంటే దాన్ని అడ్డుకోవాలని చూసే వారి నుంచి యాగానికి ఏమీ కాకుండా రక్షించి వరుణ దేవుడు కరుణించేలా చేసి వర్షం కురిసేలా చేస్తాడు.
అలాగే రాత్రి సమయంలో తోడేళ్లు దాడి చేయటానికి వచ్చినప్పుడు వాటితో మానసికమైన సంభాషణ చేసి ఎవరికీ ఏమీ కాకుండా చూస్తాడు. ఇవన్నీ వీరమల్లుకి వేద తత్వాల నుంచి వచ్చిన ప్రేరణ అని అర్థమవుతుంది.
అయోధ్య నుంచి లంకకు రాముడు ప్రయాణం సాగించినప్పుడు ఆయన మహా ప్రయాణం అనేక ప్రాంతాల ద్వారా సాగింది. అందుచేత రామాయణ కథ ఈ ప్రాంతాలతో విడదీయలేని సంబంధాన్ని కలిగి ఉంటుంది.
శ్రీరాముడి ప్రయాణంలో చిత్రకూట, పంచవటి (భద్రాచలం), క్రౌంచ అరణ్యం, మతంగ ఆశ్రమం, ఋశ్యమూక పర్వతం వంటి ప్రసిద్ధ ప్రాంతాలపై ఆయన అడుగులు పడ్డాయి.
అవన్నీ ఆధ్యాత్మిక ప్రాంతాలుగా, మరచిపోలేని మైలురాళ్లుగా వందల ఏళ్లు గడిచిన ఇప్పటికీ ప్రజల నుంచి పూజలను అందుకుంటున్నాయి.
అలాగే హరి హర వీరమల్లు కూడా సినిమాలో తన ప్రయాణాన్ని గోల్కొండ నుంచి ఢిల్లీ వరకు సాగించారు. దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతం వరకు సాగిన ఈ ప్రయాణంలో కథానాయకుడు వేద తత్వాలతో ప్రజలకు మంచి పనులను చేయటానికి గమనించవచ్చు.
ఇతిహాసాన్ని, చరిత్రను మిళితం చేసి వీరమల్లు అనే పాత్ర సనాతనధర్మాన్ని ఎలా పరిరక్షించాడనే విషయాన్ని చెప్పాం.
ఇక సినిమా చివరలో వీరమల్లు, ఔరంగజేబు పాత్రలు కలుసుకోవటం అనేది అసాధారణంగా జరుగుతుంది. ప్రకృతి సృష్టించిన విపత్తులో ఇద్దరూ కలుసుకుంటారు.
ఇదే ఉత్కంఠభరితమైన తుది పోరుకు వేదిక అనాలి. అందుకనే క్లైమాక్స్‌ను ఓ క్లిప్ హ్యాంగర్‌లా తెరకెక్కించాం. ఇది రాబోయే భాగానికి కొనసాగింపు ఉంటుందనే అర్థానిస్తుంది` అని వెల్లడించారు దర్శకుడు జ్యోతికృష్ణ.