ఎన్నికల అనంతరం జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. గత రెండు మూడేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలు మరింత చిచ్చు రాజేశాయనే వాదన ఉంది. మేనత్త భువనేశ్వరిని అసెంబ్లీ వేదికగా వైసీపీ నేతలు అవమానించారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. భువనేశ్వరి ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అది సరిపోదని టీడీపీ శ్రేణులు విమర్శలు చేశాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ పెదవి విప్పకపోవడంతో టీడీపీ కార్యకర్తలు మరింతగా విమర్శలు గుప్పించారు. తన తాత ఎన్టీఆర్ పేరును జూనియర్ వదిలేయాలంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ సానుభూతిపరులు రెండు వర్గాలుగా విడిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ని ద్వేషిస్తే ఊరుకునేది లేదని ఆయన ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకను, బాలకృష్ణ స్వర్ణోత్సవ సంబరాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బాబాయ్-అబ్బాయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఇద్దరికీ సఖ్యత లేదనే వాదన బలపడింది.