
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్. మళ్లీ ఇన్నేళ్లకు భారతీయుడు సినిమాకు సీక్వెల్ రెడీ చేశారు ఈ ఇద్దరు. అయితే తొలి చిత్రం ఉన్నంత గొప్పగా ఉంటుందో లేదో కానీ ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ ఆల్రెడీ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న నేపధ్యంలో అప్పట్లో వచ్చిన భారతీయుడు గురించి జనం మాట్లాడుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మొదటి పార్ట్ కు సంభందించిన కొన్ని అరుదైన , ఆశ్చర్యపరిచే విశేషాలు మీకు అందిస్తున్నాము.
కోర్ ఐడియా
దర్శకుడు శంకర్ కు అప్పటికే సమాజాకి నేపధ్యం ఉన్న కథలను కమర్షియల్ గా ప్రెజెంట్ చేసి హిట్ కొడతారనే పేరు వచ్చేసింది. రొటీన్ కాకుండా మరో సామాజిక అంశం కోసం వెతుకుతున్నప్పుడు లంచం ఆయనకు గుర్తు వచ్చింది. అన్ని దేశాల్లోనూ మరీ ముఖ్యంగా మన దేశంలోనూ నిత్యం చాలా మంది లంచంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయం లంచం లేనిదే పనిచేయని పరిస్దితి కనపడింది. ఈ విషయంపై సినిమా చేయాలని తన అశోశియేట్స్ తో మాట్లాడారు.
రివర్స్ ఎప్రోచ్
దర్శకుడు శంకర్ స్వయంగా ఈ లంచంతో కాలేజ్ రోజుల్లో ఇబ్బంది పడ్డారు. కొన్ని సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫీస్ కు వెళ్తే అక్కడ లంచం అడిగారు. ఈ సినిమా తీసేనాటికి 50/100 రూపాయలు లంచం కూడా పెద్ద మొత్తమే. కాబట్టి ఇలాంటి సమస్యను చూపించాలి. అయితే అషామాషీగా తీస్తే లైట్ గా తీసుకుంటారు. అందుకు తగ్గ పాత్ర కావాలి అలాంటి పాత్ర చాలా కోపంతో, బోల్డ్ గా, కొన్ని అరుదైన స్కిల్స్ తో ఉండాలి. సుభాష్ చంద్రబోస్ ఫాలోవర్ అయితే బాగుంటాడనిపించింది. అలా సేనాపతి పాత్ర పుట్టింది. అప్పుడు ఆ పాత్ర నుంచి వెనక్కి కథ రాసుకున్నారు. అంటే క్యారక్టర్ పుట్టాక కథ రాసారు.
నేతాజీ ఒరిజనల్ ఫుటేజ్, స్పెషల్ ఎఫెక్ట్స్
కమల్ హాసన్ కథ విన్నాక ఈ సినిమాకు అథెంటిసిటీ అత్యవసరం అని చెప్పారు. లేకపోతే సేనాపతి పాత్రను ఓన్ చేసుకోరు అని ఫిక్షన్ పాత్రగా కొట్టిపారేస్తారని అనగానే..నేతాజి సుభాష్ చంద్రబోస్ డాక్యుమెంటరీ ఫుటేజ్ ఫర్మిషన్ తీసుకుని అందులో కమల్ ని స్పెషల్ ఎఫెక్ట్స్ తో జతచేసారు. అది అప్పటికి చాలా ఛాలెంజింగ్ వ్యవహారం, 1996 నాటికి టెక్నికల్ గా అంత అడ్వాన్స్ లేదు . అయితే సినిమాకు ఆ ఎపిసోడే హైలెట్ గా నిలిచి బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కు నేషనల్ అవార్డ్ వచ్చింది.
ఐశ్వర్యారాయ్ మొదటి ఛాయిస్
ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా ఐశ్వర్యారాయ్ బచ్చన్ ని ఎంచుకున్నారు. అయితే ఆమె 1995 లో మిస్ వరల్డ్ గా ఎన్నిక కావటంతో ఓ యాడ్ ఏజెన్సీతో కాంటాక్ట్ లో ఉంది. దాంతో ఆ ఆఫర్ ని వదులుకుంది. అది మనీషా కొయరాలాని వరించింది. మణిరత్నం బొంబై సినిమా చూసి ఆమెను ఎంపిక చేసారు శంకర్. అలాగే రంగీలాలో ఊర్మిళ నటన చూసి ఇంప్రెస్ అయిన ఎఎమ్ రత్నం ఆమెను బోర్డ్ లోకి తీసుకొచ్చారు. ఇక ఐశ్వర్యారాయ్ ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో రూపొందిన జీన్స్, రోబో సినిమాల్లో చేసింది.
అకాడమీ అవార్డ్ విన్నర్ మేకప్
ఈ సినిమా కోసం కమల్ కు ప్రత్యేకంగా prosthetic మేకప్ చేసారు. డబ్బై ఏళ్ల సేనాపతిపాత్రలో 40 ఏళ్ల కమల్ కనపడాలి. అది విజయవంతంగా అకాడమీ అవార్డ్ విన్నర్ మైకల్ వెస్ట్ మోర్ ని తీసుకొచ్చి చేయించారు. ఆయన అప్పటికే మాస్క్ (1985), స్టార్ టెక్ ఫస్ట్ కాంటాక్ట్ (1996) సినిమాలు చేసి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన కమల్ తో కొనసాగారు. భామనే సత్యభామనే (1996), & దశావతారం (2008) సినిమాలు చేసారు. అయితే భారతీయుడు లుక్ స్దాయి మాత్రం రాలేదు.
మర్మకళ
భారతీయుడులో సేనాపతి మర్మ కళై అనే యుద్ధ కళలో ప్రావీణ్యుడు. యోగా, ధ్యానం చేస్తుంటాడు.. అప్పట్లో అంతటా మర్మకళ గురించి పెద్ద చర్చగా మారింది. ఈ విషయం గురించి శంకర్ చెప్తూ తాను ఓ పుస్తకం లో చదివానని, అస్సాన్ రాజేంద్రన్ అనే మాస్టర్ ఇందులో ప్రావీణ్యుడు అని ఆయన్ని తమ సినిమాకు స్టంట్ మాస్టర్ గా చేయమని అడిగామని చెప్పారు. కమల్ స్వయంగా చాలా కాలం ప్రాక్టీస్ చేసారని అందుకే తెరపై అంత అద్బుతంగా ఆ సీన్స్ పండాయని చెప్పుకొచ్చారు.
ఆ సీన్ రజనీని మనస్సులో పెట్టుకునే డిజైన్ చేసారు
ఈ సినిమా స్క్రిప్టు దశలో ఉన్నప్పుడు రజనీని దృష్టిలో పెట్టుకునే డిజైన్ చేసారు. తన కమిట్మెంట్స్ తో రజనీ ఈ సినిమా చేయలేకపోయారు. ఇక రజనీని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అందులో ఇంట్రవెల్ దగ్గర వచ్చే మాస్ ఛైర్ సీన్ ని రజనీని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసామని చెప్పారు. అయితే కమల్ కు ఈ విషయం చాలా కాలం దాకా తెలియదు. తన స్టైల్ లో ఛైర్ సీన్ చేసి పండించారు.
కమల్ డేట్స్ దొరకపోతే ఆ హీరోలతోనే ముందుకు
ఈ సినిమాకు అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన వసంత్ బాలన్ మాట్లాడుతూ..భారతీయుడు సినిమాని మొదట స్క్రిప్టు దశలో రజనీకాంత్ ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసామని చెప్పారు. రజనీ నో చెప్పాక..ఏ హీరోతో వెళ్లాలనే సంశయం మొదలైంది. అప్పుడు రాజశేఖర్ ని తండ్రి పాత్రలో, వెంకటేష్ ని కొడుకు పాత్రలో చేద్దామని అనుకున్నారు. అయితే కమల్ హాసన్ ఓకే చెప్పటంతో ద్విపాత్రాభినయం ఆయన చేతే చేయించారు. లేకపోతే రాజశేఖర్ సినిమా అయ్యేది.
ఆస్కార్ కు ఇండియా నుంచి ఎంట్రీ
భారతీయుడు చిత్రం మన దేశం నుంచి అఫీషియల్ గా ఆస్కార్ కు బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరిలో 1996 అకాడిమీ అవార్డ్ లుకు ఎంపిక చేసారు. కానీ నామినేషన్ కూడా సాధించలేకపోయింది. ఇది చాలా కమల్ అభిమానులను నిరాశపరిచింది. అందుకే మనమే ఆస్కార్ ని మించిన అవార్డ్ లు ఇక్కడ ఇచ్చుకుందాం అని కమల్ అంటారు.
పాటల క్యాసెట్స్ రికార్డ్ స్దాయిలో అమ్మకాలు
ఈ సినిమాకు శంకర్, కమల్ ఒకెత్తు అయితే ఏఆర్ రహమాన్ సంగీతం మరో స్దాయికి తీసుకెళ్లింది. 2.4 మిలయన్ల పాటలు క్యాసెట్స్ అమ్ముడై రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దాదాపు 28 ఏళ్ల తర్వాత కూడా ఆ పాటలు నిత్యనూతనంగా ఉంటాయి. ఆ పాటలు కోసం రిపీట్ ఆడియన్స్ ఉండేవారు. సినిమా సక్సెస్ కు సంగీతం ఏ స్దాయిలో ఉపయోగపడుతుందనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది.
‘భారతీయుడు’ చిత్రంలోని పాటలు అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ విశేషాదరణ చూరగొన్నాయి. “పచ్చని చిలకలు తోడుంటే…”, “టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా…”, “తెప్పలెల్లిపోయాక ముప్పు తొలగిపోయిందే…”, “మాయా మశ్చీంద్రా మచ్చను చూడగ వచ్చావా…”,”అదిరేటి డ్రెస్సు మీరేస్తే…” పాటలు యువతను ఊపేశాయి. భువనచంద్ర పలికించిన ఈ పాటలు ఈ నాటికీ సందర్భానుసారంగా జనాన్ని పలకరిస్తూనే ఉంటాయి.
కథా ప్రేరణ
తమిళంలో సూపర్ హిట్ శివాజీ గణేశన్ ‘తంగపతక’ కథలో దేశద్రోహి అయిన కన్నకొడుకును హీరో చివరకు కడతేరుస్తాడు. ఈ చిత్రం తెలుగులో ‘బంగారుపతకం’ పేరుతో అల్లు అరవింద్ డబ్బింగ్ చేసారు. ఇక్కడా మంచి విజయం సాధించింది. ఆ కథలాగే ‘భారతీయుడు’లోనూ దేశంలో చీడపురుగులాంటి కొడుకును ఓ నాటి స్వాతంత్ర్య సమరయోధుడు సేనాధిపతి మట్టుపెడతాడు. శివాజీ గణేశన్ అభిమాని అయిన కమల్ హాసన్ కు ఈ కథ బాగా నచ్చింది.
1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా సంచలన నిజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ డ్యుయెల్ రోల్ చేసి మెప్పించారు. తండ్రి సేనాపతి పాత్రలో కమల్ నటన, హావభావాలు ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భారతీయుడు సినిమా విడుదలైన 25 ఏండ్లకు.. సీక్వెల్ గా ‘భారతీయుడు-2’ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలోనూ కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
కమల్ కు వచ్చిన డౌట్
ఈ సినిమా కథ విన్న తరువాత కమల్ హాసన్ , డైరెక్టర్ శంకర్ ను కొన్ని ప్రశ్నలు అడిగారు! దేశానికి స్వాతంత్ర్యం రావడం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన సేనాపతి, స్వరాజ్యం వచ్చిన తరువాత పల్లెలో తాపీగా కూర్చొని ఉంటాడా? అన్నదే ఆ ప్రశ్న. అప్పటికప్పుడు శంకర్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాడు కానీ కమల్ కన్వీన్స్ కాలేదు. కానీ, అప్పటికే తన తెరకెక్కించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకోవటంతో శంకర్ డౌట్స్ ని ప్రక్కన పెట్టి ముందుకు వెళ్లిపోయారు.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదట ఈ సినిమాలో కాజల్ కూడా నటించాల్సి ఉండేది. కానీ, తనకు పెళ్లి కావడం, ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తున్నది. ఇక అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.