Published : Aug 01, 2025, 12:09 PM ISTUpdated : Aug 01, 2025, 12:10 PM IST
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త తరం నటులు, నిర్మాతలు, దర్శకులు వస్తూనే ఉంటారు. తాజాగా ఇన్నోలెన్స్ ప్రొడక్షన్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ నుంచి రాబోయే తొలి చిత్రం గురించి ఇక్కడ తెలుసుకోండి.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి మరో కొత్త నిర్మాణ సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ఇన్నోలెన్స్ ప్రొడక్షన్స్ అనే పేరుతో ఈ నిర్మాణ సంస్థని ప్రారంభించారు. బోల్డ్ గా ఉండే కథలు ఎంచుకుంటూ, నూతన నటీనటుల్ని, టెక్నీషియన్లని ప్రోత్సాహించడమే లక్ష్యంగా ఈ నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. ఇదే సందర్భంలో, నిర్మాణ సంస్థని ప్రారంభించిన రోజే తొలి చిత్రాన్ని కూడా లాంచ్ చేశారు. ప్రొడక్షన్ నం.1 ప్రారంభించి లీడ్ పెయిర్ ని కూడా అనౌన్స్ చేశారు.
DID YOU KNOW ?
పీడకలల నేపథ్యంలో సైకలాజికల్ థ్రిల్లర్
కలలు, మానసిక సమస్యల నేపథ్యంలో గతంలో చాలా చిత్రాలు వచ్చాయి. ఇన్నోలెన్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించే తొలి చిత్రం పీడకలల నేపథ్యంలో సైకలాజికల్ థ్రిల్లర్ గా ఉండబోతోంది.
25
నటీనటులు, నిర్మాతలు
ఈ చిత్రంలో సూర్య వశిష్ఠ, హర్షిత బండ్లమూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రాన్ని వెణుగోపాల్ నాయుడు పువ్వాడ, అక్కినేని కీర్తి, రాకేష్ రెడ్డి పట్టూరి ఇన్నోలెన్స్ ప్రొడక్షన్స్ సంస్థని స్థాపించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాంకేతిక బృందంలో వినీత్ పబ్బతి సినిమాటోగ్రాఫర్‌గా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీత దర్శకుడిగా, సురేశ్ బానిసెట్టి గీత రచయితగా ఉన్నారు.ఈ చిత్రానికి దర్శకుడు జయ్ ఆదిత్య రెడ్డి.
35
వెంటాడే పీడకలల నేపథ్యంలో కథ
ఈ చిత్రానికి కథ, దర్శకత్వం అందిస్తున్న జయ్ ఆదిత్య రెడ్డి ఎం, కథానాయకుడు దేవ్ పాత్రను పరిచయం చేస్తూ కథను అల్లారు. దేవ్ (సూర్య వశిష్ఠ) అనే యువకుడిని వెంటాడే పీడకలలు అతడి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. హీరోకి పీడకలలు పదే పదే ఎందుకు వస్తున్నాయి ? అతను నిజంగా ఏదో పెద్ద తప్పు చేసిన వాడా? లేక అతని మనస్సే అతన్ని మోసం చేస్తుందా? అనే మిస్టరీ చుట్టూ కథ సాగుతుంది.
వెణుగోపాల్ నాయుడు పువ్వాడ (ఫౌండర్, ఇన్నోలెన్స్ ప్రొడక్షన్స్) ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మనిషి మనసుని తాకే కథలు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ సంస్థ మొదలైంది. 'ప్రొడక్షన్ నం.1' సినిమాతో ఆ దిశగా మొదటి అడుగు వేస్తున్నాం. దర్శకుడు జయ్ ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ, “ఇది ఓ థ్రిల్లర్ మాత్రమే కాదు… మన మనస్సు లోతుల్లోకి చేసే ప్రయాణం. మన తప్పులు, మన జ్ఞాపకాలు ఎలా మన లైఫ్ ని మారుస్తాయో చూపించాలన్నది నా ఉద్దేశం,” అన్నారు.
55
త్వరలోనే ఫస్ట్ లుక్
హీరో సూర్య వశిష్ఠ మాట్లాడుతూ, “దేవ్ పాత్ర కోసం నేను పూర్తిగా మానసికంగా ఒదిగిపోవాల్సి ఉంటుంది. చాలా ఇంటెన్స్, భావోద్వేగంతో కూడుకున్న పాత్ర ఇది,” అని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ టీజర్ ను హైదరాబాద్‌లో జరగనున్న ప్రత్యేక ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. తేదీలు త్వరలో ప్రకటించనున్నారు.