ఇక రామరాజు ఇంట్లో అందరూ సాగర్, నర్మద వెళ్ళిపోయారు అన్న బాధలో ఉంటారు. వల్లి మాత్రం ఆనందంతో గంతులు వేస్తుంది. వల్లి భాగ్యం ఇడ్లీ బాబాయ్ ఆనందంతో తేలిపోతూ ఉంటారు. ‘ప్రేమ, ధీరజ్ లు వెనకే వెళ్లారు. సాగర్, నర్మదని తీసుకొచ్చేస్తారంటావా’ అని అంటుంది వల్లి. దానికి భాగ్యం ‘అస్సలు రారు.. ఈలోపు నువ్వు వాళ్ళ గదిని మాకు వచ్చేలా మీ అత్త మామలతో మాట్లాడు. మేము ఆ గదిని ఆక్రమించేస్తాం, ఆ తరువాత రైస్ మిల్లుని, ఇంటిని కూడా ఆక్రమించేద్దాం’ అని సలహా ఇస్తుంది. కానీ ఈ లోపే ధీరజ్, ప్రేమ కలిసి నర్మద, సాగర్ ని ఇంటికి తీసుకొస్తారు.
నర్మద, సాగర్, ప్రేమ, ధీరజ్ ఇంట్లోకి రావడం తిరుపతి చూసి ఆ విషయాన్ని అందరికీ చెబుతాడు. దాంతో వల్లి, భాగ్యం షాక్ అయిపోతారు. భాగ్యం వల్లితో వెళ్ళు వెళ్ళు ఏదో ఒకటి మాట్లాడు లేకపోతే అనుమానం వస్తుందని చెబుతోంది. దాంతో వల్లి ఎదురుగా వెళ్లి లోపలికి రండి అని నటించడం మొదలు పెడుతుంది. వెంటనే ప్రేమ ‘మన ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయి. వాటి వల్లే బాగా దిష్టి తగిలింది. వెళ్లి దిష్టినీళ్లు తెచ్చి దిష్టి తీయు’ అని చెబుతుంది వల్లికి. దానికి వల్లి నేను తీయాలా అని అడుగుతుంది. వెంటనే ప్రేమ ఇంటికి పెద్ద కోడలివి నువ్వే కదా దిష్టినీళ్లు తెచ్చి దిష్టి తీయు అని చెబుతుంది. దాంతో వల్లి ఆ పని చేస్తుంది.