
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో సేనాపతి కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అదే సమయంలో భద్రావతి ఎక్కిళ్లు వస్తాయి. భద్రావతి మాట్లాడుతూ ‘ఇవి ఆనందంతో వస్తున్న ఎక్కిళ్ళు. ఇందాక ఆ రామరాజు గారి ఏడుపు మొఖం నాకు పదేపదే గుర్తొస్తుంది. వాడిని మనం అలా అవమానిస్తుంటే వాడు సిగ్గుతో తలదించుకోవడం, కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు’ అని నానా మాటలు అంటుంది భద్రావతి. దాంతో అమూల్యకు కోపం వచ్చి మా నాన్నని ఏమంటున్నారు అని అడుగుతుంది. మా నాన్న ఎప్పుడూ కూడా మీకు హాని జరగాలని కలలో కూడా అనుకోరు, అలాంటి వ్యక్తి గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారని అడుగుతుంది.
అప్పుడు భద్రావతి గట్టిగా అరుస్తూ ‘నువ్వు పుట్టకముందే ఈ పగలు ప్రతీకారాలు ఉన్నాయి. నా మేనల్లుడు జమీందారు. వాడిని పెళ్లి చేసుకుంటేనే మీ వాళ్ళు అంతగా నీ గురించి ఫీల్ అయిపోతున్నారు. కానీ మీ నాన్న మా ఇంట్లో పనోడు. ఆ పనోడు నా చెల్లిని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మా నాన్న గుండె పగిలి మరణించాడు. మేమెంత బాధపడి ఉంటామో అప్పుడు. అన్నం పెట్టిన మా ఇంటికి నమ్మకద్రోహం చేసిన మీ నాన్న మీద ఇంకెంత కోపం, పగ ఉండాలి మాకు’ అని అరుస్తుంది. సేనాపతి, విశ్వక్, భద్రావతి అక్కడినుంచి వెళ్ళిపోతారు. అప్పుడు అమూల్యను పెద్దమ్మ, విశ్వక్ తల్లి రేవతి సముదాయిస్తారు.
ఇక ఇక్కడి నుంచి సీన్ రామరాజు దగ్గరికి మారుతుంది. రామరాజు.. సేనాపతి, భద్రావతి తనకు చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుంటాడు. తననే ఇంతగా అవమానిస్తున్నారు.. అమూల్య అమాయకురాలు ఆమెను ఎంత బాధ పెడుతున్నారో అని బాధపడుతూ ఉంటాడు. మరోపక్క ప్రేమ ధీరజ్ తో మాట్లాడుతూ ‘నువ్వు కారు కొంటున్న విషయం మీ అమ్మ నాన్నకి ఇప్పుడే చెప్పు’ అని అంటుంది. ప్రేమ ధీరజ్ ను రామరాజు దగ్గరికి తీసుకెళ్తుంది.
ఇక ఇక్కడి నుంచి సీన్ సాగర్, నర్మద దగ్గరికి మారుతుంది. వారిద్దరూ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. సాగరు ‘మీ ఆఫీసులో కొలీగ్స్ అలా మాట్లాడటం వల్ల నీకు బాధ కలిగి ఉంటుంది. నా వల్లే కదా.. సారీ నర్మద’ అని చెబుతాడు. ‘నువ్వు సారీ చెప్పినంత మాత్రాన ఆ బాధ తీరిపోదు, ఆ బాధ ఒక్కసారి పోయేది కాదు, లైఫ్ లాంగ్ నేను పడుతూనే ఉండాలి ఆ విషయం వదిలేయు. నాకోసం ఒక పని చేస్తావా నువ్వు? నీకు మీ నాన్నకు మధ్య దూరం పెరగడం నాకేమీ నచ్చడం లేదు. అందుకే నువ్వు మీ నాన్న కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగు. ఆయన నిన్ను ఎంతో కొంత క్షమిస్తారు’ అని అంటుంది నర్మద. కానీ సాగర్ ‘లేదు మా నాన్నమూర్ఖంగా ఆలోచించే మనిషి. నేను ఆయన కాళ్లు పట్టుకున్న ఆయన నన్ను అర్థం చేసుకోరు’ అని అంటాడు సాగర్ . ‘ఆయన నీ శత్రువు కాదు, నీ కన్న తండ్రి. ఆయన జీవితాంతం ద్వేషంతో బతకలేరు. పద వెళదాం’ అని అంటుంది నర్మద. కాని సాగర్ ఎంతకీ ఒప్పుకోడు. నర్మదతో వాదిస్తూనే ఉంటాడు. చివరికి నర్మద.. సాగర్ ని ఒప్పించి రామరాజుకి క్షమాపణ చెప్పించేందుకు తీసుకెళుతుంది.
ఇక్కడ నుంచి సీన్ రామరాజు దగ్గరికి మారుతుంది. రామరాజు ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉంటాడు. వేదవతి వచ్చి దేని గురించి ఆలోచిస్తున్నారని అడుగుతుంది. ‘అమూల్య గురించే ఆలోచిస్తున్నాను. తను ఆ ఇంట్లో ఎలా ఉందో ఏంటో భయంగా ఉంది. రేపు ఒక్కసారి అమూల్యతో మాట్లాడి మన ఇంటికి వచ్చేయమని అడుగుదాం’ అని అంటాడు రామరాజు. దానికి వేదవతి ‘అవసరం లేదు. నా భర్త ప్రాణాలు మీదికి తీసుకొచ్చింది నా కన్నా కూతురైన సరే నాకు అక్కర్లేదు. ఇప్పుడిప్పుడే మీరు కోలుకుంటున్నారు. మళ్ళీ మీరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటే నేను బతకలేను’ అని అంటుంది.
ఈలోపు ధీరజ్, ప్రేమ అక్కడికి వస్తారు. ‘ డ్రైవర్ గా పనిచేస్తే నాకు భవిష్యత్తు ఏమీ లేదనిపిస్తోంది నాన్న. అందుకనే నేను సొంతంగా కారు కొని ట్రావెల్స్ పెడితే ఫ్యూచర్ బావుంటుందని ప్రేమ సలహా ఇచ్చింది. అందుకని కారు చూశాను. అడ్వాన్స్ కూడా ఇచ్చాను. డౌన్ పేమెంట్ కూడా రేపొ ఎల్లుండో ఇచ్చి కారు ఇంటికి తెచ్చుకుంటాను. ఈ విషయం మీకు చెబుదామని వచ్చాను’ అంటాడు. అప్పుడు వేదవతి ‘నీకు అసలు బుద్ధుందా? ఇలా కారు కొని డ్రైవర్గా పనిచేసే బదులు ఎంచక్కా మన రైస్ మిల్లు చూసుకోవచ్చు కదా. ఓనర్ గా దర్జాగా ఉంటావు’ అని చెబుతుంది. అప్పుడు ప్రేమ ‘మొన్న మావయ్య రైస్ మిల్లు ఎవరు చూసుకుంటారు అని అడిగినప్పుడు ధీరజ్ తీసుకుందామని అనుకున్నాడు. కానీ చందు బావ ముందుకు రావడంతో ఆగిపోయాడు. లేదంటే ధీరజ్ రైస్ మిల్ తీసుకునేవాడు’ అంటుంది. అప్పుడు వేదవతి ‘అయితే రేపటి నుంచి రైస్ మిల్లు చూసుకో.. పెద్దోడితో పాటు నువ్వు కూడా రైస్ మిల్లు కి వెళ్తావు కదా’ అంటుంది వేదవతి. కానీ ధీరజ్ సమాధానం చెప్పడు.
అప్పుడు రామరాజు మాట్లాడుతూ ‘రైస్ మిల్లుకు వెళ్లడం వాడికి ఇష్టం లేదని వాడి మొహం చూస్తే అర్థమవుతుంది కదా, ఎందుకు ఇబ్బంది పెడతావు అని అంటాడు. వాడు కష్టపడి బతకాలనుకుంటున్నాడు. కానీ సాగర్ లాగా పరాయి వాళ్ళ సొమ్ము కొట్టేసి ఉద్యోగం కొనుక్కోవాలి అనుకోవడం లేదు. అక్రమ సంపాదనతో బతకాలని అనుకోవడం లేదు’ అని అంటాడు. రామరాజు ఆ మాటలు అనేటప్పుడు సాగర్, నర్మద వెనకే ఉంటారు. వాటిని విని ఇద్దరూ బాధపడతారు. సాగర్ కి చాలా కోపం వచ్చి అక్కడ నుంచి లోపలికి వెళ్లిపోతాడు. వేదవతి మాట్లాడుతూ కారు కొనాలంటే బోలెడన్ని డబ్బులు అవుతాయి కదా, మీ నాన్నకి అవసరమైతే అడుగు అని చెబుతుంది. కానీ ధీరజ్ డబ్బు సెట్ చేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక్కడి నుంచి సీన్ సాగర్ దగ్గరికి మారుతుంది. సాగర్ కోపంగా గదిలో ఉన్న వస్తువులన్నీ పడేస్తాడు. నర్మద వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే ‘నా కోపానికి కారణం తెలీదా? నేను మా నాన్న దగ్గరికి రానని చెప్పాను. మా నాన్న అర్థం చేసుకోడని చెప్పాను కదా. అయినా కాళ్లు పట్టుకుంటే కరిగిపోతాడు, క్షమాపణ చెబితే అర్థం చేసుకుంటాడు అని నువ్వే బలవంతంగా తీసుకెళ్లావు. చూసావు కదా ఆయన ఏం మాట్లాడాడో.. నేను దొంగనట. పాపపు సొమ్మును సంపాదిస్తున్నానంట’ అని అరుస్తాడు.
నర్మద సాగర్ కు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ సాగర్ రెచ్చిపోయి రామరాజు గురించి నెగిటివ్ గా మాట్లాడుతాడు. ‘మీ మావయ్యకి పెద్ద కొడుకు అంటేనే ఇష్టము. పెద్దకొడుకే మంచోడు. నేను అతని కొడుకును కాదు కదా కనీసం మనిషినే కాదు’ అని మాట్లాడుతాడు. కానీ నర్మద నువ్వు చేసింది తప్పే కదా ఆ తప్పును వదిలేసి మీ నాన్నగారి గురించి మాట్లాడతావ్ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు సాగరు ఈ ఇంట్లో ఎవరూ తప్పే చేయలేదా? నేనే తప్పు చేశానా? ఆయన అందరి తప్పుల్ని క్షమించి వదిలేస్తాడు.. కానీ నాకు మాత్రమే శిక్ష వేస్తాడు, అందుకే ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతాను అన్నాను.. అని చాలా కోపంగా మాట్లాడతాడు. నర్మద చెబుతున్నా వినకుండా అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
ఇక్కడ నుంచి సీన్.. ధీరజ్ ప్రేమ దగ్గరికి మారుతుంది. అర్ధరాత్రి అయ్యాక ధీరజ్ కు మెలకువ వస్తుంది. చందుకి, సాగర్ కు ఫోన్ చేసి అంత రెడీయా? అని అడుగుతాడు. అంతా రెడీ అని చెబుతారు. గది తలుపులు తీసి నిద్రపోతున్న ప్రేమను అలాగే ఎత్తుకొని బయటికి తీసుకొస్తాడు. ఈ లోపు ప్రేమకు తెలివి వచ్చి ఎక్కడికి తీసుకెళ్తున్నావని అడుగుతుంది. ఇంటిని లైట్లతో బెలూన్లతో అలంకరించి ప్రేమకు చూపిస్తాడు. ప్రేమ పుట్టిన రోజుకు ఇదంతా రెడీ చేస్తాడు. వెంటనే వల్లి, చందు, సాగర్, నర్మద కూడా అక్కడికి వచ్చేస్తారు. అందరూ ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు. ఇదంతా అరేంజ్ చేసింది ధీరజ్ అని తెలిసి ప్రేమ ఎంతో ఆనందపడుతుంది. కేక్ కట్ చేసి అందరికీ కేక్ పెడతారు. దీంతో నేటి ఎపిసోడ్ ముగిసిపోతుంది.