
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో నర్మద, సాగర్ కలిసి నర్మద తండ్రి ప్రసాదరావు ఇంటికి వెళతారు. ఆ సమయంలో ప్రసాద్ రావు ఫోన్లో తన అల్లుడికి ఉద్యోగం వచ్చినందుకు పార్టీ ఇస్తున్నానని అందరినీ పిలుస్తూ ఉంటాడు. నర్మద అదే సమయానికి అక్కడికి వచ్చి పార్టీ దేనికి ఇస్తున్నావని అడుగుతుంది. ప్రసాద్ రావు మాట్లాడుతూ ‘అల్లుడికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా సాయంత్రం పార్టీ అరేంజ్ చేస్తున్నాను. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఆల్రెడీ పిలిచేసాను. అందరికీ అల్లుడుని పరిచయం చేస్తాను. నువ్వు అల్లుడు కోరుకున్నది ఇదే కదా. మన కుటుంబంలోకి అల్లుడుని సగర్వంగా యాక్సెప్ట్ చేస్తున్నానమ్మా’ అని అంటాడు.
దానికి నర్మద కోపంగా ‘ఏమని పరిచయం చేస్తావు? నా అల్లుడు పాత లక్షలు పెట్టి ఉద్యోగం కొన్నాడు. అల్లుడు లంచమిచ్చి ఉద్యోగం కొనుక్కున్నాడు అని అందరికీ పరిచయం చేస్తారా? మీ అల్లుడు రైస్ మిల్లులో ఉండకూడదు. అందుకే లంచం ఇచ్చి ఉద్యోగం వేయించి మీతో విడగొట్టేయాలని చెప్పి పార్టీకి రమ్మని మా మావయ్య గారికి ఆహ్వానిస్తారా? వయసులో పెద్దవారు బుద్ధుందా? క్రమశిక్షణతో విలువలతో పెంచాలని చెబుతూ ఉంటారు కదా.. సాగర్ గవర్నమెంట్ ఉద్యోగి అయితేనే అల్లుడుగా స్వీకరిస్తారా? లేకపోతే అల్లుడుగానే కాదు మనిషిగా కూడా చూడరా?’ అని నర్మద గట్టిగానే క్లాసు పీకుతుంది. అప్పుడే నర్మద తల్లికి కూడా ఈ విషయం తెలుస్తుంది.
‘సాగర్‌కి అంత డబ్బులు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది అనవసరం. ఇప్పుడు ఇంట్లో ఈ విషయం బయటపడితే నేను తలెత్తుకొని బతకగలనా’ అంటుంది నర్మద. దానికి ప్రసాదరావు మాట్లాడుతూ ‘నేనేమీ సాగర్ ను ఫోర్స్ చేయలేదు. సాగర్ గవర్నమెంట్ జాబ్ చేయాలని ఆశపడ్డాడు. అది కూడా నీ కోసం. అయినా ఎంతకాలమని రైస్ మిల్లులో కూలివాడిగా ఉంటాడు’ అని అంటాడు ప్రసాద్ రావు. వెంటనే నర్మదకి కోపం వచ్చి ‘చూడు నాన్న రైస్ మిల్లులో పనిచేయడం గౌరవమే. ఉద్యోగాలు కొనుక్కోవడం గౌరవంగా ఉంటుందా?’ అని గట్టిగా అడుగుతుంది. ‘మీ అల్లుడికి ఉద్యోగం లేదని తెలిస్తే పరువు పోతుందని పట్టుబట్టారు కదా, ఇలా లంచాలు ఇచ్చి కొనుక్కున్న ఉద్యోగంలో కొడుకు ఉన్నాడు అని తెలిస్తే రామరాజు గారి గౌరవం పోదా? ఇంతకాలం ఆ ఇంట్లో నేను గౌరవంగా బతుకుతున్నాను. ఈ విషయం బయట పెడితే నాకు గౌరవం ఉంటుందా? అందరి ముందు నేను తలదించుకొని బతకాలి కదా’ అంటుంది.
నర్మద తండ్రి మాట్లాడుతూ ‘నువ్వు నచ్చిన పెళ్లి చేసుకున్నావు. నేను ఎంత క్షోభ పడ్డానో తెలుసా? కూతురు పెళ్లి ఎలాగూ నా చేతుల మీదుగా చేయలేకపోయాను. కనీసం నా అల్లుడు జీవితమైనా బాగు చేయాలి అనుకున్నాను. అందులో తప్పేముంది? నా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించే నేను ఇలా చేశాను’ అంటాడు. ‘పార్టీ చేసుకో నాన్నా.. మా కుటుంబం తరఫునుంచి ఎవరమూ రాము. నేను బాధ పడుతుంటే అప్పుడు ఆనందపడుదురు’ అని అంటుంది నర్మద. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని బయలుదేరుతుంది. ‘అల్లుడిని అందరికీ పరిచయం చేయాలని ప్లాన్ చేశాను. జరిగిందేదో జరిగిపోయింది. సాయంత్రమే పార్టీ. నేను అందరికీ చెప్పేశాను. ఇది నా గౌరవ మర్యాదలకు సంబంధించినది. నన్ను ప్రసాదరావుగా కాకుండా తండ్రిగా చూడు అర్థం చేసుకో’ అని బతిమిలాడుతాడు. నర్మద ఏదో ఒకటి చేసుకోండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సాగర్ మాత్రం ఇంట్లో వారందరికీ తన నచ్చజెప్పి తీసుకొస్తానని, పార్టీ మంచిగా జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు.
ఇక్కడి నుంచి సీన్ వేదవతి దగ్గరికి మారుతుంది. వేదవతి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండగా అమూల్య వచ్చి చూస్తూ ఉంటుంది. అమ్మా అని ప్రేమగా పిలుస్తుంది అమూల్య. కానీ వేదవతి పట్టించుకోకుండా మొక్కలకి నీళ్లు పోసుకుంటూ ఉంటుంది. అమూల్య బయటకు వచ్చి ‘అమ్మా నాతో మాట్లాడు. అమ్మ ఒక్కసారి నా వైపు చూడమ్మా. మీ అందరి ద్వేషాన్ని నేను భరించలేక పోతున్నాను. అమ్మ నాకు ప్రాణం పోతున్నంత బాధగా ఉందమ్మా, కనీసం నువ్వైనా నాతో మాట్లాడమ్మా’ అని బతిమిలాడుతుంది అమూల్య. కానీ వేదవతి కోపంగా బకెట్లో ఉన్న నీళ్లను అమూల్య ముఖంపై కొడుతుంది. వేదవతి మాట్లాడుతూ ‘ఏం ఇప్పుడు గుర్తొచ్చిందా.. నేనేం అయిపోవాలి అని. కన్న వాళ్ళు చెప్పినట్టు మాట వింటానని చెప్పి గుండెల మీద తన్ని వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన కూతుళ్లు బాగుపడరు, నాశనమైపోతారు’ అని బాగా తిట్టి ఇంట్లోకి వెళ్ళిపోతుంది వేదవతి.
ఇక్కడి నుంచి సీన్ ప్రేమ దగ్గరికి మారుతుంది. ధీరజ్ కోసం టీ పెట్టి తీసుకెళ్తూ ఉంటుంది. ఈలోపు వేదవతి వచ్చి ఆ టీ తీసుకుని తాగుతుంది. వేదవతి మాట్లాడుతూ ‘ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే చిరాకు వేస్తోంది. ఎవరెవరు ముఖాలో కనిపిస్తున్నాయి’ అని అంటుంది. వెంటనే ప్రేమ అమూల్య కనిపించిందా అత్తయ్య అని అడుగుతుంది. అప్పుడు వేదవతి దాని పేరు నాకు గుర్తు చేయకు అని కోప్పడుతుంది. మరో పక్క ధీరజ్ గదిలోకి వచ్చి దాచుకున్న డబ్బులను తీసి పాకెట్లో పెట్టుకుంటాడు. ఈ లోపు ప్రేమ.. వేదవతితో అమూల్య గురించి మాట్లాడుతూ ఉంటుంది.
ఈలోపు ధీరజ్ అర్జెంటుగా బయటకు వెళ్లాలి పద అని ప్రేమను రమ్మంటాడు. ప్రేమ తాను చేసిన టీ తాగి వెళ్దామని చెబుతుంది. ప్రేమ ధీరజ్ బండి పై బయటకు వెళుతూ ఉంటే.. ఎదురుగా అమూల్య తడిసిపోయిన చీరలో నిలుచుని ఏడుస్తూ కనిపిస్తుంది. ప్రేమ జరిగిన విషయం చెబుతుంది. ప్రేమ, ధీరజ్ ఇద్దరూ దిగి అమూల్య దగ్గరికి వెళతారు. అమూల్యతో ప్రేమగా మాట్లాడతాడు ధీరజ్. అన్నయ్యను కౌగిలించుకుంటుంది అమూల్య. అమూల్య ధీరజ్ తనతో మాట్లాడినందుకు ఆనందంతో ఇంట్లోకి వెళ్ళిపోతుంది.
ఇక్కడ నుంచి సీన్ వల్లి దగ్గరికి మారుతుంది. వల్లి ఇంటినిండా నగలతో సాగర్ కు ఉద్యోగం ఇచ్చిన ఏజెంట్ దగ్గరికి వస్తుంది. వాళ్ళని చూసి ఆ ఏజెంట్ పడిపోతాడు. వల్లి వెనకే ఇడ్లీ బాబాయి, భాగ్యం కూడా తమిళియన్ వేషాలు వేసుకొని వస్తారు. ఆ ఏజెంట్ నేను మీకు ఏ విధంగా సహాయ పడగలను అని అడుగుతాడు. భాగ్యం ఇడ్లీ బాబాయ్ కి ఉద్యోగం కావాలని, అది కూడా గవర్నమెంట్ జాబ్ కావాలని అడుగుతుంది. వల్లి క్యూట్ గా అడగడంతో ఏజెంటు ఏదో ఉద్యోగం చూస్తానని చెబుతాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.