
మనోజ్ ని చూసి బాలు ఓర్వలేకపోతున్నాడు అని, ఇంట్లో నుంచి బాలు, మీనా వెళ్లిపోవాలని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. కానీ, మీనా వినదు. అత్తకు ఎదురు తిరుగుతుంది. ‘ ఈ ఇంట్లో ఉండటానికి మీకు ఎంత హక్కు ఉందో.. నాకు కూడా అంతే హక్కు ఉంది. ఈ విషయం నా భర్తకు తెలిస్తే ఊరుకోడు. ఆవేశంలో ఈయన(మనోజ్) చెయ్యో, కాలో తీసేస్తాడు’ అని గట్టిగా చెబుతుంది. ‘ వాడు రౌడీ వేషాలు వేయకుండా ఉండాలనే ముందు జాగ్రత్తగా నా బాడీ గార్డ్ ని తెచ్చుకున్నాను. కావాలంటే చూస్తావా?’ అంటూ మనోజ్ తన బాడీ గార్డును పిలుస్తాడు. అతని పర్సనాలిటీ చూసి ఇంట్లో అందరూ షాకై చూస్తారు.
‘చూశావు గా మా బాడీ గార్డుని.. ఇప్పుడు పిలువు మీ ఆయన్ని’ అని మనోజ్ అంటాడు ‘ మీకు బాడీగార్డు ఉన్నా.. మా ఆయనకు గుండె ధైర్యం ఉంది.. ఇప్పుడే ఫోన్ చేసి పిలుస్తాను. మీ మంచి గురించి చెబితే మీకు అర్థంకాదు.. అనుభవిస్తారు’ అని చెప్పి.. మీనా బాలుకి ఫోన్ చేస్తుంది. దీంతో.. బాలు వచ్చేస్తాడు. వెంటనే.. మీనా బయటకు వెళ్లి.. ఇంట్లో జరిగిన విషయం మొత్తం బాలుకి చెబుతుంది.
బాలు ఆవేశంగా ఇంటికి వచ్చి.. ‘ ఏరా.. నేను నీకు ఉత్తరాలు రాసి భయపెడుతున్నానా? చెప్పిన సన్యాసి ఎవరు? ముందు నీ సంగతి చెప్పి.. తర్వాత వాడి సంగతి చెబుతాను. రారా తేల్చుకుందాం’ అని బాలు అంటాడు. అంతేకాదు.. అందరిముందు.. మనోజ్ ని చితకబాదుతాడు. అయితే..వీళ్ల గొడవను సత్యం ఆపుతాడు. మీరు అసలు అన్నదమ్ములేనా..? అని సత్యం అంటే.. ‘ నా మీద నిందలు వేస్తే నేను ఊరుకోవాలా?’ అని బాలు అంటాడు. దీంతో.. మనోజ్ నా దగ్గర బాడీ గార్డు ఉన్నాడు.. నువ్వు నన్ను ఏం చేయలేవు అంటాడు. బాలు కొట్టడానికి వస్తుంటే.. బాడీ గార్డు ఆపుతాడు. దీంతో.. బాలు పనిలో పనిగా బాడీ గార్డుని కూడా చితకబాదుతాడు.ఆ దెబ్బలకు మనోజ్ కూడా పడిపోతాడు. అదంతా చూసి మీనా నవ్వుకుంటుంది. బాలు కొట్టిన దెబ్బలకు బాడీ గార్డు ఏడుస్తాడు. అతన్ని తిట్టి బయటకు పంపిస్తాడు. తర్వాత.. నాకు లెటర్స్ రాసి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్ అంటూ మనోజ్ బాలుని అడుగుతాడు. మళ్లీ అదే ప్రశ్న అడుగుతావా అంటూ.. బాలు కొట్టబోతుంటే.. ఇంట్లో వాళ్లు ఆపుతారు.
‘నాకు నీ మీదే అనుమానంగా ఉంది.. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏం చేయాలని అనుకుంటున్నారు?’ అని ప్రభావతి అంటుంది. ‘ మా ఆయన ఒక్క గుద్దు గుద్దితే చాలు.. మీ అబ్బాయి మంచినీళ్లు కూడా అడగరు’ అని మీనా బదులిస్తుంది. కానీ.. ప్రభావతి ఊరుకోదు. ఆ లెటర్ లో నా గురించి కూడా రాశాడు అని నానా రాద్దాంతం చేస్తుంది. ప్రభావతి నోరు మూయించిన బాలు.. విషయం ఏంటో రోహిణీని అడుగుతాడు. ఆమె జరిగింది చెబుతుంది. అయితే.. ఆ స్వామిజీ అబద్ధం చెప్పాడని.. అప్పుడే నన్ను పిలిస్తే వాడిని కొట్టి నిజం కక్కించే వాడిని కదా అని బాలు అంటాడు. ఈ మాటలకు ఇంట్లో అందరూ బాలు సపోర్ట్ చేస్తాడు. ఇక.. శ్రుతి, రవి అయితే.. రోహిణీ మీద అనుమానం వచ్చేలా మాట్లాడతారు. దీంతో.. రోహిణీ కవర్ చేస్తుంది. ఇంకోసారి లెటర్ వచ్చినప్పుడు చూద్దాం.. ఇప్పుడు వదిలేయమని సత్యం అంటాడు. దీంతో.. అందరూ వెళ్లిపోతారు.
ఇంట్లో జరిగిన హంగామా గురించి బాలు, మీనా చర్చించుకుంటారు. ఏదో తేడా కొడుతుందని, పార్లరమ్మకు కూడా ఏదో సంబంధం ఉందని బాలు అనుమానిస్తాడు. మీనా ఈ విషయం గురించి వదిలేయమని అంటే.. బాలు మాత్రం ఊరుకోడు. ఈ విషయం తేలాల్సిందేనని.. ఉత్తరాలు రాసింది ఎవరో నేను కూపీ లాగుతాను అని అంటాడు. ఆ మాటలు విన్న రోహిణీ.. ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది.
వెంటనే.. తన స్నేహితురాలు వింధ్యను కలుస్తుంది. దినేష్.. బాలుపేరు చెప్పి తనని ఇంకా పెద్ద సమస్యల్లోకి నెట్టాడు అని రోహిణీ ఫీలౌతుంది. చాలా సేపు ఆలోచించి.. శివ దొంగతనం చేసిన వీడియో బాలు ఫోన్ లో నుంచి మన దగ్గరకు వచ్చేలా చేసుకోవాలని అంటుంది. బాలు కారు బుక్ చేసుకొని.. బాలు ఫోన్ లో నుంచి వీడియో నీకు పంపించుకోమని రోహిణీ ప్లాన్ వేస్తుంది. వింధ్య నేను చేయలేను అని భయపడుతుంటే.. రోహిణీ.. తన కోసం ఆ మాత్రం చేయలేవా అని సెంటిమెంట్ గా గేమ్ ఆడుతుంది. ఇక.. తప్పక వింధ్య ఆ పని చేయడానికి ఒప్పుకుంటుంది. మరోవైపు బాలు.. ఆ స్వామిజీ కోసం వెతుకుతాడు. కానీ.. దొరకడు. అప్పుడే తనకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా ఆ దొంగ స్వామిజీ గురించి తెలుస్తుంది. అతను తీసిన వీడియో ద్వారా.. ఆ స్వామిజీ గెటప్ లో ఉన్నది దినేష్ అనే విషయం బాలుకి తెలిసిపోతుంది.
ఆ తర్వాత బాలు కారు వింధ్య బుక్ చేసుకుంటుంది. బాలు వింధ్యను కారు ఎక్కించుకుంటాడు. వింధ్య చెప్పిన ప్లేస్ కి బాలు తీసుకువెళుతూ ఉంటాడు. ఇక... రోహిణీతో నీకు స్నేహం ఎలా కుదిరింది అని బాలు అడుగుతాడు. నోటికి వచ్చింది ఏదో చెబుతుంది. తర్వాత... తన ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందని ఒక ఫోన్ చేసుకుంటాను అని బాలు ఫోన్ తీసుకుంటుంది. వీడియో కోసం వెతకడం మొదలుపెడుతుంది. కాసేపటి తర్వాత ఆ వీడియో వింధ్యకు దొరుకుతుంది. అదే సమయానికి.. మీనా ఫోన్ చేస్తుంది. దీంతో.. బాలు ఆ ఫోన్ లాక్కుంటాడు. మీనాతో ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటాడు. తర్వాత మనోజ్ కి లెటర్స్ రాసింది ఎవరో తనకు తెలిసిపోయిందని చెబుతాడు. ఆ మాట విని.. వింధ్య బయపడుతుంది. వీడియో ఎలాగైనా కొట్టేయాలని అనుకుంటుంది. కానీ.. ఈ లోగా.. ఆమె దిగాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది. వీడియో తీసుకోకుండానే దిగాల్సి వస్తుంది. తర్వాత.. జరిగిన విషయం మొత్తం రోహిణీకి ఫోన్ చేసి చెబుతుంది. ప్లాన్ ఫెయిల్ అయినందుకు రోహిణీ.. వింధ్యను తిడుతుంది. అంతేకాదు.. దినేష్ ని బాలు గుర్తుపట్టాడు అనే విషయాన్ని చెబుతుంది. ఆ మాటకు రోహిణీ భయంతో వణికిపోతుంది.
ఇక.. ఇంట్లో అందరూ భోజనానికి కూర్చొంటారు. అయితే.. మనోజ్, రోహిణీలకు మాత్రం మీనా భోజనం వడ్డించదు. మీనా తనకు భోజనం పెట్టలేదని మనోజ్ హర్ట్ అవుతాడు.‘ నేను ఇక్కడ ఉన్నాను కళ్లు కనిపించడం లేదా?’ అని అడుగుతాడు. ‘ నేను నా భర్త, అత్త మామలకు మాత్రమే వడ్డిస్తాను..’ అని మొహమాటం లేకుండా మీనా బదులిస్తుంది. అంతేకాదు.. ‘ రోహిణీ.. నీ మొగుడిని నా జోలికి రావద్దని చెప్పు.. తమ్ముడి భార్యతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? కడుపు నేను వండిందే కదా తింటున్నారు.. ఇదేనా మీరు నేర్పించిన సంస్కారం’అని మీనా మనోజ్, ప్రభావతి ని దులిపి వదిలేస్తుంది. వెంటనే సత్యం కూడా.. మీనాకి సపోర్ట్ గా మాట్లాడతాడు. ‘ నువ్వే వడ్డించుకో లేదంటే.. నీ భార్యను వడ్డించమని అడుగు’ అని చెబుతాడు. అప్పుడే బాలు వచ్చి.. ఎవరి మీద అరుస్తున్నావ్? ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదు అని చెబుతుంది. అయినా వినకుండా.. బాలు ఏమైంది? అని అడుగుతూనే ఉంటాడు. దీంతో.. మీనా కోపం తట్టుకోలేక.. గ్లాసు విసిరికొడుతుంది. మీనా యాక్షన్ కి మనోజ్ వణికిపోతాడు. నోరు తెరిస్తే.. నన్ను కొట్టేలా ఉందని భయపడతాడు. అయితే.. సత్యం.. అరవకుండా తిని వెళ్లమని బాలుకి చెబుతాడు. కానీ.. బాలు.. తేల్చాల్సిన లెక్కలు ఉన్నాయని.. మనోజ్ తో మాట్లాడటం మొదలుపెడతాడు.
ఆ ఉత్తరం నేనే రాశాను అన్నావ్ కదరా.. అని బాలు అంటే.. అవును నువ్వే రాశావు అని మనోజ్ అంటాడు. ‘ అయితే.. సాక్ష్యం చూపించు’ అని మీనా అంటుంది. ‘ మధ్యలో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావ్... ?’ అని ప్రభావతి అంటే.. మీనా కోపంగా.. ‘ మా ఆయనని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను’ అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు బాలు.. ఆ లెటర్ రాసింది.. అని చెప్పబోతుంటే.. నువ్వే రాసి ఉంటావ్ అని ప్రభావతి మళ్లీ అంటుంది. ఆ మాటలకు మీనాకి కోపం వచ్చి.. కోపంగా చూస్తే.. ప్రభావతి భయపడిపోతుంది. తర్వాత.. బాలు తాను గతంలో అరెస్టు చేయించిన వ్యక్తి అని చెబుతాడు. ‘ బాలు అరెస్ట్ చేయిస్తే.. గుణ అరెస్టు చేయించానని చెప్పాడేంటి?’ అని రోహిణీ ఆలోచనలో పడుతుంది. ‘ నేను మాత్రం వాడిని వదిలిపెట్టను..’ అని బాలు అంటే..పోలీసులకు కంప్లైంట్ చేయమని సత్యం అంటాడు. ‘ పోలీసులు ఎందుకు..?’ అని రోహిణీ అంటే.. ‘ ఎవరి కథలైనా బయటపడతాయనా?’ అని మీనా అడుగుతుంది. రోహిణీ ఏదో కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది.
ఇక.. రవి, శ్రుతి బండి మీద బయటకు వెళ్తుంటే.. మధ్యలో నీతూ కనపడుతుంది. తన కారు పని చేయడం లేదని... శ్రుతిని బండి దింపి మరీ.. వాళ్లిద్దరి మధ్యలో నీతూ కూర్చొంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.