
పెళ్లి ముహుర్తం దగ్గర పడుతోందని పెళ్లి కొడుకు వాళ్లు రామరాజు ఇంటికి వస్తారు. పెళ్లి కూతురు ఎక్కడ ఉంది అని అడుగుతారు. అయితే.. అమూల్య కనపడటం లేదు అని చెప్పడానికి రామరాజు ఇబ్బంది పడుతూ ఉంటాడు. లోపలికి రమ్మని.. ఒక విషయం గురించి మీతో మాట్లాడాలి అని రామరాజు అంటాడు. ‘ లోపలికి తీసుకువెళ్లి ఏమని చెబుతావ్ రా.. నా కూతురు లేచిపోయిందని చెవిలో చెబుతావా? అయినా లేచిపోవడం, లేపుకుపోవడం మీ కొంపలో వాళ్లకు కొత్తేమీ కాదు కదరా.. నీ దగ్గర నుంచి నీ పిల్లల దాకా అందరికీ వెన్నతో పెట్టిన విద్యే కదా.. మరి నీ కూతురు లేచిపోయిందని చెవిలో చెప్పడం ఎందుకు రా.. నీ కూతురు చేసిన ఘనకార్యం గురించి గొప్పగా , గర్వంగా చెప్పుకోరా’ అని భద్రావతి వచ్చి పరువు తీయాలని చూస్తుంది.
‘ అన్నయ్య.. ఆవిడ ఏంటి? అలా అంటున్నారు? అమూల్య లేచిపోయిందా ’ అని పెళ్లి కొడుకు తల్లి అడుగుతుంది. ‘ కూతురు లేచిపోయింది కాబట్టే.. కొంపలో ఉండాల్సిన వాళ్లు.. గుమ్మం ముందు నిల్చున్నారు’ అని సేనాపతి అంటాడు. దానికి రామరాజుకి కోపం వస్తుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని వార్నింగ్ ఇస్తాడు. ‘ ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడండి.. నా కూతురు లేచిపోయింది అన్నారు అంటే.. ఊరుకోను’ అని రామరాజు అంటాడు. ‘ అరెరె.. కూతురు లేచిపోయింది అనగానే కోపం వచ్చిందా? అది లేచిపోకపోతే.. నీ కూతురు.. అదే కొత్త పెళ్లి కూతురు ఎక్కడరా?’ అని భద్రావతి అడుగుతుంది. ‘ నిజా నిజాలు తెలీకుండా నోటికి ఏది వస్తే.. అది మాట్లాడొద్దు’ అని వేదవతి తన పుట్టింటి వాళ్ల పై సీరియస్ అవుతుంది.
‘ ఏంటి వదిన ఇదంతా.. వాళ్లేమో.. మీ అమ్మాయి లేచిపోయింది అంటున్నారు.. మీరేమో కనిపించడం లేదు అంటున్నారు..అసలు ఏం జరుగుతోంది ఇక్కడ’ అని పెళ్లి కొడుకు తల్లి అడుగుతుంది. ‘ నువ్వేంటమ్మా.. ఇంత అమాయకురాలిలా ఉన్నావ్..కుక్క పిల్ల కనపడకపోతే తప్పిపోయింది అంటారు.. కాసేపట్లో పెళ్లి మండపానికి వెళ్లాల్సిన పెళ్లి కూతురు కనపడకపోతే లేచిపోయింది అనే అంటారు.. ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోకపోతే ఎలాగమ్మా’ అని భద్రావతి అంటుంది. ఆ మాటకు రామరాజుకి విపరీతంగా కోపం వస్తుంది. ‘ ఇంకోసారి నా కూతురు లేచిపోయింది అన్నావ్ అంటే ఊరుకోను’ అని వాళ్ల మీద వెళతాడు. అయితే.. ‘ లేచిపోకపోతే.. మీ కూతురు ఎక్కడండి? మీ కూతురు లేచిపోకపోతే ఎక్కడికి వెళ్లింది? ఎవరికి చెప్పి వెళ్లిందో చెప్పండి ’ అని పెళ్లి కొడుకు తల్లి అడిగిన ప్రశ్నకు రామరాజు ఆగిపోతాడు.‘ చెల్లెమ్మా.. ఏదో జరిగింది... మా కూతురు ఎక్కడికి వెళ్లిందో.. అసలు ఏం జరిగిందో మేం తెలుసుకుంటాం’ అని రామరాజు ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు.. కానీ పెళ్లి కొడుకు తల్లి వినిపించుకోదు. ‘ కూతురు లేచిపోయిందనే విషయం తెలిసిపోయినా కూడా.. మిమ్మల్ని ఇంకా పిచ్చి వాళ్లను చేయాలని చూస్తున్నారా?’ అని సీరియస్ అవుతుంది. పెళ్లి కొడుకు తల్లీ, తండ్రీ.. ఇద్దరూ రామరాజు, వేదవతిలను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు.. దారుణంగా నిలదీస్తారు.. ఎవరినో ప్రేమించిన విషయం దాచి.. మాకు అంటగట్టాలని చూస్తారా? అని తక్కువ చేసి మాట్లాడతారు. మీ కూతురు కారణంగా మా పరువు పోయిందని వారు సీరియస్ అవుతారు. కూతురుని పెంచడం చేతకాలేదని.. ఏం పెంపకం నీది అంటూ ప్రశ్నిస్తారు.
‘ లేచిపోవడం వీళ్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి.. వీడే దగ్గరుండి మరీ కూతురుని లేచిపోమ్మని చెప్పి ఉంటాడు’ అని సేనాపతి అనడంతో.. రామరాజు ముగ్గురు కొడుకులు ఆవేశంగా వెళ్లి సేనాపతి చొక్కా పట్టుకుంటారు. ‘ మా చెల్లెలు కనపడకపోవడానికి మీ కొడుకే కారణం.. వాడు ఎక్కడున్నాడో చెప్ప రా’ అంటూ నిలదీస్తారు. అప్పుడే.. విశ్వ.. అమూల్యను తీసుకొని కారులో అక్కడికి వస్తాడు. ముందుగా.. కారులో నుంచి విశ్వ దిగుతాడు. చేతికి మల్లెపూలు చుట్టుకొని.. నవ్వుకుంటూ నడుచుకుంటూ వస్తాడు. భద్రావతి చాలా సంబరంగా చూస్తూ ఉంటుంది. భాగ్యం, ఇడ్లీ.. తమ పేర్లు బయటపడతాయేమో అని భయపడుతూ ఉంటారు.
విశ్వ రాగానే... ముగ్గురు అన్నదమ్ములు వెళ్లి.. విశ్వని కొడతారు.. మా చెల్లి ఎక్కడ ఉంది? అని అడుగుతారు. ‘ ఏంట్రా.. మీ చెల్లెలు కావాలా? ప్రస్తుతం మీచెల్లెలు పరిస్థితి.. ఈ మల్లెపూల లాగే నలిగిపోయింది.. నేనేమి మీ చెల్లెలిని తీసుకెళ్లలేదు. తనంతట తానే నా దగ్గరకు వచ్చింది..మీకు కోపం వచ్చినా? అవమానంతో గుండె పగిలి చచ్చినా ఇది నిజం. మీ చెల్లెలు రాత్రంతా నాతోనే ఉంది’ అంటాడు. ఆ మాటకు రామరాజుకి కోపం వచ్చి.. విశ్వ చెంప మీద లాగి ఒక్కటిస్తాడు. ‘ ఏం కూసావ్ రా.. చంపేస్తాను.. ఇంకొక్క మాట నా కూతురు గురించి తప్పుగా మాట్లాడావ్ అంటే చంపేస్తాను.. ఏం అనుకుంటున్నావ్ రా ఈ రామరాజు కూతురు అంటే.. ప్రాణం పోయినా నా కూతురు తప్పు చేయదు.. నా పరువు పోయే పని చేయదు’ అని రామరాజు అంటాడు. ‘ అవునా.. ప్రాణం పోయినా నీ కూతురు తప్పు చేయదా? నీ పరువు పోయేలా చేయదా? ఒక్క నిమిషం.. ఇదే మాట ఇంకొన్ని నిమిషాల తర్వాత ఇంతే ధైర్యం చెప్పు’ అని.. కారులో నుంచి అమూల్యను కిందకు దింపుతాడు.
అమూల్యను విశ్వతో పాటుు చూసి రామరాజు ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది. ‘ నీ కూతురు రాత్రంతా నాతో ఉంది.. నాతో గడిపింది అని చెప్తే.. మీరు నమ్మలేదు కదా.. మరి ఇప్పుడేం అంటారు?’ అని విశ్వ అడుగుతాడు. ‘ రాత్రి నాకోసం వచ్చేసింది.. రాత్రి ఇద్దరం చాలా సరదాగా గడిపాం.. చాలా భద్రంగా.. చాలా జాగ్రత్తగా.. మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకువచ్చాను.. నేను ఎంత మంచి వాడినో కదా.. అవును రామరాజు.. మామూలుగా అయితే.. నీ కూతురిని ఇలా చూడగానే నువ్వు గుండె పగిలి చావాలి కదా.. ఇలా ఉన్నావ్ అంటే నీ గుండె గట్టిదే.. కానీ, ఇక మీదట చేస్తావ్.. ఈ రోజు నుంచి మానసికంగా చస్తావ్ ఎందకంటే.. ఒక రోజంతా నీ కూతురు నాతో ఉంది.. అయినా సరే.. నేను నీ కూతురిని పెళ్లి చేసుకోను.. నాతో తిరిగిన దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు.. పెళ్లి పెటాకులు లేకుండా మిగిలిపోయిన కూతురిని రోజూ చూసుకుంటూ అవమానంతో గుండె పగిలి చస్తావ్ రా’ అని విశ్వ అంటాడు.
‘ రేయ్.. నువ్వు ఏవే మాయ మాటలు చెప్పి.. నా చెల్లెలిని తీసుకుపోయి ఉంటావ్.. ఏ పాపం చేయని నా చెల్లెలి మీద తప్పు చేశావ్ అనే ముద్ర వేస్తావేంటి రా?’ అని ధీరజ్, సాగర్ అంటారు. ఆవేశంగా విశ్వని కొట్టడానికి ముందుకు వెళ్తుంటే.. అమూల్య ఆగండి.. అని ఆపుతుంది.
‘ మెడలో తాళి బయటకు తీసి.. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం’ అని చూపిస్తుంది. విశ్వతో పాటు అందరూ షాక్ అవుతారు. ‘ రేయ్ విశ్వ.. ఏంట్రా ఇది.. నువ్వు తనని పెళ్లి చేసుకున్నావా?’ అని భద్రావతి అడుగుతుంది. ‘ లేదు అత్తా.. నేను తనని పెళ్లి చేసుకోలేదు.. జస్ట్ మేము రాత్రంతా సరదాగా గడిపాం అంతే’ అని చెప్పిన విశ్వ.. ‘ ఏయ్.. ఏంటి డ్రామాలు ఆడుతున్నావ్? నీ మెడలో నేను ఎందుకు తాళి కడతాను.. నాకు బుద్ధి లేదా?’ అని అమూల్యను విశ్వ అడుగుతాడు. వెంటనే భద్రావతి పెద్దమ్మ విశ్వ చెంప పగలకొడుతుంది.‘ మీరు పెళ్లి చేసుకోకుండా .. పెళ్లి చేసుకున్నాం అని ఆ అమ్మాయి ఎందుకు చెబుతుంది? మీరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు.. మరి తమాషాలు చేస్తావేంటి?’ అని నిలదీస్తుంది.
‘ లేదు పెద్దమ్మా.. విశ్వ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు.. ఆ విషయం నాకు తెలుసు’ అని భద్రావతి అంటే.. ‘ నువ్వు నోర్మూయి.. మాట్లాడకు.. వాళ్లు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు.. వాళ్లకు నచ్చిన జీవితాన్ని వాళ్లను బతకనివ్వండి.. ఈ గొడవలతో , పాత పగలతో వాళ్ల జీవితాలను ఇబ్బంది పెట్టకండి’ అని పెద్దమ్మ అంటుంది. ఇక.. అమూల్య ముగ్గురు అన్నలు.. మాచెల్లెలిని మాయ చేశావ్ అంటూ... విశ్వని చావగొడతారు. కానీ ఆ ముసలమ్మ ఆపుతుంది.
అమూల్య.. తన పేరెంట్స్ దగ్గరకు వెళ్తుంది.‘ నాన్న. చాలా పెద్ద తప్పు చేశాను నాన్న.. నన్ను క్షమించండి..’ అని రామరాజు కాళ్లు పట్టుకోవాలని అనుకుంటుంది.. కానీ రామరాజు వెనక్కి వెళ్లిపోతాడు. దీంతో.. తల్లి కాళ్ల మీద పడుతుంది. వేదవతి.. అమూల్య చెంప పగలకొడుతుంది. ‘ నువ్వెంత.. నీ వయసు ఎంత? లేచిపోయి పెళ్లి చేసుకునేంత పెద్దదానివి అయిపోయావా? వాడు నిన్ను ప్రేమ పేరుతో మోసం చేస్తున్నాడే.. గుడ్డిగా నమ్మి.. నీ జీవితాన్ని నాశనం చేసుకోకే అని దండం పెట్టి మరీ చెప్పాము... మా మాట వింటాను అని చెప్పి, మేము చూసిన సంబంధం చేసుకుంటాను అని మాట ఇచ్చి.. మిమ్మల్ని నడి వీధిలో నిలపెట్టావ్ ’ అంటూ..అమూల్యను దారుణంగా కొడుతుంది. వేదవతిని పెద్దమ్మ ఆపుతుంది.. ‘నీ ఇంట్లో కూతురు చేసింది తప్పు అయితే.. పాతికేళ్ల క్రితం నువ్వు చేసింది ఏంటి? మీరు పగలు, పంతాలతో కొట్టుకు చస్తున్నాసరే.. ఆ దేవుడు.. ఈ ఇంటి అమ్మాయిని.. మీ ఇంటి కోడలిగా..మీ ఇంటి అమ్మాయిని.. ఈ ఇంటి కోడలిగా చేశాడు.. అది అర్థం చేసుకొని.. ఇప్పటికైనా రెండు కుటుంబాలు కలవండి’ అని చెప్పి.. అమూల్యను పెద్దావిడ ఇంట్లోకి తీసుకువెళ్తుంది. ఇక.. పెళ్లి వాళ్లు.. రామరాజుని దారుణంగా తిట్టి.. అక్కడి నుంచి వెళ్లిపోతారు. తమ పేర్లు బయట పడనందుకు.. శ్రీ వల్లి సంతోషిస్తుంది.
ఇక.. అమూల్య, విశ్వలకు హారతి ఇవ్వమని రేవతికి పెద్దావిడ చెబుతుంది.భద్రావతి, సేనాపతి వద్దు అని చెప్పినా.. పెద్దావిడ వాళ్లను తిట్టి.. హారతి ఇప్పిస్తుంది.ఇక రామరాజు ఇంట్లో అందరూ కూర్చొని బాధపడుతూ ఉంటారు. భద్రావతి చాలా ఆవేశంగా ఇంట్లో వస్తువులన్నీ విసిరేస్తుంది. నర్మద, ప్రేమ ఏదో చెప్పాలని చూసినా భద్రావతి వినదు.. బాగా ఏడుస్తుంది. రామరాజు నిస్సహాయ స్థితిలో కూర్చుండిపోతాడు. అమూల్య ఎక్కడ అని పిలుస్తూ ఉంటాడు.
కమింగప్ లో.. నా బిడ్డను వాళ్లు చంపేస్తారు.. అని పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తూ.. పడిపోతాడు. అమూల్య.. ఎడమ కాలు పెట్టి.. భద్రావతి ఇంట్లో అడుగుపెడుతుంది. రామరాజు పడిపోతే..హాస్పిటల్ కి తీసుకువెళ్లడం చూసి.. భద్రావతి, సేనాపతి సంబరపడిపోతారు.