Tollywood: యూట్యూబ్‌లో ఫోక్ పాటలతో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్‌గా, నటుడు ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'ఇడుపు కాయితం'. ఈ సినిమా టైటిల్ ప్రకటించగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెర తీసింది.
'ఇడుపు కాయితం' అనేది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చాలాకాలంగా వినిపించే సంప్రదాయ పదం. దీని అర్థం విడాకుల ఒప్పంద పత్రం. ఒకప్పుడు భార్యాభర్తలు కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయించుకుంటే, కోర్టుల ద్వారా కాకుండా గ్రామ పెద్దల సమక్షంలో పరస్పర అంగీకారంతో ఒక పత్రం రాసుకుని విడిపోయేవారు. ఆ పత్రాన్నే స్థానికంగా "ఇడుపు కాయితం" అని పిలిచేవారు. తెలంగాణ మాండలికంలో "ఇడుపు" లేదా "ఇడుసు" అంటే వదిలేయడం, విడిచిపెట్టడం అనే భావం వస్తుంది. అందుకే విడిపోతున్నామని ధృవీకరించే పత్రానికి ఈ పేరు వచ్చింది. ప్రస్తుతం చట్టపరమైన విడాకుల ప్రక్రియ అందుబాటులోకి రావడంతో ఈ ఆచారం దాదాపు కనుమరుగైనప్పటికీ, కొన్ని గ్రామాల్లో ఈ పదం ఇప్పటికీ వినిపిస్తుంటుంది.
24
టైటిల్‌తో మొదలైన సోషల్ మీడియా చర్చ
సినిమా టైటిల్ ప్రకటించగానే చాలామంది "ఈ పదం అర్థమేంటి?" అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొందరు నెటిజన్లకు ఈ పదం కొత్తగా అనిపించింది. అయితే కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో దీనిపై ఫన్న కామెంట్స్ చేయడం వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఎక్స్ లో ఓ యూజర్ పోస్ట్ చేస్తూ.. "ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఉంటుందా?" అంటూ పోస్టులు చేయగా చర్చకు తెర తీసింది. ఈ చర్చ క్రమంగా భాష, మాండలికాల వైవిధ్యంపై చర్చకు దారి తీసింది. ప్రతి ప్రాంతానికీ ప్రత్యేకమైన పదాలు ఉంటాయని, వాటిని ఎగతాళి చేయడం కంటే వాటి అర్థాన్ని తెలుసుకోవడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
34
ఘంటా చక్రపాణి స్పందనతో మరింత వేడెక్కిన వివాదం
ఈ టైటిల్‌పై వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సోషల్ మీడియాలో స్పందించారు. "ఇడుపు కాయితం అంటే విడిపోయే సమయంలో రాసుకునే పత్రం. అర్థం తెలియకపోతే విమర్శించడం ఎందుకు?" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ పోస్టుకు మద్ధతుగా చాలామంది తెలంగాణ నెటిజన్లు స్పందించగా, మరికొందరు భాషా వైవిధ్యాన్ని గౌరవించాలని సూచించారు. దీంతో సినిమా టైటిల్ చుట్టూ సాగుతున్న చర్చ మరింత విస్తరించింది.
ఇడుపు కాయితం పేరులో, భావంలో స్పష్టత ఉంది. విడిపోయే కాగితం అని. విడిపోయేటప్పుడు రాసుకునే ఒక పత్రమది. ఎందుకురా ఇంత ఓర్వలేని తనం. మరి “విడాకులు” లో ఏముందిరా! ఆకులా? అర్థంకాకపోతే మూసుకోండి. సబ్ టైటిల్స్ ఉండవు. చూడకండి! pic.twitter.com/Qk9Dl5oaTc
— Prof. Chakrapani Ghanta (@GhantaC) June 26, 2026
సాధారణంగా సినిమా టీజర్ లేదా ట్రైలర్ విడుదలైన తర్వాతే చర్చ మొదలవుతుంది. కానీ 'ఇడుపు కాయితం' విషయంలో టైటిల్ ఒక్కటే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమా కథపై కూడా ఆసక్తి పెరిగింది. టైటిల్ చూస్తుంటే తెలంగాణ గ్రామీణ జీవితం, కుటుంబ బంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో కథ సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ప్రారంభ దశలోనే ఈ స్థాయిలో ప్రచారం రావడం చిత్రబృందానికి కలిసొచ్చే అంశంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే... "ఇడుపు కాయితం" అనే టైటిల్ వెనుక దర్శకుడు ఎలాంటి కథను దాచారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.