ఐబొమ్మ అసలు దొంగ దొరికాడు, తెలుగు సినిమాకు పైరసీ ముప్పు తప్పినట్టేనా?

Published : Nov 15, 2025, 11:52 AM IST

iBomma Owner Ravi Arrested : ఇంతకాలం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ముప్పుతిప్పలు పెట్టిన ఐబొమ్మ అసలు దొంగ దొరికాడు. కొత్త సినిమాలు పైరసీ చేసి... ఇండస్ట్రీకి కొరకరాని కొయ్యగా మారిన ఐబొమ్మ ఓనర్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

PREV
15
ఐబొమ్మ అసలు దొంగ దొరికాడు

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎప్పటి నుంచో వేధిస్తున్న అతి పెద్ద సమస్య పైరసీ. సినిమా రిలీజ్ అయిన తెల్లారే.. పైరసీ వెర్షన్ వెబ్ సైట్లలో ప్రత్యక్షం అవ్వడంతో.. సినిమాలకు ఎంతో నష్టం జరుగుతోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఐబొమ్మ వెబ్ సైట్ కొరకరాని కొయ్యగా మారింది. సినిమాలని పైరసీ చేసి.. హైక్వాలిటీలో.. యూజర్లకు ఫ్రీగా అందుబాటులో ఉంచుతోంది ఐబొమ్మ. ఈక్రమంలో ఐబొమ్మ అసలు హెడ్ ను తాజాగా  పోలీసులు అరెస్ట్ ట్ చేశారు. ఆ మధ్య హైదరాబాద్ పోలీసులు ఈ పెద్ద రాకెట్ ని ఛేదించి.. దీనికోసం పనిచేస్తున్న కొందరిని అరెస్ట్ చేశారు. తాజాగా ప్రాన్స్ నుంచి వచ్చిన ఐబొమ్మ యజమాని ఇమ్మడి రవిని హైదరాబాద్ కూకట్ పల్లి సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడే పైరసీని ఆపరేట్ చేస్తున్న రవి మీద.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ల నుంచి చాలా ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఎప్పటినుంచో అతన్ని పట్టుకోవాలని కాపు కాచిన పోలీసులు, ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. రవి నుంచి మరిన్ని విషయాలు విచారణలో బయట పడబోతున్నాయి. అంతే కాదు అతని బ్యాంకు అకౌంట్లలో ఉన్న మూడు కోట్ల రూపాయలను సీజ్ చేసినట్టు సమాచారం.

25
టాలీవుడ్ పెద్దలు స్పెషల్ ఫోకస్

టాలీవుడ్ పెద్దలు గతంలో చాలా సార్లు ఐబొమ్మ ఆటకట్టించడానికి ప్రయత్నించారు. పోలీసులతో కలిసి ప్రత్యేకంగా ఆఫరేషన్ కూడా చేశారు. ఈ విషయంపై హైదరాబాద్ పోలీస్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టడంతో.. టాలీవుడ్ పెద్దలతో కలిసి ఈ విషయంపై పనిచేస్తున్నారు. అయితే వారు ఎంత ప్రయత్నం చేసినా.. ఇతర పైరసీ సైట్స్ ను క్లోజ్ చేయగలిగారు కానీ, ఐ బొమ్మ సైట్ ను ఏమీ చేయలేకపోయారు. విదేశాల నుంచి ఈ నెట్ వర్క్ ను నడిపిస్తుండటంతో.. దాన్ని నిర్మూలించడం సాధ్యపడలేదు. రీసెంట్ గా తెలంగాణ పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇతర పైరసీ వెబ్ సైట్ల ఆటకట్టించిన పోలీసులు.. చాలా జఠిలంగా తయారయిన ఐబొమ్మపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.

35
పోలీసులకు దొరకకుండా దొంగాట..

ఆన్ లైన్ పైరసీ ఎక్కువ శాతం టొరెంట్ లింక్స్, టెలిగ్రామ్ యాప్స్ ఆపరేట్ చేసేవి.. కొంత మంది మాత్రమే వీటిని డౌన్లోడ్ చేసుకునేవారు. గతంలో సామాన్యులకు పైరసీ సినిమాలు అందుబాటులో ఉండేవి కావు.. కానీ ఇలాంటి వారిని కూడా టార్గెట్ చేసుకుని తెచ్చిన సులభతరమైన యాప్ ఐ బొమ్మ. ఇది అతి తక్కువ టైంలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. విదేశాల్లో ఉంటూ.. పోలీసులకు, చట్టానికి దొరకుండా.. సినిమాలు పైరసీ చేసి.. క్వాలిటీతో  ఉచితంగా ఐ బొమ్మ యాప్ లో పెడుతున్నారు. వీరిని పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. విదేశీ చట్టాల్లోని లొసుగులు వాడుకుంటూ వారు ఇన్నాళ్లు తప్పించుకుంటూ ఉన్నారు.

45
టాలీవుడ్ కు ఐబొమ్మ వార్నింగ్ నిజమేనా?

ఆమధ్య ఐబొమ్మ ఘాటుగా టాలీవుడ్ కి, పోలీసులకు వార్నింగ్ ఇచ్చిందంటూ స్క్రీన్‌షాట్‌లు  వైరల్ అయ్యాయి. పోలీసులు ఐబొమ్మ, బొప్పమ్ లాంటి పైరసీ వెబ్ సైట్లని తొలగించే ప్రయత్నం మొదలు పెట్టారు. దీనితో ఐబొమ్మ టాలీవుడ్ కి, పోలీసులకు వార్నింగ్ ఇస్తూ కొన్ని కామెంట్స్ చేసినట్టు స్క్రీన్ షాట్లస్ లో కనిపించింది. మీరు ఐబొమ్మ మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మి ఆ తర్వాత ఏమీ పట్టనట్లు ఓటీటీలో ఎలా సొమ్ము చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో మాపై ఫోకస్ చేస్తున్నారు. అసలు హీరోలకు అంత భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి ఎందుకు సినిమాలు చేస్తున్నారు. విదేశాల్లో షూటింగ్స్ చేయాల్సిన అవసరం ఏంటి.. అనవసర బడ్జెట్ భారం తప్ప అంటూ వైరల్ అవుతున్న వార్నింగ్ ఇచ్చినట్టు స్క్రీన్‌షాట్‌లలో కనిపించింది.

55
అసలు నిజం చెప్పిన ఏసియా నెట్

ఐబొమ్మ సంస్థ తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ఏసియా నెట్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లు 2023 నాటివి. ఐబొమ్మ అప్పట్లో కూడా పోలీసులని ఉద్దేశించి ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు. అవి తెలుగు చిత్ర పరిశ్రమని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. అప్పట్లో ఏసియా నెట్ ఈ వార్తని కవర్ చేసింది. అప్పటి స్క్రీన్ షాట్స్ ని కొన్ని మీడియా సంస్థలు ఆమధ్య వైరల్ చేశాయి. వాస్తవం మాత్రం ఐబొమ్మ సంస్థ పోలీసులకు ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదు. ఇక తాజాగా ఐబొమ్మ అసలు దొంగ దొరకడంతో.. ఈ సైట్ డొంక అంతా కదిలే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories