ఒక స్టార్ హీరో కావడం చాలా కష్టం. ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. స్టార్ కిడ్స్ కి ఈ విషయంలో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే తనదైన మార్క్ చూపినప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు. కాగా రాజకీయాల్లో, సినిమాల్లో వారసత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తారు. కార్యకర్తలు, అభిమానులు మాత్రం అదే కోరుకుంటారు.
ఒక స్టార్ హీరో కొడుకు స్టార్ కావాల్సిందే. మొదటి తరం స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు వారసులు తెలుగు పరిశ్రమను ఏలుతున్నారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ నెపో కిడ్స్ అనడంలో సందేహం లేదు. నటనలో, డాన్సులతో, డైలాగ్ డెలివరీలో విభిన్నత చూపించి అభిమానులను సంపాదించుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య నట వారసత్వాన్ని నిలబెట్టాడు. నందమూరి ఫ్యామిలీ నుండి తిరుగులేని స్టార్డం, అత్యధిక మార్కెట్ సంపాదించిన హీరో అయ్యాడు. చెప్పాలంటే.. నందమూరి రెండో తరం హీరో బాలకృష్ణను మించిపోయాడు. ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్. దేశంలోనే టాప్ డాన్సర్స్ లో ఒకరు. నటన, అద్భుతమైన డైలాగ్ డెలివరీ అతని సొంతం.
ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ ఫేమ్ రాబట్టాడు. పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కేవలం రాజమౌళి సినిమా కావడం వలనే ఆర్ ఆర్ ఆర్ నార్త్ లో ఆడిందనే అపవాదును దేవర తో పోగొట్టుకున్నాడు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన దేవర మిక్స్డ్ టాక్ తో సైతం రూ. 466 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. హిందీ వెర్షన్ రూ. 58 కోట్ల మార్కుని చేరుకుంది.
ఎన్టీఆర్ కి నార్త్ లో ఫేమ్ ఉంది. అతడు పాన్ ఇండియా హీరో ట్యాగ్ కి అర్హుడే అని దేవర ఫలితం నిరూపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్, హిందీలో దేవర బ్రేక్ ఈవెన్ దాటేసింది. కాగా ఎన్టీఆర్ కి ఇద్దరు కుమారులు. అభయ్ రామ్, భార్గవ్ రామ్. భవిష్యత్ లో వీరిద్దరూ హీరోలు కావాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటారు. వారు ప్రస్తుతానికి చిన్నపిల్లలు అయినప్పటికీ... అభిమానుల మదిలో మెదిలే ఆలోచన అదే.
అయితే అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఖచ్చితంగా హీరోలు కావాలని తాను కోరుకోవడం లేదని ఎన్టీఆర్ అంటున్నారు. అది వాళ్ళ ఛాయిస్. నేను మాత్రం నా ఆలోచనలు వారి మీద రుద్దను, అన్నారు. వాళ్ళకంటూ ఓ స్వేచ్ఛా ప్రపంచం ఇస్తాను. కోరుకున్నది చేయనిస్తాను. రాజకీయాల్లో, సినిమాల్లో వారసత్వం కోరుకోవడం సహజమే, కాకపోతే పిల్లల అభిప్రాయం ముఖ్యం అన్నారు.
నేను నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్, క్లాసికల్ డాన్సర్. అనేక ప్రదర్శనలు ఇచ్చాను. తర్వాత నటుడిగా మారాను, అన్నారు. ఎన్టీఆర్ కామెంట్స్ పరిశీలిస్తే.. హీరోలు కావాలా? వద్దా? అనేది ఇద్దరు కొడుకుల ఛాయిస్. ఒకవేళ మాకు ఇష్టం లేదంటే, ఆయన బలవంత పెట్టరని చెప్పకనే చెప్పారు.
మోక్షజ్ఞకు ఇష్టం లేకపోయినా... బాలకృష్ణ బలవంతం చేశాడనే వాదన ఉంది. మోక్షజ్ఞ మనసు మారాలని ఆయన యజ్ఞ యాగాదులు కూడా చేశాడట. ఎట్టకేలకు ఓ ఏడాది క్రితం మోక్షజ్ఞ ఓకే చెప్పారట. అప్పటి నుండి షేప్ అవుట్ బాడీని ఫిట్ బాడీగా మార్చాడు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మోక్షజ్ఞ లుక్ కి మిశ్రమ స్పందన దక్కింది. బాలయ్య మాదిరి పిల్లలను బలవంతం చేయనని ఎన్టీఆర్ చురకలు వేశాడా.. అనే సందేహం కలుగుతుంది..