కల్కి 2898 ఎడి చిత్రంతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని ప్రభాస్ షేక్ చేశాడు. బాహుబలి తర్వాత మరోసారి ప్రభాస్ కి ఆ రేంజ్ హిట్ దక్కింది. దీనితో తదుపరి చిత్రాలు ఇంకా భారీగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తారు. హను రాఘవపూడి దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంలో నటించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
ఇంతలో మారుతి దర్శకత్వంలోని రాజా సాబ్ చిత్రం పూర్తి చేయాల్సి ఉంది. రాజా సాబ్ మూవీ హర్రర్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్ర నిర్మాత టిజి విశ్వప్రసాద్ రాజా సాబ్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు.
రాజా సాబ్ చిత్రం కోసం ఇండియాలోనే అతిపెద్ద ఇండోర్ సెట్ నిర్మించినట్లు విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఇంత భారీ సెట్ ని ఇంతవరకు ఎవరూ నిర్మించలేదు. 40 వేల చదరపు అడుగుల ఫ్లోర్ లో ఈ సెట్ ని నిర్మించినట్లు తెలిపారు. ఇదికాక ఇంకా చాలా సెట్లు ఉన్నాయి. కానీ సినిమా ఎక్కువ భాగం జరిగేది ఈ సెట్ లోనే. ఇప్పటి 50 శాతం షూటింగ్ పూర్తయిందని విశ్వప్రసాద్ తెలిపారు.
అక్టోబర్ ఎండింగ్ కి టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఆ తర్వాత సాంగ్స్ షూటింగ్ ఉంటుంది అని అన్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పార్లల్ గా సాగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.