
సినిమాలో చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు హీరోలంటే పాజిటివ్‌గా ఉండే పాత్రలు, మంచి చేసే పాత్రలుగా ఉండేవి. విలన్లు అంటే చెడు తలపెట్టేవారు. కానీ ఇప్పుడు హీరోలే విలన్లుగా చేస్తున్నారు. నెగిటివ్ రోల్స్ తోనూ హీరోయిజం పలికిస్తున్నారు. `పుష్ప`, `కేజీఎఫ్`లోని హీరో పాత్రలు ఆ కోవకు చెందినవే. అంతేకాదు హీరోయిన్ పాత్రల్లోనూ ఆ మార్పులు కనిపిస్తున్నాయి. హీరోయిన్లు సినిమా మొత్తం గ్లామరస్‌గా కనిపిస్తూ, హీరోతో డ్యూయెట్లు పాడుతూ కనిపిస్తున్నారు. కానీ అనూహ్యంగా క్లైమాక్స్ లో విలనిజం చూపిస్తూ షాకిస్తున్నారు. ట్విస్ట్ లతో దుమ్మురేపుతున్నారు.
`ఆర్‌ఎక్స్ 100` నుంచి ఇదే కొనసాగుతుంది. ఇలాంటి ట్రెండ్‌కి ఈ మూవీ ఆజ్యం పోసిందని చెప్పొచ్చు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించారు. కన్నడ నటుడు రాంకీ, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. రా లవ్ స్టోరీగా, యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ 2018లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కేవలం రెండు కోట్లతో రూపొంది ఏకంగా రూ.25కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ సక్సెస్‌ని ఎవరూ ఊహించలేదు. అందరికీ ఒక షాకిచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇందులోని హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్ రోలే అందరిని ఆశ్చర్యపరిచింది. చివరి వరకు హీరోయిన్‌గా పాజిటివ్‌గా కనిపిస్తూ చివర్లో నెగటివ్‌గా మారుతుంది. ఆ ట్విస్ట్ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. దీంతో వరుసగా పలు సినిమాలు ఈ కాన్సెప్ట్ తోనే వచ్చాయి. కానీ `ఆర్‌ఎక్స్ 100`ని కొట్టలేకపోయాయి.
కానీ ఆ తర్వాత కొంత గ్యాప్‌తో ఇప్పుడు అలాంటి సినిమాల జోరు నడుస్తుంది. మొన్న విడుదలైన `కాంతార 2`, అంతకు ముందు వచ్చిన `కింగ్డమ్`, `హరి హర వీరమల్లు`, అలాగే `విరూపాక్ష` చిత్రాలు కూడా అదే కోవలో వచ్చాయి. మొన్న విడుదలైన `కాంతారః చాప్టర్ 1`లో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించారు. దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ హిట్ టాక్‌ని తెచ్చుకుంది. కాకపోతే ఇది మొదటి భాగం `కాంతార` రేంజ్‌లో లేదనే ప్రచారం జరుగుతుంది. కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ రుక్మిణి వసంత్.. యువరాణి పాత్రలో నటించింది. చివరి వరకు హీరోతో డ్యూయెట్ పాడుతుంది. లవ్‌లో ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో తన నిజ స్వరూపం చూపిస్తుంది. విలన్‌గా మారి హీరో అంతానికి ప్రయత్నిస్తుంది. క్లైమాక్స్ మూవీకి హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. ఆమె పాత్రలోని ట్విస్ట్ అదిరిపోయింది.
అంతకు ముందు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `కింగ్డమ్` మూవీ డీసెంట్‌గా ఆడింది. కమర్షియల్‌గా సత్తా చాటలేదనే కామెంట్ వినిపించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో విజయ్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. కోస్టల్ ప్రాంతం నుంచి ఓ తెగ అప్పటి బ్రిటీష్ వారి దాడులకు తట్టుకోలేక శ్రీలంకకి పారిపోతారు. అక్కడ స్మగ్లర్ల కింద పనిచేస్తారు. అందులోని నాయకుడిని, స్మగ్లర్లని పట్టుకునేందుకు పోలీస్ అయిన విజయ్ మారు వేషంలో వెళ్తాడు. అక్కడ ఆసుపత్రిలో హీరోయిన్ పరిచయం అవుతుంది. ఇద్దరు క్లోజ్ అవుతారు. ప్రేమలో పడతారు. తన అన్నని విలన్లు చంపే సమయంలో హీరోని మాయ చేస్తుంది హీరోయిన్. అక్కడ తన విలనిజం చూపించి షాకిస్తుంది. ఆమె ఇచ్చిన ట్విస్టే సినిమా కథని మార్చేస్తుంది. అయితే ఇందులో ఆమె సీన్లని బలంగా చూపించలేదు. రెండో పార్ట్ లో అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపిస్తూనే విలన్‌గా మారడం విశేషం.
అంతకు ముందు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన `హరి హర వీరమల్లు`లో కూడా హీరోయిన్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించింది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జులైలో విడుదలైంది. ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ మొదట వీరమల్లుతో లవ్ ట్రాక్ నడిపిస్తుంది. పెద్ద డ్రామా ఆడుతుంది. చివరికి వజ్రాలు తీసుకుని పారిపోతుంది. ఏకంగా హీరోనే కొట్టి పారిపోవడం విశేషం. ఫస్టాఫ్‌లోనే వచ్చే ఈ ట్విస్ట్ అదిరిపోయింది. ఆమె వల్లనే హీరో నిజాం నవాబ్ కి దొరకడం, ఆయన కొహినూర్ వజ్రాన్ని తీసుకురావాలని చెప్పడం, దానికోసం ఢిల్లీకి వీరమల్లు వెళ్లాల్సి వస్తుంది. అలా నిధి అగర్వాల్ కూడా తన మార్క్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. కానీ ఈ చిత్రం హిట్ కాకపోవడంతో ఆమె పాత్ర పెద్దగా హైలైట్ కాలేదు.
దీనికంటే ముందే `విరూపాక్ష`లోనూ ఇదే జరిగింది. ఇందులో సాయితేజ్ హీరో. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. ఆమె ప్రారంభం నుంచి హీరోతో ప్రేమలో ఉంటుంది. వీరిద్దరు డ్యూయెట్లు పాడుకుంటారు. చివరికి పెద్ద షాకిస్తుంది. సినిమాలో అసలు విలన్ ఆమెనే అని క్లైమాక్స్ లో తెలుస్తుంది. అది హీరోకి, ఊరికి పెద్ద షాకిస్తుంది. ఈ ట్విస్టే సినిమా సక్సెస్ కి కారణమని చెప్పొచ్చు. దీంతో సంయుక్త పాత్ర కూడా బాగా హైలైట్ అయ్యింది. ఇలా హీరోయిన్లు అప్పటి వరకు హీరోయిన్‌గా ఉండి, చివర్లో తమ విలనిజం చూపించి ఆకట్టుకుంటున్నారు. సినిమా సక్సెస్‌లో భాగమవుతున్నారు.