
బాలకృష్ణతో నటించిన `సమరసింహారెడ్డి` చిత్రంతో తెలుగులో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది హీరోయిన్ సిమ్రాన్. ఈ చిత్రంతో స్టార్ అయిపోయింది. తెలుగులో బిజీ అయిపోయింది. అయితే సిమ్రాన్ కేవలం తెలుగులోనే కాదు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేసి మెప్పించింది. అక్కడ కూడా స్టార్‌గా రాణించింది. అప్పట్లో బిగ్ స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది. వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పెళ్లి తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న సిమ్రాన్ ఇటీవల మళ్లీ వైరల్‌గా మారింది. ఆ మధ్య తమిళంలో ఆమె నటించిన `టూరిస్ట్ ఫ్యామిలీ` చిత్రం పెద్ద విజయం సాధించింది. దీంతో మరోవైపు అందరి చూపు సిమ్రాన్‌పై పడింది. తెలుగు మేకర్స్ కూడా ఆమెని మళ్లీ టాలీవుడ్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.
సిమ్రాన్ ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా వెళ్తోంది. ఏడాదికి రెండు మూడు సినిమాలు తప్ప ఎక్కువగా చేయడం లేదు. అందులోనూ తమిళంకే పరిమితమయ్యింది. ఇక తెలుగులో ఆమె `ఒక్కమగాడు`, `జాన్ అప్పారావు 40 ప్లస్` చివరి చిత్రాలుగా చెప్పొచ్చు. 2008 తర్వాత మళ్లీ తెలుగువైపు చూడలేదు. సిమ్రాన్ టాలీవుడ్‌ని వదిలేసి ఆల్మోస్ట్ 17ఏళ్లు అవుతుందని చెప్పొచ్చు. తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుందా? కోలీవుడ్ కే పరిమితమవుతుందా? అనేది సస్పెన్స్ గా మారిన నేపథ్యంలో సిమ్రాన్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆమె అరుదైన ఇంటర్వ్యూ విషయాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
మహారాష్ట్రకి చెందిన సిమ్రాన్ సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుందట. డ్రెసెస్ అంటే చాలా ఇష్టం. కొత్త కొత్త సూట్‌లు డిజైన్లు చేయాలని కలలు కన్నదట. కానీ అనుకోకుండా యాంకర్‌గా మారాల్సి వచ్చిందని చెప్పింది సిమ్రాన్. ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకుంది. డీడీ(దూరదర్శన్) మెట్రోలో యాంకర్ సెలక్షన్స్ జరుగుతున్నాయంటే వెళ్లితే, అనుకోకుండా సెలక్ట్ అయ్యిందట. అమ్మ కూడా ప్రోత్సహించడంతో ఆ రంగంలోకి కొనసాగింది. డీడీలో `సూపర్‌హిట్ ముకాబులా` షోకి యాంకర్‌గా చేసి పాపులర్ అయ్యింది. ఆ టైమ్‌లో తాను తీసుకున్న పారితోషికం రూ.3500. ఇది సిమ్రాన్ తొలి పారితోషికం. ఇది ముప్పై(1995) ఏళ్ల క్రితం పారితోషికం కావడం విశేషం.
డీడీలో సిమ్రాన్ యాంకరింగ్, చలాకీతనం, లుక్స్, ఫిజిక్ చూసి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భార్య, నటి జయా బచ్చన్ ముచ్చటపడింది. ఆ టైమ్‌లో వాళ్లు తన ప్రొడక్షన్‌లో సినిమాని నిర్మిస్తున్నారు. అంతా కొత్తవాళ్లతోనే ఈ మూవీని రూపొందిస్తున్నారట. హీరోయిన్ పాత్ర కోసం సిమ్రాన్ అయితే బాగుంటుందని ఆమెని పిలిపించారు. అమితాబ్ బచ్చన్ ప్రొడక్షన్ నుంచి పిలుపు అంటే మామూలు విషయం కాదు, దీంతో మరో మాట లేకుండా ఆడిషన్‌కి వెళ్లిందట సిమ్రాన్. అలా `సనమ్ హార్‌జాయ్` అనే చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది సిమ్రాన్. తొలిసారిగా మేకప్ వేసుకుని, ఖరీదైన దుస్తులు ధరించి హీరోయిన్‌గా కెమెరా ముందు నిలబడ్డ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది సిమ్రాన్. అలా తన సినిమా జీవితం ప్రారంభమైందని చెప్పింది. అయితే మధ్యలో మళ్లీ ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ వెళ్లాలని అనుకుందట. కానీ వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో ఇక బ్యాక్ వెళ్లలేకపోయినట్టు చెప్పింది సిమ్రాన్. రూ.3500 తో కెరీర్ ప్రారంభించిన సిమ్రాన్ హీరోయిన్‌గా పీక్‌లో ఉన్నప్పుడు దాదాపు రూ.కోటి వరకు తీసుకుందట. ఇప్పుడు ఒక్కో మూవీకి రూ.30-40లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం.
తెలుగులో తనకు తొలి చిత్రం `అబ్బాయిగారి పెళ్లి`, అది పెద్దగా ఆడలేదని, ఆ తర్వాత రెండేళ్లపాటు తెలుగులో మూవీస్ చేసినా గుర్తింపు రాలేదని, ఆ సమయంలో బాలకృష్ణతో `సమరసింహారెడ్డి` మూవీలో నటించే ఛాన్స్ వరించిందని, ఆ మూవీ పెద్ద విజయం సాధించడంతో తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చినట్టు తెలిపింది సిమ్రాన్. తెలుగు ఆడియెన్స్ తనని ఎంతగానో ప్రేమించి, ఆదరించారని చెప్పింది సిమ్రాన్. ఇంతటి ప్రేమ, ఆదరణ తనకు దక్కిన అదృష్టమని వెల్లడించింది. దాదాపు 13ఏళ్ల క్రితం తన ఇంటర్వ్యూలో సిమ్రాన్ ఈ విషయాలను పంచుకున్నారు. యాభై ఏళ్లు వచ్చినా ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటోంది సిమ్రాన్. మరి తెలుగులోకి మళ్లీ ఎప్పుడు కమ్ బ్యాక్ అవుతుందో చూడాలి.