
సీనియర్ హీరోయిన్ లయ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఆమె మూవీస్‌కి దూరమయ్యింది. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో బలమైన పాత్రలు పోషించేందుకు రెడీ అవుతుంది.
తాజాగా ఆమె `తమ్ముడు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. నితిన్ హీరోగా రూపొందిన చిత్రమిది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ మూవీ త్వరలోనే(జులై 4) ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
లయ `తమ్ముడు` చిత్రంలో అక్క పాత్రలో నటిస్తోంది. ఝాన్సీ కిరణ్మై పాత్రలో నితిన్‌కి అక్కగా నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసే పోరాటమే ఈ మూవీ అని తెలుస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ సాగుతుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. నితిన్ చాలా ఏళ్ల తర్వాత హిట్ కొట్టబోతున్నాడనే హింట్ ని ఈ చిత్రం ఇస్తోంది. మరి అది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. అయితే ఇందులో లయ పాత్ర బలంగా ఉండబోతుందని తెలుస్తోంది.
ఈ క్రమంలో `తమ్ముడు` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా, ఆమె పలు మీడియా సంస్థలతో ముచ్చటించింది. ఇందులో తన విష్ వెల్లడించింది. అదే సమయంలో తనలో ఉండిపోయిన ఓ కోరికని బయటపెట్టింది లయ.
తనకు చిరంజీవితో కలిసి నటించాలనే కోరిక ఉండేదట. తాను హీరోయిన్‌గా ఉన్నప్పుడు బాగా కోరుకుందట. ఒక్కొక్కరు ఒక్కో స్టేజ్ నుంచి వస్తారు, హీరోయిన్‌గా రాణిస్తారు. స్టార్‌గా ఎదుగుతారు. సక్సెస్‌ని బట్టి వారి రేంజ్ పెరుగుతుంది.
తాను కూడా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. ఒక స్టేజ్‌కి వచ్చాక మరో స్టేజ్‌కి వెళ్లాలనుకుంటాం. అలా మిగిలిన చాలా మంది హీరోలతో నటించాను. కానీ చిరంజీవితో వర్క్ చేయలేదు. ఆయనతో సినిమా చేయాలని చాలా ఉండేది. కానీ ఆ కోరిక తీరలేదు.
ఆయనతో సినిమా చేయలేకపోయాననే వెలితి అలానే ఉండిపోయింది. ఆ అసంతృప్తి ఇప్పటికీ ఫీలవుతుంటానని చెప్పింది లయ. అయితే ఇప్పుడు మళ్లీ అవకాశం వస్తే ఆయనతో సినిమా చేయాలని ఉందని వెల్లడించింది. ఆయనతో చేస్తే తనకు ఒక సంతృప్తి కలుగుతుందని వెల్లడించింది.
మరి తన కోరిక చిరంజీవి వరకు వెళ్తుందా? మేకర్స్ ఆమెకి చిరంజీవి చిత్రాల్లో ఆఫర్ చేస్తారా? అనేది చూడాలి. ఇది సినిమా పరిశ్రమ ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. దర్శకులు తలుచుకుంటే, చిరంజీవి అనుకుంటే అది పెద్ద సమస్య కాదు. మరి లయకు ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
లయ కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే ఆమె పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు. చాలా వరకు సెకండ్ రేంజ్ హీరోలతోనే మూవీస్ చేసింది. శ్రీకాంత్, జగపతిబాబు, శివాజీ, వేణు తొట్టెంపూడి వంటి వారితో కలిసి నటించింది.
మంచి విజయాలు అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, కామెడీ చిత్రాలు ఎక్కువగా చేసింది లయ. అవి మంచి విజయాలు సాధించాయి. దీంతో లయ స్టార్ హీరోయిన్‌గా రాణించింది.
అయితే కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. అమెరికాలో సెటిల్ అయిన గణేష్ గోర్ల్టీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలు మానేసింది. అమెరికా వెళ్లిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.
ఇప్పుడు పిల్లలు పెద్దగయ్యారు. ఫ్యామిలీ రెస్పాన్సిబులిటీ నుంచి ఆమె కొంత రిలీఫ్ అయ్యింది. దీంతో మళ్లీ సినిమాలు చేస్తోంది లయ. అందులో భాగంగా `తమ్ముడు` చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది.
తెలుగు అమ్మాయి అయిన లయ 1992లో `భద్రం కొడుకో` చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఏడేళ్లకి `స్వయంవరం` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.
ఈ చిత్రంతోనే అటు హీరోగా వేణు తొట్టేంపూడి, హీరోయిన్‌గా లయ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ దీంతో వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి.
`మా బాలాజీ`, `మనోహరం`, `మనసున్న మహరాజు`, `కోదండరాముడు`, `రామా చిలకమ్మా`, `హనుమాన్ జంక్షన్`, `ప్రేమించు`, `మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది`, `నాలో ఉన్న ప్రేమ`, `కొండవీటి సింహాసనం`, `శివరామరాజు`, `నీ ప్రేమకై`, `నువ్వు లేక నేను లేను`, `పెళ్లాంతో పనేంటి`, `మిస్మమ్మ`, `నేను పెళ్లికి రెడీ`, `విజయేంద్రవర్మ`, `స్వరాభిషేకం`, `అదిరిందయ్యా చంద్రం`, `టాటా బీర్లా మధ్యలో లైలా` వంటి కామెడీ చిత్రాల్లో హీరోయిన్‌గా రాణించింది లయ.
లయ నటించే సమయంలో గ్లామర్ కి స్కోప్ ఎక్కువగా ఉంది. చాలా మంది హీరోయిన్లు గ్లామర్ షో చేసి ఆఫర్లు అందుకున్నారు. స్టార్స్ గా ఎదిగారు. కానీ ఎప్పుడూ ఆ దిశగా ఆమె అడుగులు వేయలేదు. నిజమైన తెలుగు అమ్మాయి అనిపించింది.
చాలా వరకు ట్రెడిషనల్ లుక్‌లోనే కనిపించింది. సౌందర్య, ఆమని వంటి వారి తర్వాత అలా చీరలో, సాంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. తనదైన నటనతో ఆకట్టుకుంది. కెరీర్ మొత్తంలో ఆమె గ్లామర్‌కి దూరంగా ఉంది. అయినా హీరోయిన్‌గా రాణించడం విశేషమనే చెప్పాలి.
అందుకే లయ అంటే అందరికి ప్రత్యేకమైన గౌరవం. అదే గౌరవం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇటీవల రీఎంట్రీ సందర్భంగా `తమ్ముడు` ప్రెస్ మీట్‌లో ఆమె ఎమోషనల్ అయ్యింది.
ఇప్పటికీ తనని తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తున్నారని, ఇంత బాగా వెల్‌కమ్ చెప్పడం సంతోషంగా ఉందని చెప్పింది లయ. తన భర్త, పిల్లల సపోర్ట్ తోనే తాను మళ్లీ సినిమాల్లో నటిస్తున్నట్టు వెల్లడించడం విశేషం.