హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా కోడలు అవుతున్న విషయం తెలిసిందే. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఆమెను ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. గత ఐదేళ్లుగా వీరు డేటింగ్ చేస్తున్నారని సమాచారం. 2017లో మిస్టర్ మూవీ కోసం జత కట్టిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. గత రెండేళ్లుగా వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. రెండు రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. జూన్ 9న నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేశారు.
నాగబాబు నివాసమైన మణికొండ ఫామ్ బీడ్ గేటెడ్ కమ్యూనిటీలో వరుణ్ తేజ్-లావణ్యల నిశ్చితార్థం వేడుక జరుగుతుంది. సాయంత్రం 7-8 గంటల మధ్య వరుణ్-లావణ్య ఉంగరాలు ఒకరికొకరు ధరింపజేసి నిశ్చితార్థం పూర్తి చేశారు. వరుణ్ తేజ్ నిశ్చితార్థం వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వచ్చింది. రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి పాటు కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ ఈవెంట్ కి కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానం ఉంది. పరిశ్రమ వర్గాలను పిలవలేదు. ఈ ఏడాది చివర్లో వివాహం పరిశ్రమ ప్రముఖుల సమయంలో ఘనంగా నిర్వహించనున్నారట. అందుకే సినిమా పెద్దలకు, సన్నిహితులకు పిలుపు లేదు.
ఇక మూడేళ్ళ వ్యవధిలో నాగబాబు ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరగనున్నాయి. 2020 డిసెంబర్ లో కూతురు నిహారిక వివాహం వైభవంగా చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఐదు రోజుల పాటు నిహారిక-జొన్నలగడ్డ వెంకట చైతన్య వివాహ వేడుక నిర్వహించారు. వరుణ్ తేజ్ పెళ్లి కూడా డిసెంబర్ నెలలో ఉండొచ్చు అంటున్నారు. మరి వరుణ్ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా లేక హైదరాబాద్ లోనే వేదిక ఏర్పాటు చేస్తారా? అనేది చూడాలి.
కాగా లావణ్య త్రిపాఠి కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. ఇటీవల లావణ్య పులి మేక టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేశారు. ఇది కూడా సక్సెస్ కాలేదు. జీ 5లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్లో లావణ్య పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడం విశేషం. అలాగే ఆమె చివరి చిత్రం హ్యాపీ బర్త్ డే సైతం నిరాశపరిచింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ అన్న ఇమేజ్ తో పాటు ఖాతాలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ నిలదొక్కుకోలేక పోయింది లావణ్య త్రిపాఠి దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరింది. ఇకపై ఆమె నటనకు గుడ్ బై చెప్పే అవకాశం కలదు.
ఇక వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరుణ్ కి జంటగా సాక్షి నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే నూతన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తో మరో చిత్రం చేస్తున్నారు. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్, రినైజాన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.