సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం కసరత్తు చేస్తున్నారు. రాజ కుమారుడుతో కెరీర్ ప్రారంభించిన మహేష్.. ప్రతి చిత్రంతో ఒక్కో మెట్టు ఎదుగుతూ తన తండ్రి గర్వపడేలా చేశారు. మహేష్ బాబు ఒక్కడు చిత్రంతో తొలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
పోకిరి చిత్రంతో సౌత్ లో తిరుగులేని స్టార్ హీరోగా మారిపోయారు. బాక్సాఫీస్ కి బిజినెస్ మాన్ అయిపోయాడు. అప్పటి నుంచి మహేష్ నటించే ప్రతి చిత్రానికి ఆకాశాన్ని తాకే అంచనాలు ఉంటున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళ చిత్రంతో గ్లోబల్ మార్కెట్ పైనే కన్నేశాడు. అయితే మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్ని కమర్షియల్ హిట్ అందుకున్నప్పటికీ తన తండ్రిని మెప్పించిన చిత్రం అంటేనే ఎంతో ప్రత్యేకం.
ఒక చిత్రంలో మహేష్ నటన చూసి సూపర్ స్టార్ కృష్ణ సైతం ఆశ్చర్యపోయారు. ఆ చిత్రం మరేదో కాదు.. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి. మురారి మహేష్ కెరీర్ లో ఎప్పటికి ఒక స్పెషల్ అనే చెప్పాలి. జాతకాలు, కుటుంబానికి తగిలిన శాపం, ఫ్యామిలీ ఎమోషన్స్ లాంటి ఎలిమెంట్స్ తో తెరకెక్కిన మురారి చిత్రంలో మహేష్ బాబు అల్రౌండ్ పెర్ఫామెన్స్ చూడొచ్చు.
ఈ చిత్రం విడుదలై నేటికి 23 ఏళ్ళు పూర్తయింది. దర్శకుడు కృష్ణ వంశీ ఎంతో అందంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సోనాలి బింద్రేతో కెమిస్ట్రీ కూడా బాగా పండింది. నటి లక్ష్మి, సత్య నారాయణ, శివాజీ రాజా, మారుతీ రావు ఇలా చాలా మంది నటీనటులు ఉన్నారు. ఈ చిత్రానికి అనేక నంది అవార్డులు కూడా దక్కాయి. మహేష్ నటనకు స్పెషల్ జ్యురి అవార్డు లభించింది.
ఒక సందర్భంలో మహేష్ బాబు ఈ చిత్రం గురించి గుర్తు చేసుకున్నారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణకి అంత్యంత ఇష్టమైన చిత్రం మురారినే అట. ఈ చిత్రం రిలీజ్ అయినప్పుడు మహేష్, కృష్ణ ఇద్దరూ ఒక థియేటర్ లో చూశారట. షో అయిపోగానే కృష్ణ ఒక్క మాట కూడా మాట్లాడలేదట. మహేష్ నటనకి ఎంతో భావోద్వేగానికి గురవుతూ భుజం పై చేయి వేసి తట్టారట.
ఆయన కంటి వెంట ఆనంద భాష్పాలు వచ్చాయట. మిగిలిన సినిమాలకు ఏదో ఒక కాంప్లిమెంట్ ఇస్తుంటారు. కానీ మురారి చిత్రానికి ఒక్క మాట కూడానా మాట్లాడకుండా తన సంతోషం మొత్తాన్ని కళ్ళల్లో చూపించారని మహేష్ గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఈ చిత్రం విడుదలై 23 ఏళ్ళు గడచిపోయింది.