మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాను రాను తెలుగు హీరో అయిపోతున్నాడు. ఆయన `యాత్ర` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. ఆ తర్వాత `ఏజెంట్`లో మెరిసి సర్ప్రైజ్ చేశాడు. ఇటీవల `యాత్ర 2`లోనూ వైఎస్‌గా అలరించారు. తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యాడు. దీంతో మలయాళంలో నటించిన ఆయన సినిమాలు ఇప్పుడు తెలుగు స్టేట్స్ లోనూ విడుదలవుతున్నాయి. అలా లేటెస్ట్ గా `భ్రమయుగం` అనే మూవీ వచ్చింది. మలయాళంలో తెరకెక్కిన చిత్రమిది. అదే భాషలో తెలుగు స్టేట్స్ లో విడుదల చేశారు. ఆ ఫీల్ మిస్ కాకుడదనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక రాహుల్ సదా శివన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ గురువారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
అది ఆంగ్లేయులు కేరళాని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న రోజులు. మంత్రాలు, తంత్రాల హవా సాగుతుంది. ఆ సమయంలో తక్కువ కులానికి చెందిన తేవన్(అర్జున్ అశోకన్) జానపద గాయకుడిగా రాణిస్తుంటాడు. ఆయన తన తల్లి వద్దకు వెళ్తూ అడవిలో తప్పిపోతాడు. ఆకలితో అలమటిస్తుంటాడు. అడవి నుంచి బయటకు ఎలా వెళ్లాలో తెలియదు. అందులో ఉన్న ఓ బంగాళకి చేరతాడు. అందులో యజమాని కుడుమోన్ పొట్టి(మమ్ముట్టి), ఆయన వంటవాడు(సిద్ధార్థ్ భరతన్) మాత్రమే ఉంటారు. తేవన్‌ని ఆప్యాయంగా చేరదీస్తారు. బాగా ఆకలిగా ఉన్న తేవన్ ఆకలి తీరుస్తారు. దీంతో వాళ్లు ఎంతో మంచి వాళ్లని భావిస్తాడు. కానీ యజమాని కుడుమోన్ పొట్టి ట్రాప్‌లో పడ్డామనే విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకుంటాడు. దీంతో వాళ్ల నుంచి, అడవిలో నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఎంత ప్రయత్నించినా, కుడుమోన్ మంత్ర శక్తులతో తిరిగి ఆ బంగ్లాకే చేరుకుంటారు. మరి కుడుమోన్ అ గాయకుడిని ఎందుకు తన ట్రాప్‌లో వేసుకుంటున్నాడు. కుడుమోన్ గురించి తెలిసినా వంటగాడు ఎందుకు ఆయన వద్దే ఉంటున్నాడు? ఇంతకి కుడుమోన్ పొట్టి ఎవరు? ఆయన ఎందుకు అక్కడ ఉంటున్నాడు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
మలయాళంలో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ వస్తాయి. బిగ్ స్టార్స్ కూడా చిన్న చిన్న పాయింట్‌తో సినిమాలు చేసి విజయాలు అందుకుంటారు. అదే సమయంలో ప్రయోగాలు చేయడంలోనూ ముందే ఉంటారు. `యాత్ర` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి చేరువైన మమ్ముట్టి కూడా అనేక ప్రయోగాలు చేశారు. సక్సెస్ అయ్యాడు. మెగాస్టార్ అనే ఇమేజ్‌ని పక్కన పెట్టి ఆయన సింపుల్స్ రోల్స్ చేసి మెప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఆయన ప్రయోగంలో మరో మూవీనే `భ్రమయుగం`. చిన్న పాయింట్‌తో రూపొందిన చిత్రమిది. కానీ రెండున్నర గంటలపాటు ఆడియెన్స్ ని ఎంగేజ్ చేయడమే ఈ మూవీ ప్రత్యేకత. అది దర్శకుడి టాలెంట్ కే నిదర్శనమైతే, హీరో మమ్ముట్టి అద్భుతమైన నటనకు నిదర్శనంగా నిలుస్తుంది. ఓ రకంగా ఆయన నటన విశ్వరూపానికి నిదర్శనంగా నిలుస్తుంది. కేవలం మూడు పాత్రలతోనే సినిమా సాగుతుంది. ఆ మూడు పాత్రల అద్భుతమైన నటన, బీజీఎం ఆడియెన్స్ ని సీట్ల నుంచి కదలకుండా చేయడమంటే మాటలు కాదు. అంతేకాదు బ్లాక్ అండ్ వైట్‌లో ఈ మూవీని తీసి మెప్పించడం మరో గొప్పదనం.
కథగా చూస్తే చాలా చిన్న పాయింటే. పాడుబడ్డ భవంతిలో ఇద్దరు వ్యక్తులు, మాంత్రికుడు మాయలో పడ్డ గాయకుడి కథ. కానీ ఆయా సీన్లని మలిచిన తీరు, నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఎంగేజ్ చేస్తుంది. సినిమాలో హర్రర్ ఎలిమెంట్లు ఉంటాయి. కానీ భయపెట్టేలా ఉండవు. ఎక్కువగా థ్రిల్లర్ ఎలిమెంట్లతోనే సాగుతుంది. అయితే ప్రారంభంలో విలేజ్ ప్రధానంగా సినిమా సాగుతుంది. నెమ్మదిగా ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. పాత్రల పరిచయం తదనాంతర సన్నివేశాలు కాస్త స్లోగా సాగుతాయి. ఫస్టాఫ్ వరకు కాస్త నెమ్మదిగా సాగినా, సెకండాఫ్‌లో మాత్రం ఆ ఫీలింగ్ లేకుండా చేస్తుంది. పూర్తిగా ఆడియెన్ సినిమాలోకి ఇన్‌వాల్వ్ అయిపోతాడు. అందులో ప్రయాణిస్తాడు. థ్రిల్‌కి గురి చేస్తుంది, ఉత్కంఠకి గురి చేస్తుంది. మొత్తంగా మనల్ని మనం మర్చిపోయేలా చేస్తుంది. ఇక క్లైమాక్స్ మాత్రం నెక్ట్స్ లెవల్. అయితే నెమ్మదిగా సాగే సన్నివేశాలు కొంత బోర్ తెప్పిస్తాయి. ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది.
మరోవైపు నటీనటుల అద్భుతమైన నటన, అలాగే బీజీఎం, విజువల్స్ మెస్మరైజ్ చేస్తాయి. కుడుమోన్ పొట్టి పాత్రలో మమ్ముట్టి విశ్వరూపం చూపించాడు. మనకు ఆ పాత్రనే కనిపించేలా చేస్తాడు. అంతేకాదు సినిమా మొత్తం ఆయన కేవలం ఒకే కాస్ట్యూమ్స్ తో, పైగా షర్ట్ లేకుండా కనిపించడం సాహసమనే చెప్పాలి. ఇక నటుడిగా ఆయనలోని మరో యాంగిల్‌ని చూపించాడు. జానపద గాయకుడి పాత్రలో అర్జున్ ఆశోకన్ సైతం పాత్రలో ఎదిగిపోయాడు. పాటలు పాడేటప్పుడు హవాభావాలు అదిరిపోయాయి. వంటగాడిగా సిద్ధార్థ్ భరతన్ సైతం మెప్పించాడు.
క్రిస్టో జేవియర్ మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. బీజీఎం, పాటలు కూడా మనకు మంచి ఫీలింగ్‌నిస్తాయి. ముఖ్యంగా బీజీఎం సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుంది. మరోవైపు షెహనాద్ జలాల్ కెమెరా వర్క్ కూడా బాగుంది. బ్లాక్ అండ్ వైట్‌లోనూ ఆ ఫీలింగ్ లేకుండా చేయడమంటే అది సినిమాటోగ్రాఫర్ పనితీరుకి నిదర్శనమనే చెప్పాలి.
ఫైనల్‌గాః ఓవరాల్‌గా ఇదొక కొత్త రకమైన థ్రిల్లర్ మూవీ. మంచి విజువల్ ట్రీట్.