హర్ష్ రోషన్ నటించిన ‘AIR - ఆల్ ఇండియా ర్యాంకర్స్’ వెబ్ సిరీస్ రివ్యూ

Published : Jul 04, 2025, 06:18 PM IST

జూలై 3న ఈటీవీ విన్ ఓటీటీలోకి ‘ఎయిర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ (AIR)’ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలో నటించాడు. 

PREV
16
‘AIR - ఆల్ ఇండియా ర్యాంకర్స్’ వెబ్ సిరీస్ రివ్యూ

హిందీ, మలయాళం ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ లకు ధీటుగా టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ఓటీటీ కంటెంట్ తీసుకువస్తున్నారు. క్రమంగా తెలుగులో కూడా ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ లు పెరుగుతున్నాయి. రీసెంట్ గా జూలై 3న ఈటీవీ విన్ ఓటీటీలోకి ఎయిర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ (AIR) అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది.  

హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ని విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, ఇబ్బందులు, స్నేహం, చిన్న చిన్న సంతోషాలు లాంటి అంశాల ఆధారంగా హాస్యం మిక్స్ చేసి తెరకెక్కించారు. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించగా, ప్రముఖ దర్శకుడు, నటుడు సందీప్ రాజ్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ సిరీస్ లో హర్ష్ రోషన్, జయతీర్థ, భాను ప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించగా చైతన్య రావు, హర్ష చెముడు, సునీల్, సందీప్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రియులని ఆకట్టుకుందా ? వినోదాన్ని అందించే విధంగా ఉందా? అనేది సమీక్షలో తెలుసుకుందాం. 

26
కథ

అర్జున్(హర్ష్ రోషన్), ఇమ్రాన్(భాను ప్రకాష్) , రాజు (జయతీర్థ) అనే ముగ్గురు యువకులు టెన్త్ తర్వాత విజయవాడలో ఐఐటీ కోచింగ్ కి పేరుగాంచిన AIR అనే కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు. బిగినింగ్ లో ఈ ముగ్గురు కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. కానీ కొద్ది రోజుల తర్వాత కాలేజీలో ఉండే రాజకీయాలు, ఒత్తిడులు, ఇతర సమస్యలతో చాలా ఇబ్బంది పడతారు. ఈ ఇబ్బందికర పరిస్థితులే ఈ ముగ్గురి మధ్య స్నేహాన్ని పెంచుతాయి. ఒక దశలో ఈ ముగ్గురు యువకులు తమ సమస్యలకు పరిష్కారంగా సంచలన నిర్ణయం తీసుకుంటారు. దీనితో పరిస్థితులు ఉత్కంఠగా మారిపోతాయి. ఇంతకీ ఆ ముగ్గురు తీసుకున్న నిర్ణయం ఏంటి ? దాని వల్ల వాళ్ళ సమస్యలు పెరిగాయా తగ్గాయా ? ఇలాంటి అంశాలు సిరీస్ చూసి తెలుసుకోవాలి. 

36
విశ్లేషణ

కాలేజీ నేపథ్యంలో చాలా చిత్రాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. దేనికదే ప్రత్యేకంగా ఉంటేనే ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉంటుంది. ఆ విషయంలో దర్శకుడు జోసెఫ్ క్లింటన్ విజయవంతం అయ్యారు. AIR సిరీస్ కథలో కామెడీ ఎలిమెంట్స్ కడుపుబ్బా నవ్వించడమే కాదు, చాలా క్లీన్ గా ఉంటాయి. యువతను బాగా ఎట్రాక్ట్ చేస్తాయి. ప్రారంభ ఎపిసోడ్స్‌లో హాస్యం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ముగ్గురు యువకుల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ కూడా కథలో కీలకం అవుతుంది. దీనితో పరిణామాలు ఎమోషనల్ గా మారుతాయి. 

 కాలేజ్ వ్యవస్థాపకుడి పాత్రలో సునీల్ కనిపిస్తే, కాలేజ్ హెడ్‌గా సందీప్ రాజ్ నెగటివ్ షేడ్‌లో మెప్పించారు. సునీల్ పాత్ర ఎంట్రీ తర్వాత కథ మరింత ఆసక్తిగా మారుతుంది. ర్యాంకుల కోసం విద్యార్థులని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు చేసే ఒత్తిడి, విద్యార్థుల తల్లిదండ్రులని ఆకర్షించేందుకు వాళ్ళు చేసే జిమ్మిక్కులని చాలా ఆసక్తికరంగా చూపించారు. అప్పుడే కాలేజీ జీవితం మొదలు పెట్టిన కుర్రాళ్ళు ఎలాంటి అల్లరి చేస్తారు ? కాలేజీలో సిల్లీ రీజన్స్ తో స్నేహితులతో జరిగే గొడవలు నవ్వించడం మాత్రమే కాదు.. చూసేవారికి తమ కాలేజీ రోజులని గుర్తు చేసే విధంగా ఉంటాయి. 

46
నటీనటులు

కోర్ట్ చిత్రంలో అదరగొట్టిన హర్ష్ రోషన్ AIR వెబ్ సిరీస్ తో దక్కిన మరో అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. అతడి నటన, డైలాగ్ డెలివరీ బాగుంది. హర్ష్ రోషన్ తన పాత్రని కాన్ఫిడెన్స్ తో చేసి మరింత రక్తి కట్టించాడు. భాను ప్రకాశ్, జయతీర్థ తమ పాత్రలకు న్యాయం చేశారు. చైతన్య రావు పోషించిన లెక్చరర్‌ పాత్రకు కూడా ఆడియన్స్ నుంచి మంచి స్పందన రావడం గ్యారెంటీ. జీవన్ కుమార్ కు చాలా మంచి రోల్ దక్కింది. అతడి పాత్రలో హాస్యం, ఎమోషన్ ఇలా మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. సందీప్ రాజ్ విలన్‌గా బాగా నటించారు. సునీల్ పాత్ర చిన్నదైనా బలమైనదిగా నిలిచింది.

56
టెక్నీషియన్లు

సింజిత్ ఎర్రమిల్లి నేపథ్య సంగీతం కథకి తగిన విధంగా ఉంది. మనోజ్ సినిమాటోగ్రఫీ బావుంది. హాస్టల్ సెటప్ సన్నివేశాలని నేచురల్ గా చూపించారు. దర్శకుడు జోసెఫ్ క్లింటన్ పనితీరు బావుంది. డైలాగులు చాలా బాగా కుదిరాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. 

66
ఫైనల్‌గా

AIR ఆల్ ఇండియా ర్యాంకర్స్ సిరీస్‌ లో కామెడీ, ఎమోషన్, మెసేజ్‌ అంశాలు చక్కగా కుదిరాయి. విద్యార్థులు మాత్రమే కాకుండా ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది.

Read more Photos on
click me!

Recommended Stories